Abijeet: బిగ్‌బాస్ 4 ముగిసి నెల రోజులు గడిచింది. ఇక ఈ సీజన్ విన్నర్‌గా అందరూ భావించినట్లుగానే అభిజీత్ నిలిచాడు. ఇక బిగ్‌బాస్ విన్నర్‌గా అభిజీత్ గెలుస్తాడని ఊహాగానాలు ప్రారంభమైనప్పటి నుంచే అతడి గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అభిజీత్‌కి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని.. ఆహాలో సమంత వ్యాఖ్యతగా వ్యవహరించిన సామ్ జామ్‌లో రానున్నాడని.. స్టార్ మా ఇప్పటికే అభిజీత్‌తో ఓ షోను ప్లాన్ చేసిందని.. పలువురు దర్శకులు అభిజీత్ కోసం ఎదురుచూస్తున్నారని ఇలా చాలా వార్తలే వచ్చాయి. అయితే వాటిలో ఏది నిజం కాలేదు. అంతేకాదు బయటకు వచ్చి నెల రోజులు గడిచినా..ఇంతవరకు ఏ సినిమాను ప్రకటించలేదు అభిజీత్.
అయితే బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకోవాలనుకుంటోన్న అభిజీత్..ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే ఇంతవరకు చాలా కథలే విన్నప్పటికీ ఏదీ ఒకే చెప్పలేదట. ఇక తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ విన్నర్ తాజాగా ఓ మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతో అభిజీత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే అభిజీత్ ఫ్యాన్స్‌కి కచ్చితంగా శుభవార్త అవుతుంది.
కాగా ఈ సారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. బిగ్‌బాస్ నుంచి వచ్చిన వెంటనే సొహైల్ సినిమాను ప్రకటించారు. ఇక స్వాతి దీక్షిత్‌కి రామ్ గోపాల్ వర్మ సినిమాలో అవకాశం వచ్చింది. ఇటీవల అరియానా కూడా త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతానని చెప్పింది. అలాగే దివికి మెగాస్టార్ తన సినిమాలో పాత్రను ఖరారు చేశారు. ఇక మోనాల్ ఇప్పటికే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు డ్యాన్స్ ప్లస్ షోకు ఒక జడ్జిగా వ్యవహరిస్తున్నారు.