Anchor Pradeep: బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర వీక్షకులకు సైతం యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యతగా తనదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమర్‌తో అదరగొట్టే ప్రదీప్.. సుమ తరువాత గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక ప్రదీప్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ మూవీ కచ్చితంగా విజయం అవుతుందన్న ధీమాలో ప్రదీప్ ఉండగా.. అటు ఆయన అభిమానులు కూడా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే బుల్లితెరపై ప్రదీప్ వ్యాఖ్యతగా చేసే షోలలో జీ తెలుగులో ప్రసారం అయ్యే సరిగమప- నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ ఒకటి. ఇందులో కోఠి, ఎస్పీ శైలజ, చంద్రబోస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు ఎవరికీ తెలియని కొత్త వారితో ఈ షో ద్వారా పరిచయం చేయగా.. ఇందులో పలువురు ఇప్పటికే మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు.
ఇక ఈ సింగింగ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో పవన్ కల్యాణ్ ఒకరు. తనదైన గొంతుతో మొదటి నుంచి పవన్ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో సెమీ ఫైనల్‌కి వచ్చేసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కి సంబంధించిన ఓ ఎమోషనల్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
అందులో పవన్ తండ్రి, అతడి మాస్టర్ స్టేజ్ మీదకు రాగా తన తండ్రి డ్రైవర్‌గా చేస్తూ ఇప్పటికీ తన కుటుంబాన్ని నడుపుతున్నాడని, మాస్టర్ తనను ఎంకరేజ్ చేస్తూ తన ఖర్చులకు ఇస్తున్నాడని పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. తనను పెద్ద కుమారుడిగా అనుకోవాలని పవన్ తండ్రికి చెప్పాడు. ఈ క్రమంలో పవన్ బీటెక్ అయ్యే వరకు కాలేజీ ఖర్చులు తాను చూసుకుంటానని సభా వేదికగా ప్రదీప్.. పవన్ తండ్రికి మాటిచ్చాడు. దీంతో స్టేజ్ మీదున్న అందరూ ప్రదీప్‌కి క్లాప్స్ కొట్టారు. కాగా సాధారణంగా హీరోలు ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక బుల్లితెర వ్యాఖ్యతనే అయినప్పటికీ.. తన మంచి మనసును చాటుకొని ప్రదీప్ కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor pradeep, Television News