కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని టాక్ నడిచింది. కానీ విడుదలకాలేదు. అయితే ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండా డెరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. ఈ హవా హిందీలోను కూడా కనపడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈద్ సందర్భంగా మే 22న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ ఈ కరోనా వల్ల అది సాధ్యపడేలా లేదు.
ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో లక్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట చిత్రబృందం. దీనికి సంబందించి ఇప్పటికే మేకర్స్ డిస్నీ హాట్ స్టార్ వారితో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. లక్ష్మీ బాంబ్ తెలుగు సినిమా కాంచనకు రీమేక్‌గా వస్తోంది. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో అక్షయ్, నిర్మాత తుషార్ కపూర్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రతినిధి విజయ్ సింగ్‌తో మూడు వారాలుగా ఓటీటీ ప్రతినిధులు వీడియో కాల్స్ ద్వారా చర్చలు జరిపారనీ, చివరకు ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని తాజా సమాచారం. ఈ డీల్ ఖరీదు సుమారు వందకోట్లకు పైమాటేనట. ప్రస్తుతం సినిమాకు సంబందించి దర్శకుడు రాఘవ లారెన్స్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్నీ పూర్తి చేసే పనులో ఉన్నాడట. ఒకసారి ఆ పనులు పూర్తైతే ఇక ఓటీటీలో విడుదలే తరువాయి. ఇక ఇక్కడ ఇంకో విషయం ఏమంటే అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం కూడా ఓ 30 కోట్లకు డీల్ కుదిరిందని.. త్వరలోనే ఈ సినిమాను కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ కానుందని తాజా సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Anushka Shetty, Hindi Cinema