అరవింద సమేత సక్సెస్ మీట్... ఒకే వేదికపైకి బాలకృష్ణ, ఎన్టీఆర్ !

చాలా ఏళ్ల తరువాత బాలకృష్ణ, ఎన్టీఆర్ మళ్లీ కలవబోతున్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగబోయే అరవింద సమేత సక్సెస్ మీట్ ఇందుకు వేదిక కానుంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలవడం వల్ల టీడీపీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంటుందనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: October 20, 2018, 10:17 PM IST
అరవింద సమేత సక్సెస్ మీట్... ఒకే వేదికపైకి బాలకృష్ణ, ఎన్టీఆర్ !
జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ( ఫైల్ ఫోటో)
  • Share this:
నందమూరి అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. నందమూరి స్టార్ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపైకి వచ్చి అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శిల్పాకళా వేదికలో జరగనున్న అరవింద సమేత సక్సెస్ మీట్‌కు హీరో బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్ని అరవింద సమేత చిత్ర నిర్మాతలు కూడా ప్రకటించారు.

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తరువాత జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మళ్లీ దగ్గరవుతారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. తాజాగా అరవింద సమేత సక్సెస్ మీట్‌కు బాలకృష్ణ రానుండటంతో ఈ వార్తలు వాస్తవం కాబోతున్నాయి.గతంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే 2009 ఎన్నికల తరువాత కొంతకాలానికి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ అలా కొనసాగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు వీరిద్దరు కలుస్తారనే ప్రచారం జరిగినా... అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒకే వేదికపైకి రానుండటంతో సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ సమీకరణాలు మారిపోతాయనే ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటున్న నాటి నుంచే బాలయ్యకు కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ బాబాయ్‌తో ఎన్టీఆర్ కలుస్తుండటంతో...టీడీపీలోనూ తారక్ క్రీయాశీలకంగా మారతారనే ప్రచారం మొదలైంది. రాబోయే ఎన్నికలు టీడీపీకి కీలకంగా మారాయి. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు టీడీపీకి యాంటీగా ఉన్నాయి. గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీపై కత్తులు దూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేస్తే... అది ఆ పార్టీకి ఎంతగానో కలిసొస్తుందని నందమూరి అభిమానులు కూడా నమ్ముతున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్‌కు దగ్గరైతే ఇది సాధ్యమే అనే భావిస్తున్నారు. ఇందుకు అరవింద సమేత సక్సెస్ మీట్‌లో బీజం పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాలకృష్ణ, ఎన్టీఆర్ మళ్లీ కలిస్తే... అది నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.
First published: October 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు