మరో అస్త్రం వదిలిన నాగబాబు... జబర్దస్త్‌కు దెబ్బ తప్పదా..?

నాగబాబు (Nagababu)

గల్లీబాయ్ సద్దాం రాకతో 'అదిరింది షో' జనాల్లోకి బాగానే వెళ్తోంది. ఈ షోకు అన్నీ తానై వ్యవహరిస్తున్న నాగబాబు.. ఇదే ఊపుతో మరో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. పటాస్ నుంచి మరో కొత్త స్టార్‌ని 'అదిరింది'కి తీసుకొచ్చారు.

 • Share this:
  బుల్లితెర కామెడీ షోలు జబర్దస్త్, అదిరింది కామెడీ షోల మధ్య వార్ కొనసాగుతోంది. జబర్దస్త్‌కు పోటీగా నాగబాబు ఆధ్వర్యంలో వచ్చిన అదిరింది షో.. ఆ స్థాయిలో ఆకట్టుకోకున్నా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. టీఆర్‌పీ రేటింగ్స్‌తో పాటు యూట్యూబ్‌లోనూ వ్యూస్ పెంచుకుంటోంది. ముఖ్యంగా పటాస్ ఫేమ్ సద్దాం ఎంట్రీ ఇచ్చాక అదిరింది షోకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగింది. జబర్దస్త్‌ల ఆది పంచ్‌లు ఎలా వేస్తాడో.. 'అదిరింది'లో అదే స్థాయిలో పంచ్‌ల వర్షం కురిపిస్తున్నాడు సద్దాం. మనోడి స్కిట్స్ యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్ సంపాదిస్తున్నాయి. ఇలా పటాస్ స్టార్ రాకతో 'అదిరింది షో' జనాల్లోకి బాగానే వెళ్తోంది. ఈ షోకు అన్నీ తానై వ్యవహరిస్తున్న నాగబాబు.. ఇదే ఊపుతో మరో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. పటాస్ నుంచి మరో కొత్త స్టార్‌ని 'అదిరింది'కి తీసుకొచ్చారు.

  ఈ ఆదివారం ప్రసారం కాబోయే 'అదిరింది' కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదలయింది. అందులో కొత్త జట్టును ప్రకటించారు. పటాస్ స్టార్ 'ఎక్స్‌ప్రెస్ హరి' సారథ్యంలో ఈ టీమ్ 'అదిరింది'లో ఎంట్రీ ఇచ్చింది. హరి టీమ్‌లో యాదమ్మ రాజు కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే సద్దాం సారధ్యంలోని గల్లీబాయ్స్ టీమ్ దుమ్మురేపుతోంది. గల్లీ బాయ్స్ పంచ్‌లకు పడిపడి నవ్వుతున్నామని.. కామెంట్ల రూపంలో చెబుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో సద్దాం తరహాలోనే హరి టీమ్ కూడా సక్సెస్ అవుతుందని అదిరింది నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  జబర్దస్త్‌లో ప్రస్తుతం సుడిగాలి సుధీర్, హైపర్ ఆది స్కిట్స్‌కి మాత్రమే ఎక్కువ రేటింగ్ ఉంది. మిగిలిన టీమ్స్ గతంలో మాదిరి ఆకట్టుకోవడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి వల్లే జబర్దస్త్ నెట్టుకొస్తుందనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఐతే ఇటీవల 'అదిరింది' షోలోని సద్దాం స్కిట్స్.. యూబ్యూట్‌లో హైపర్ ఆది స్కిట్స్‌ ‌వ్యూస్‌ని బీట్ చేస్తున్నాయి. ఇలా సద్దాం రూపంలో హైపర్ ఆదికి గట్టి పోటీ నెలకొందని టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా ఎంట్రీ ఇచ్చిన ఎక్స్‌ప్రెస్ హరి కూడా సక్సెస్ అయ్యి.. సుధీర్ టీమ్ దూకుడుకు చెక్ పెడతాడని అదిరింది నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే జబర్దస్త్‌ను 'అదిరింది' దెబ్బకొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: