కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఇపుడిపుడే షూటింగ్స్ మళ్లీ మొదలవుతున్నాయి. కానీ థియేటర్స్, మల్టీప్లెక్స్‌లు ఇపుడు తెరిచే అవకాశాలు లేవు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడమే కానీ.. ఎక్కడ తగ్గడం లేదు. ఒకవేళా లాక్ డౌన్ తొలగించి థియేటర్స్ ఓపెన్ చేసినా.. కరోనా భయంతో జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో ఓ మాదరి చిత్రాలకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కల్పతరువులా మారింది. ఇప్పటికే కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం థియేటర్స్ వైపు చూడకుండా తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్, ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు మరికొన్ని భారీ బాలీవుడ్ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యాయి.
తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయడానికి డీల్ కుదిరింది. దాదాపు రూ. 125 కోట్లకు హాట్ స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకుంది. ఈ సినిమాను ఆగష్టు 15న డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. లక్ష్మీ బాంబ్ తెలుగు సినిమా కాంచనకు రీమేక్‌గా వస్తోంది. లారెన్స్ దర్శకత్వం వహించాడు. మరోవైపు అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’ చిత్రాన్ని మాత్రం థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood, Disney+ Hotstar, Ott, Raghava Lawrence