బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మన దర్శక నిర్మాతలు ఫెయిల్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. అయితే ప్రభాస్ స్టార్ ఇమేజ్‌కు సరిపోయే సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, బాహుబలి అంత స్థాయి సినిమాను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు వెనుకాడుతున్నాయి. ఎందుకంటే బాహుబలి స్థాయి భారీ సినిమాలను కొత్త దర్శకుల చేతిలో పెడితే చిన్న పొరపాటు జరిగినా నిర్మాతలు మునిగిపోతారు. అందుకు సాహోనే సాక్ష్యం..కొత్త దర్శకుడు సుజిత్‌కు బడ్జెట్ పరిమితులు లేనప్పటికీ, సినిమా ఔట్ పుట్ విషయంలో తడబడ్డాడు. మరి రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా ప్లాన్ చేద్దాం అంటే అందుకు మరో రెండు మూడేళ్లు ఆగాల్సిన పరిస్థితి. అందుకే అందుకే రాజమౌళి స్థాయిలో ఇండియాలో సినిమాలు తీసే మరో దర్శకుడి వేటలో ప్రభాస్ సన్నిహిత వర్గాలు పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్, భారీ సినిమాల స్పెషలిస్ట్ శంకర్ కాంబినేషన్ లో ప్రభాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా నిర్మాణంలో శంకర్ బిజీగా ఉన్నాడు.
శంకర్‌కు భారీ సినిమాలను తీయడంలో స్పెషలిస్టు అనే చెప్పవచ్చు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఇప్పటికే రోబో, 2.0, అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ శంకర్ సృష్టి అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ ప్రభాస్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందించేందుకు వార్నర్ బ్రదర్స్ లాంటి అంతర్జాతీయ సినీ నిర్మాణ సంస్థ ఆలోచన చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. బాహుబలి రెండు భాగాలకు కలిపి సుమారు రూ.2500 కోట్ల వసూళ్లు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల అంచనా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం రూ.1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్‌గా హెవీ మార్కెట్ ఉన్న ప్రభాస్‌తో శంకర్ సినిమా టాక్ రావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో ‘జాన్’అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాకే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bahubali, Prabhas, Shankar, Telugu Cinema, Tollywood Cinema