అల్లు అరవింద్ ఆస్తి పంపకాలపై ఈ మధ్య చాలా వార్తలు వచ్చాయి. ఆ మధ్య తన 70వ పుట్టినరోజు జరుపుకున్న ఈ నిర్మాత.. ఆస్తులు పంచేసాడనే వార్తలు వచ్చాయి. ఇదే నిజమని సినిమా ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు కూడా నిర్ధారించాయి. ఒకప్పుడు వరస సినిమాలు నిర్మించిన ఈయన.. ఈ మధ్య కాలంలో చాలా వేగం తగ్గించాడు. కేవలం కొడుకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య అది కూడా తగ్గించేసాడు అరవింద్. ముగ్గురు తనయులకు ఆస్తి పంపకాలు కూడా జరిపి రెస్ట్ తీసుకుంటున్నాడు ఈ నిర్మాత.

అల్లు బ్రదర్స్ పైల్ ఫోటో (Source: Twitter)
ఇందులో భాగంగానే ఇన్నాళ్లూ తెరపై కనిపించని అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్.. ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారి వరుణ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టాడు. దానికి అల్లు అరవింద్ ప్రజెంట్స్ అనే పేరు కూడా పడింది. గత కొంతకాలంగా అల్లు అరవింద్ ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇంట్లో కూడా ఆస్తి పంపకాల గురించి చర్చలు జరుగుతున్నాయని.. దీనిపై అరవింద్ ఓ నిర్ణయం తీసుకోవడమే మంచిదని ముందడుగు వేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు అరవింద్ ఫైల్ ఫోటో
మొన్నటి వరకు అంత కలిసి ఉన్న కుటుంబ సభ్యులు.. ఇప్పుడు వేర్వేరుగా బ్యానర్స్ స్థాపించడం.. బన్నీ కొత్త ఇంటికి ముహూర్తం పెట్టడం.. ఇవన్నీ లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పైగా అల్లు అర్జున్ కూడా తనకు వచ్చిన వాటాపై సంతృప్తిగా లేడనే వార్తలొచ్చాయి. ఇకపై గీతా ఆర్ట్స్ వ్యవహారాలను పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ చూసుకుంటారని తెలుస్తుంది. అందుకే వరుణ్ తేజ్ సినిమాకు కూడా ఈయన పేరు నిర్మాతగా పడుతుంది. ఇక బన్నీ సొంత నిర్మాణ సంస్థ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. అయితే ఆస్తి పంపకాలపై ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడింది లేదు.
కానీ అల్లు శిరీష్ మాత్రం ఇప్పుడు ఒకే ఒక్క ఫోటోతో సమాధానమిచ్చేసాడు. వన్ టూ అండ్ త్రీ.. బ్రదర్స్ అంటూ పోస్ట్ చేసాడు ఈయన. ఎవరెన్ని రాసుకున్నా కూడా తాము మాత్రం ఎప్పుడూ ఒక్కటే అని చెప్పకనే చెప్పేసాడు శిరీష్. ఆస్తులు పంచుకున్నా కూడా అన్నాదమ్ములుగా మాత్రం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటామని ఈయన ఫోటోతోనే చెప్పేసాడు. ముగ్గురు అన్నాదమ్ములు నవ్వుతూ ఇచ్చిన పోజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మొత్తానికి ఆస్తులు పంచినా కూడా తామంతా ఒక్కటే అని చెబుతున్నాడు అల్లు వారి చిన్నబ్బాయి.
Published by:Praveen Kumar Vadla
First published:October 31, 2019, 20:13 IST