రివ్యూ: అల వైకుంఠపురములో.. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

అల వైకుంఠపురములో సినిమాపై అంచనాలు ముందు నుంచి కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఏడాదిన్నర గ్యాప్ తర్వాత బన్నీ నటించిన సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ చిత్రంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ఎలాంటి మాయ చేసారో చూద్దాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 12, 2020, 1:52 PM IST
రివ్యూ: అల వైకుంఠపురములో.. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..
అల వైకుంఠపురములో పోస్టర్ (ala vaikuntapurramuloo)
  • Share this:
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, టబు, జయరాం, మురళి శర్మ, సచిన్ ఖేడ్‌కర్ తదితరులు
సంగీతం: తమన్

నిర్మాతలు: అల్లు అరవింద్, చినబాబు
కథ, స్క్రీన్ ప్లే దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్

అల వైకుంఠపురములో సినిమాపై అంచనాలు ముందు నుంచి కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఏడాదిన్నర గ్యాప్ తర్వాత బన్నీ నటించిన సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ చిత్రంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ఎలాంటి మాయ చేసారో చూద్దాం..

కథ:
వాల్మీకి (మురళి శర్మ) పక్కా మిడిల్ క్లాస్ వ్యక్తి. తనలా తన కొడుకు కాకూడదని తన యజయాని అయిన రామచంద్రయ్య(జయరాం) కొడుకును హాస్పిటల్లో మార్చేస్తాడు. తన కొడుకును అక్కడ పెట్టి.. ఆయన కొడుకును తాను తీసుకుని పెంచేస్తాడు. ఆ పొరపాటుతో రాజాగా పెరగాల్సిన బంటు(అల్లు అర్జున్) కాస్త వాల్మీకి కొడుకుగా ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిగా పెరుగుతాడు. పైగా ప్రతిరోజూ బంటుపై తన శాడిజం చూపిస్తుంటాడు వాల్మికి. ఈ క్రమంలోనే తను పనిచేసే ఆఫీస్ బాస్ అమూల్య (పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. అలా జరుగుతున్న సమయంలోనే తన జన్మరహస్యం తెలుసుకుంటాడు బంటు. ఆ తర్వాత వైకుంఠపురంలోకి వెళ్తాడు. అక్కడ తన నిజమైన అమ్మానాన్నల మధ్య సఖ్యత లేదని తెలుసుకుని.. ఆ కుటుంబ బాధ్యత తీసుకుంటాడు. అక్కడ్నుంచి ఏం జరిగింది అనేది కథ..


కథనం:

