నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్‌ను జరుపుకుంది. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. లాక్ డౌన్లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో షూటింగ్‌ను మళ్లీ మొదలు పెట్టింది చిత్రబృందం. ఈ సినిమా ప్రస్తుతం సారధి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ తాజా షూట్లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్ పై ఓ పాటను చిత్రీకరిస్తోంది చిత్రబృందం. ఈ సాంగ్ లో బాలయ్య కోసం కొన్ని మాస్ స్టెప్స్‌ను ఓ రేంజ్లో డిజైన్ చేశారట. ఈ సినిమాలో మరో హీరోయిన్గా పూర్ణ నటిస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఆయన ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు బాలయ్య. తొలి రెండు సినిమాలు 'సింహా', 'లెజెండ్'.. ఒకదాన్ని మించి మరొకటి భారీ విజయం సాధించడంతో ఈ మూడవ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీతో వారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక బాలయ్య సినిమాలో ప్రముఖ పాత్ర పోషించే విలన్ పాత్ర ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. విలన్ పాత్రధారి ఎంపిక పూర్తికాకపోవడం బోయపాటిని కలవరపరుస్తోందట. ఈ మూవీలో ఒకరికి మించి ఎక్కువగా విలన్లు ఉంటారనీ, వారిలో ఓ విలన్‌గా ఇప్పటికే నవీన్ చంద్ర ఎంపికయ్యాడనీ అంటున్నారు. 'అరవింద సమేత'లో నెగటివ్ రోల్లో ఆకట్టుకున్న అతడికి మరోసారి ఆ తరహా రోల్ చేసే అవకాశం లభించింది.
ఇక ఈ సినిమాలో కొంత బాగాన్ని అంటే పలు కీలక, యాక్షన్ సన్నివేశాలను వారణాసిలో చిత్రీకరించాలని భావించారు బోయపాటి. అయితే లాక్ డౌన్ మూలంగా అది కుదరలేదు. ఇప్పుడు అదే షెడ్యూల్ నంద్యాలలో చేయనున్నారని తెలుస్తోంది. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారట. ఇందులో ఎక్కువగా పోరాట సన్నివేశాలే ఉంటాయట.
ఈ సినిమాలో మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటున్నాడు బాలయ్య. అందులో బాగంగా తాజాగా బాలయ్య చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడట. ఇక ఆ సినిమాతో పాటు బాలయ్య, దర్శకుడు శ్రీవాస్ సినిమాని కూడా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. ఇక తన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బి గోపాల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందని సమాచారం. ఇక వీటికి తోడు ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతోంది. పూరి జగన్నాధ్ బాలయ్య’ కలయికలో గతంలో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే.
Published by:Suresh Rachamalla
First published:January 24, 2021, 09:18 IST