ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అన్న సక్సెస్ తర్వాత, తనని ఫాలో అవుతూ ఆనంద్ దేవరకొండ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేసిందిగా తను ఇక యాక్షన్ సినిమాలు చేసేస్తే అన్న అభిమానులు సపోర్ట్ చేసేస్తారులే! అని ఆనంద్ దేవరకొండ అనుకోలేదు. తన ఫిజిక్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ వెరైటీ సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయిన సినిమా దొరసాని. భారీ రేంజ్లో హిట్ సాధించకపోయినా, నటుడిగా ఆనంద్ దేవరకొండకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా అది. ఆ తర్వాత ఈ యువ హీరో చేసిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా కూడా మంచి ప్రశంసలను రాబట్టుకుంది. తొలి రెండు సినిమాలు దేనికవే భిన్నమైనవి. ఇప్పుడు అదే రూట్లో మూడో సినిమాను కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడట ఆనంద్ దేవరకొండ.
వివరాల మేరకు.. 118 సినిమాతో సక్సెస్ కొట్టిన కెమెరామెన్ టర్న్డ్ డైరెక్టర్ కె.వి.గుహన్ ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. కథను తయారు చేసుకుని ఆనంద్ దేవరకొండకు వినిపిస్తూనే వెంటనే ఓకే చెప్పేశాడట మరి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబుతో కలిసి సునీత తాటి నిర్మించబోతున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించిన ఫైనల్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఆనంద్ దేవరకొండ సినిమాల ఎంపికను చూసిన సినీ వర్గాలు అసలు విజయ్ దేవరకొండను ఫాలో కాకుండా, తనకు పూర్తి వ్యతిరేకంగా వెళుతున్నాడని అనుకుంటున్నారు మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.