తొలి 10 నిమిషాల్లోనే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథ మొత్తం చెప్పేసాడు త్రివిక్రమ్. అక్కడ్నుంచి మొదలుపెట్టడంతో ప్రేక్షకులకు కూడా క్లారిటీ వచ్చేసింది. పైగా మురళీ శర్మ కారెక్టర్ చూసిన తర్వాత అల్లు అర్జున్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేస్తుంది. తన బాస్‌పై అసూయతో కొడుకులను మార్చి అక్కడ్నుంచి శాడిజం చూపిస్తాడు మురళీ శర్మ. ఈ క్రమంలోనే బన్నీ, మురళి శర్మ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వినోదభరితంగా ఉంటూనే మరోవైపు బన్నీ పాత్రపై జాలిని కూడా కురిపిస్తాయి. అయ్యో పాపం అనిపిస్తుంది అల్లు అర్జున్ కష్టాలు చూస్తుంటే.. ఇప్పటి వరకు కెరీర్లో ఫ్యామిలీ సినిమాలకు పెద్దగా పెట్టపీట వేయలేదు బన్నీ. కానీ తొలిసారి అలాంటి సినిమా చేసాడు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథను పట్టుకొచ్చిన త్రివిక్రమ్‌కు ఈయన పెద్దపీట వేసాడు. ముఖ్యంగా సినిమాలో కామెడీ సీన్స్ ప్రత్యేకంగా రావు.. కథలోనే కామెడీ కలిసిపోయింది. అలా డిజైన్ చేసాడు మాటల మాంత్రికుడు. పూర్తి స్వార్థం నిండిన పాత్రలో మురళీశర్మ పాత్ర ఈ చిత్రానికి కీలకం. ఆయనే కథను మలుపు తిప్పాడు కూడా. అందుకే వాల్మీకి అనే పేరు పెట్టాడేమో త్రివిక్రమ్. ఫస్టాఫ్ వరకు సినిమా అంతా కామెడీ అక్కడక్కడా యాక్షన్ సన్నివేశాలతో నింపేసాడు త్రివిక్రమ్. ఇంటర్వెల్ టైమ్‌కు హీరోకు నిజం తెలిసిపోవడం అక్కడ్నుంచి తన వైకుంఠపురానికి హీరో రావడం.. అక్కడి పరిస్థితి చూసి తన కుటుంబాన్ని చక్కదిద్దే బాధ్యత వేసుకోవడం కాస్త రొటీన్ అనిపించినా కూడా మాటల మాంత్రికుడి మాయ మాత్రం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సినిమా అక్కడక్కడా ఫ్లో తగ్గినట్లు అనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో బోర్ కొట్టకుండా ఉండేలా వెన్నెల కిషోర్ లాంటి పాత్రలను వాడుకున్నాడు త్రివిక్రమ్. విలన్ సముద్రఖని ఉన్నా కూడా ఆయన్ని పెద్దగా వాడుకోలేదు.. కథకు అవసరం కూడా పడలేదు. కేవలం హీరోయిజం అవసరమైనపుడు మాత్రం ఆయన వచ్చిపోయాడు అంతే. ఇక సుశాంత్ పాత్రను కూడా పెద్దగా వాడుకోలేదు.. ఓ సైలెంట్ పాత్ర కావాలి కాబట్టి అతన్ని తీసుకున్నారంతే. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి ఛాయలు కూడా ఈ చిత్రంలో కనిపించాయి. సెకండాఫ్‌లో హీరోలందరి పాటలకు బన్నీ డాన్స్ చేయడం అదిరిపోయింది. ఆ సీన్ మాత్రం సినిమాకు హైలైట్. మహేష్, ఎన్టీఆర్, పవన్, చిరంజీవి పాటలకు బాగానే చిందేసాడు బన్నీ. ఓవరాల్‌గా సంక్రాంతి సమయంలో కోరుకునే మంచి ఫ్యామిలీ అల వైకుంఠపురములో.

నటీనటులు:
అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త కొత్తగా అనిపించింది. పైగా నటుడిగా కూడా మరో మెట్టెక్కాడు బన్నీ. పూర్తిగా డిఫెరెంట్ మాడ్యులేషన్స్‌లో డైలాగులు చెప్పాడు. ఎమోషన్స్ అన్నీ బాగా పండించాడు. పూజా హెగ్డే అందంగా ఆకట్టుకుంది. టబు సగటు తల్లి పాత్రలో మెప్పించింది. జయరాం పర్లేదు.. సముద్రఖనిని అంతగా వాడుకోలేదు. సుశాంత్ పర్లేదు.. తన పాత్ర వరకు మెప్పించాడు. సునీల్, వెన్నెల కిషోర్, నివేదా పేతురాజ్, సచిన్ లాంటి వాళ్లు పర్లేదు. మురళి శర్మకు మంచి పాత్ర దక్కింది. స్వార్థం నిండిన పాత్రలో అదరగొట్టాడు ఈయన.

టెక్నికల్ టీం:
తమన్ సంగీతం సినిమాకు ప్రాణం. పాటలు కూడా బాగున్నాయి. అయితే సామజవరగమనా విజువల్‌గా పెద్దగా అనిపించలేదు. బుట్టబొమ్మ, రాములో రాములా అదిరిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దర్శకుడిగా ఈ సారి త్రివిక్రమ్ ఎక్కువ మార్కులు అందుకున్నాడు. రచయితగా మాత్రం గుర్తుండిపోయే మాటలు తక్కువగానే రాసాడు కానీ సందర్భానుసారంగా వచ్చే మాటలు ఆకట్టుకున్నాయి. పైన ఎంత బరువు పెడితే అంత పైకి ఎదుగుతాడు లాంటి మాటలు బాగున్నాయి. ఓవరాల్‌‌గా తన సేఫ్ జోన్‌లోకి ఫ్యామిలీ సినిమా చేసాడు మాటల మాంత్రికుడు.

చివరగా ఒక్కమాట:
అల వైకుంఠపురములో.. సినిమా సర్.. ఫ్యామిలీ సినిమా అంతే..

రేటింగ్: 3/5
Published by: Praveen Kumar Vadla
First published: January 12, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading