కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనా... కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసినా తనలో మరో రకం నటుడు ఉన్నాడని నిరూపించాడు అల్లరి నరేష్. ఆయన హీరోగా వచ్చిన నాంది సినిమా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది. ‘అల్లరి నరేష్ కుమ్మేశాడు’ అనే పేరు తెచ్చుకున్నాడు. దీంతో నాంది చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా అల్లరి నరేష్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు అని ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న తన కల, కోరిక నెరవేరడంతో ఆనందంతో అల్లరి నరేష్ గొంతు జీరబోయింది. ఇన్నాళ్లకు విజయం దక్కడం, అది కూడా కామెడీ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ కావడం ఆయనకు మరింత ఆనందాన్ని ఇచ్చింది.
‘2012 ఆగస్టు 24 సుడిగాడు రిలీజ్ అయింది. సుడిగాడు రిలీజ్ అయింది.’ అనగానే అల్లరి నరేష్ గొంతు మూగబోయింది. చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. కళ్లు తుడుచుకున్నాడు.గొంతు జీరబోయింది. ‘చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఎమోషనల్ కాదు. ఏడుపు వచ్చేస్తుంది. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి ఎనిమిదేళ్లు వెయిట్ చేశా. కామెడీ సినిమాలు చేస్తున్నా.. ఫ్లాపుల్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఒక ప్రొడ్యూసర్ నమ్మారు. అలాగే, డైరెక్టర్ విజయ్ నాకు సెకండ్ బ్రేక్ ఇచ్చాడు.’ అని అల్లరి నరేష్ చాలా ఎమోషనల్ అయిపోయాడు.
ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారని అల్లరి నరేష్ అన్నాడు. ఇలాంటి కొత్త రకం సినిమా విజయవంతం అయితే ఇంకా ఇలాంటి మంచి కథలు వస్తాయన్నారు. అలాగే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన వరలక్ష్మి మీద అల్లరి నరేష్ ప్రశంసలు కురిపించారు. జనవరిలో క్రాక్ అనే సినిమా ద్వారా హిట్ కొట్టిన వరలక్ష్మి, ఇప్పుడు నాంది ద్వారా ఫిబ్రవరిలో మరో హిట్ కొట్టారని.. ఓ రకంగా ఆమె లక్కీ సింబల్ అయ్యారన్నారు.
సతీష్ వేగేశ్న నిర్మాతగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చింది నాంది సినిమా. ఈ సినిమా కోసం అల్లరి నరేష్ ఓ రకంగా చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఓ దశలో నగ్నంగా కూడా నటించాడు. నాంది సినిమా ఓ అండర్ ట్రయల్ ఖైదీ చుట్టూ తిరుగుతుంది. చేయని తప్పుకి తాను ఎలా శిక్షకు గురయ్యాడు. మళ్లీ దాన్నుంచి ఎలా బయటపడ్డాడనే అంశాన్ని తీసుకుని చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఈ సినిమాను తీశారు. ‘సెక్షన్ 211’ అంశాన్ని ఇది చాలా బలంగా చూపింది.