ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా రాజకీయ నేతలు, సినీ నటులు, క్రీడా దిగ్గజాలు.. ఇలా అందరి జీవితాలు తెరకెక్కుతున్నాయి. తెలుగులో ఇప్పటికే ఈ ట్రెండ్ నడుస్తోండగా.. ఇప్పుడది తమిళ ఇండస్ట్రీకి పాకింది. తమిళ్‌లో ప్రస్తుతం తలైవి పేరుతో జయలలిత జీవితం తెరకెక్కుతుండగా.. అక్కడి స్టార్ హీరో విజయ్ సేతుపతి తమిళ సంతతికి చెందిన శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబందించి ఓ ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. మురళీధరన్ బయోపిక్ చిత్రానికి ‘800’ అని పెరు పెట్టారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్ . అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం పట్ల తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది విజయ్ సేతుపతిని ట్రోల్స్ చేస్తున్నారు. 'షేమ్ ఆన్ విజయ్ సేతుపతి' అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్విటర్లో కొద్ది సేపు ట్రెండ్ అయ్యింది. ఇక తాజాగా ఈ బయోపిక్ పైన తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా స్పందించాడు. ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక మత వాదానికి పూర్తిగా మద్దతు పలికాడని.. ఇండియాకు నమ్మకద్రోహిగా మిగిలిన అతని బయోపిక్ లో విజయ్ నటించడం కరెక్ట్ కాదన్నాడు. దీనికి సంబందించి ఓ ప్రకటనను విడుదల చేశాడు.
#800TheMovie @VijaySethuOffl pic.twitter.com/7G7VUOTSby
— Bharathiraja (@offBharathiraja) October 15, 2020
ఆయన ఇంకా తన నోటులో రాస్తూ.. విజయ్ ఈ మురళీధరన్ బయోపిక్ లో నటించడం వలన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదర్కోనాల్సి వస్తుందని అంతేకాదు ఇది ఆయన కెరీర్‌పైనా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. ఇక ఇన్ని గొడవల మధ్య ఈ సినిమాని 2021 చివరికల్లా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఇక మురళీధరన్ విషయానికి వస్తే శ్రీలంకలోని క్యాండీలో తమిళ హిందూ కుటుంబంలో 1972, ఏప్రిల్ 17న జన్మించాడు. మురళీధరన్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఎనమిది వందల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మురళీధరన్ చివరి సారిగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. కాగా ఆయన ప్రస్తుతం ప్రస్తుతం ఐపియల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamil Film News, Tollywood news