Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐదో సీజన్‌ని కూడా త్వరలోనే ప్రారంభించాలని నిర్వాహకులు అనుకుంటున్నారట. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభం చేసినట్లు సమాచారం. ఇక గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్‌ని గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నారట నిర్వాహకులు. ఈ క్రమంలో ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు కంటెస్టెంట్ల విషయంలోనూ రాజీ పడకూడదని వారు అనుకుంటున్నారట. ఇక ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఏప్రిల్ లేదా మేలో బిగ్‌బాస్ ఐదవ సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు పలువురు ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం బిగ్‌బాస్ 4 అని తెలుస్తోంది.
కాగా బిగ్‌బాస్ 4 ప్రారంభం కాకముందు వరకు ఈ షోపై కొన్ని అపోహలు ఉండేవి. అంతకుముందు మూడు సీజన్లలో పాల్గొన్న వారిలో బయటకు వచ్చాక ఎవ్వరూ బిజీగా మారలేకపోయారు. బిగ్‌బాస్ విజేతలకు సైతం పెద్దగా ఆఫర్లు రాకపోగా.. కొందరైతే ఈ షోలో పాల్గొని తమ రెప్యుటేషన్‌ని కూడా పోగొట్టుకున్నారు. దీంతో బిగ్‌బాస్ రియాలిటీ షోపై చాలా మందికి అపోహలు వచ్చాయి. హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న చాలా మంది ఆ తరువాత బిజీగా అయినప్పటికీ.. ఇక్కడ మాత్రం అలాంటి సీన్ లేకపోవడంతో ఇందులో పాల్గొనేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ 4లో యూట్యూబర్లు, యాంకర్లను తీసుకువచ్చారని టాక్ కూడా ఉంది.
దీంతో ఈ సీజన్‌కి రేటింగ్స్ కూడా మొదట్లో చాలా తక్కువనే వచ్చాయి. అయితే వారితోనూ ఎంటర్టైన్మెంట్ని బాగానే ఇవ్వగలిగారు నిర్వాహకులు. ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి హయ్యెస్ట్ రేటింగ్ వచ్చింది. అది మొత్తం బిగ్‌బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కావడం విశేషం. అంతేకాదు ఇందులో పాల్గొన్న పలువురికి ఇప్పుడు ఆఫర్లు మంచిగా వస్తున్నాయి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లిన పలువురు ఆ తరువాత మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ఇందులో పాల్గొన్న సొహైల్, మోనాల్ ఇప్పటికే బిజీ అయిపోగా.. మెహబూబ్, దివి, స్వాతి దీక్షిత్‌లకు కూడా ఆఫర్లు వచ్చాయి. అలాగే మిగిలిన వారికి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సీజన్ 4 బిగ్‌బాస్ సమీకరణాలను మార్చడంతో ఇప్పుడు ఐదో సీజన్లో పాల్గొనేందుకు పలువురు ఆసక్తిని చూపుతున్నారట. ముఖ్యంగా సినిమాల్లో నటిస్తోన్న వారు కూడా బిగ్‌బాస్ 5లో భాగం అయ్యేందుకు రెడీగా ఉన్నట్లు టాక్. మరి బిగ్ బాస్ 5 ఎప్పుడు ప్రారంభం కానుంది...? ఇందులో ఎవరెవరు నటించనున్నారో..? తెలుసుకోవాలనుకుంటే.. ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.