నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, జిస్సు సేన్ గుప్తా, ఆనంత్ నాగ్, రఘు బాబు, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెంకీ కుడుముల
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
నితిన్ హిట్ కొట్టి చాలా ఏళ్ళవుతుంది. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ తెరకెక్కించిన అ..ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు విజయం అందుకోలేదు. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ భీష్మ అంటూ వచ్చాడు. అందులోనూ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రంతో నితిన్ ఎలాంటి మాయ చేసాడో చూద్దాం..
కథ :
రైతుల బాగు కోసం భీష్మ ఆర్గానిక్స్ అంటూ ఓ కంపెనీ స్థాపించి అందులో సేంద్రీయ వ్యవసాయం చేస్తుంటాడు భీష్మ (ఆనంత్ నాగ్). ఆయన వయసు 70 ఏళ్లు దాటడంతో నెక్ట్స్ సీఈఓ ఎవరనే టాపిక్ మొదలవుతుంది. అప్పుడు సడన్‌గా సీన్‌లోకి వస్తాడు భీష్మ (నితిన్). డిగ్రీ ఫెయిల్ అయి తన లవ్ సెట్ చేసుకోవాలని చైత్ర (రష్మిక మందన్న) వెంట పడుతుంటాడు. ఇక అదే సమయంలో ఉన్నట్లుండి ఓ రోజు పెద్దాయన భీష్మను సీఈఓగా ప్రకటిస్తాడు. 30 రోజులు టెస్ట్ పెడతాడు. మరోవైపు భీష్మ ఆర్గానిక్స్ కంపెనీని నాశనం చేయడానికి మరో కార్పోరేట్ విలన్ రాఘవన్ (జిష్షు) అడ్డుపడుతుంటాడు. ఈ సమయంలో పెద్ద భీష్మ ఇచ్చిన టాస్క్ కుర్ర భీష్మ ఎలా పూర్తి చేసాడు.. అదే సమయంలో తన లవ్ ఎలా దక్కించుకున్నాడు అనేది కథ..
కథనం:
సందేశాలు ఇస్తుంటే కచ్చితంగా బోర్ కొడుతుందంటారు ప్రేక్షకులు. ఇప్పటికే చాలా మంది దర్శకులు తెలుగులో మెసేజులు ఇస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మెసేజ్ ఒక్కటే ఇస్తానంటే కచ్చితంగా చాలు అంటూ సైగలు చేస్తారు ఆడియన్స్. కానీ వినోదంతో కలిపి మెసేజ్ ఇస్తే మాత్రం కచ్చితంగా ఆదరిస్తారు. కొరటాల శివ సినిమాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు వెంకీ కుడుముల కూడా ఇదే చేసాడు. తను చెప్పాలనుకున్న సేంద్రీయ వ్యవసాయం అనే కాన్సెప్టును అర్థమయ్యేలా రాసుకున్నాడు ఈయన. ఆ తర్వాత రంగంలోకి దిగాడు. ఎక్కడా చిన్న తడబాటు కూడా లేకుండా పక్కా కమర్షియల్ కోణంలో సందేశాన్ని అన్ని మసాలాలు మిక్స్ చేసి వడ్డించాడు. అందులో ముఖ్యంగా హాస్య రసాన్ని కాస్త ఎక్కువగానే కలిపాడు. దాంతో భీష్మ నవ్వుతో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తుంది. త్రివిక్రమ్ అ..ఆ తర్వాత మళ్ళీ హిట్ లేని నితిన్.. భీష్మతో కచ్చితంగా అంచనాలు అందుకున్నాడు. ఈ చిత్రం మొదట్నుంచి మంచి జోష్‌లో కనిపించాడు. కామెడీ సీన్స్ కూడా చాలా బాగా చేసాడు. ఆయన చుట్టూ రాసుకున్న సీన్స్ అన్నీ బాగా పేలాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, నితిన్ ట్రాక్ అయితే అదుర్స్. బ్రహ్మాజీ వచ్చే రెండు మూడు సీన్స్ కూడా బాగా పేలాయి. ఫస్టాఫ్ అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తూనే.. మరోవైపు కామెడీ కూడా నడిపించాడు వెంకీ. సెకండాఫ్ ఆ డోస్ మరింత పెంచేసాడు. అవసరం అయిన చోట కథ చెప్తూనే.. అందులోనే వినోదాన్ని కూడా మిక్స్ చేసాడు. ముఖ్యంగా పొలం దగ్గర వచ్చే ఫైట్ సీన్.. హీరో విలన్ మీట్ అయ్యే సీన్.. ఇవన్నీ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసాడు దర్శకుడు. అందులో త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక దాంతో పాటే వెన్నెల కిషోర్, రఘు బాబు ట్రాక్ కూడా బాగుంది. ఓవరాల్‌గా చెప్పాల్సిన కథను చెప్తూనే ఎక్కడా ట్రాక్ తప్పకుండా కామెడీతో బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు.
నటీనటులు:
నితిన్ మంచి ఈజ్‌తో నటించాడు. చాలా రోజుల తర్వాత నితిన్ మళ్లీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా కామెడీ కూడా చాలా బాగా చేసాడు. ఇక రష్మిక మందన్న మరోసారి ఆకట్టుకుంది. గీత గోవిందం తరహాలో హీరోను డామినేట్ చేసే పాత్ర ఇది. వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మరోసారి తన మార్క్ కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు. రఘు బాబు, బ్రహ్మాజీ, నరేష్ కూడా బాగానే నవ్వించారు. అశ్వథ్థామ విలన్ జిస్సు సేన్ గుప్తా ఈ చిత్రంలో కార్పోరేట్ విలన్‌గా అదిరిపోయాడు. మంచి నటన కనబర్చాడు.
టెక్నికల్ టీం:
మహతి సంగీతం పర్లేదు. పాటలు ఆకట్టుకోకపోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. చాలా సన్నివేశాలు అతడి కెమెరా వర్క్‌తో హైలైట్ అయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. కథకుడిగా వెంకీ కుడుముల మంచి కథనే రాసుకున్నాడు. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీతో కోటింగ్ ఇచ్చాడు. ఓవరాల్‌గా సందేశాన్నిస్తూనే బోర్ కొట్టించకుండా కథనంతో కట్టిపాడేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా ఒక్కమాట:
భీష్మ.. బాణం గురి తప్పలేదుగా..
రేటింగ్: 3/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, Movie reviews, Telugu Cinema, Tollywood