అదేంటి.. వైఎస్ జగన్ ఏంటి సీనియర్ ఎన్టీఆర్ కల నెరవేర్చడం ఏంటి అనుకుంటున్నారా..? కొన్నిసార్లు కాలం అలా కరుణిస్తుందంతే. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్ చివరి వరకు ప్రయత్నించి నెరవేర్చలేకపోయిన ఓ కలను ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పూర్తి చేసాడు. వైసీపీ గెలిచిన తర్వాత కీలకమైన మార్పులు చేస్తూ.. తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు వైఎస్ జగన్. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీపై కూడా ఓ కన్నేసాడు. ఇక్కడ్నుంచి కూడా ఆయన్ని వరసగా ప్రముఖులు కలుస్తున్నారు. వాళ్లకు కూడా కీలకమైన పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు జగన్.
ఇదిలా ఉండగా ఇప్పుడు లక్ష్మీ పార్వతికి ఈయన ఇచ్చిన పదవితో అన్నగారి ఆత్మ శాంతించింది అంటున్నారు అభిమానులు. అంతలా ఏముంది ఇందులో గొప్ప అనుకుంటున్నారా..? ఉంది కచ్చితంగా ఉంది.. అన్నగారు చనిపోయిన 25 ఏళ్ళ తర్వాత ఆయన కలను జగన్ నెరవేర్చాడు. ఎన్టీఆర్ రెండో భార్య నందమూరి లక్ష్మీ పార్వతికి జగన్ తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చాడు. దాంతో అప్పట్లో ఎన్టీఆర్ కలగన్న ఆశ ఇప్పుడు నిజమైంది. అప్పట్లో ఎన్టీఆర్ తన భార్యకు ఏదో ఓ ప్రముఖ పదవి ఇవ్వాలని చాలా ప్రయత్నించారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా అది కుదర్లేదు.
ఆయన చదువులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం వెనక కూడా ఆమెకు ఉన్న అపూర్వమైన భాషా పాండిత్యం చూసి మురిసిపోయినందుకేనని చెప్తుంటారు విశ్లేషకులు. వర్మ కూడా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఇదే ఎక్కువగా చూపించాడు. ఇదిలా ఉంటే 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భార్య లక్ష్మీ పార్వతికి ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిద్దామనుకున్నారు.. కానీ ఆయన సర్కార్ ఊహించని విధంగా 8 నెలలకే కూలిపోయింది. ఆ వెంటనే ఎన్టీఆర్ మరణం.. లక్ష్మీ పార్వతి ఒంటరి కావడం జరిగిపోయాయి.
అప్పట్నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఆమెకు పదవులు మాత్రం రాలేదు. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ ఆమెను పిలిచి ఆమెకు తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చాడు. దాంతో అన్నగారి ఆత్మ శాంతించిందంటూ లక్ష్మీ పార్వతి కూడా సంతోషపడుతుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది.. 2014, 2019లో ఆమెకు పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ కీలకమైన సమయాల్లో తనకు అండగా ఉన్న ఆమెను గుర్తు పెట్టుకుని ఇప్పుడు పార్టీలో సముచిత స్థానం కల్పించడమే కాకుండా పదవి ఇచ్చి సత్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Lakshmi Parvathi, Telugu Cinema, Tollywood