నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 106వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. బి.గోపాల్, శ్రీవాస్ వంటి దర్శకులతో పాటు ఒకానొక సందర్బంలో పూరీ జగన్నాథ్, అనీల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. లేటెస్ట్గా ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే తదుపరి సినిమాల దర్శకుల లిస్టులో కొత్త దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. గోపీచంద్ మలినేని
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం క్రాక్. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్నాడు. డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పాటు.. గోపీచంద్ మలినేనికి హిట్ వచ్చి కూడా చాలా కాలమైంది. దీంతో గోపీచంద్ మలినేనికి సక్సెస్ అవసరం. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
వివరాల్లోకెళ్తే బాలకృష్ణ 107వ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తాడట. అది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌తో. రీసెంట్గా దర్శకుడు గోపీచంద్ మలినేని నిర్మాతలను, హీరో బాలకృష్ణను కలిసి కథను వినిపించాడట. వారికి కథ బాగా నచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా సెట్స్‌పై ఉంది. ఇందులో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారు. అందులొ ఓ పాత్ర అఘోరా పాత్ర అని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.