AJAY BHUPATHI MAHA SAMUDRAM MOVIE REVIEW AND SHARWANAND SIDDHRATH MOVIE FAILS TO IMPRESS PK
Maha Samudram movie review: ‘మహా సముద్రం’ రివ్యూ.. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ డ్రామా..!
మహా సముద్రం ట్విట్టర్ రివ్యూ (Maha Samudram Photo : Twitter)
Maha Samudram movie review: ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న సినిమా మహా సముద్రం (Maha Samudram movie review). 9 ఏళ్ళ తర్వాత సిద్ధార్థ్ (Siddharth) తెలుగులో నటించడం.. శర్వానంద్ (Sharwanand) మాస్ కారెక్టర్ చేయడం.. ఆర్ఎక్స్ 100 (RX 100) తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అక్టోబర్ 14న విడుదలైంది. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం..
చిత్రం: మహా సముద్రం
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అను ఏమాన్యూల్, అదితి రావు హైదరి, జగపతి బాబు, రావు రమేష్ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన, దర్శకత్వం: అజయ్ భూపతి
ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న సినిమా మహా సముద్రం. 9 ఏళ్ళ తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటించడం.. శర్వానంద్ మాస్ కారెక్టర్ చేయడం.. ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అక్టోబర్ 14న విడుదలైంది. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం..
కథ:
అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్ధార్థ్) మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. పోలీస్ ఆఫీసర్ అయి పవర్ చేతుల్లోకి తీసుకోవాలనే ఆలోచనలతో ఉంటాడు విజయ్. ఆయన మహా మహా (అదితి రావు హైదరి)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. మరోవైపు అర్జున్ కూడా స్మిత (అను ఇమ్మాన్యుయేల్)తో ప్రేమలో పడతాడు. అదే సమయంలో విజయ్ తనలోని అవినీతి కోణాన్ని బయటికి తీసుకొస్తాడు. ప్రాణంగా ప్రేమించిన మహాను వదిలేసి వెళ్లిపోతాడు. అలాంటి సమయంలో మహాతో అర్జున్ తోడుంటాడు. మరోవైపు చుంచు మామ (జగపతిబాబు) తన స్వార్థం కోసం అర్జున్ను డ్రగ్స్ మాఫియాలోకి దించేస్తాడు. అదే టైమ్‌లో వెళ్లిపోయిన విజయ్ మళ్లీ తిరిగొస్తాడు. అప్పుడు అర్జున్, విజయ్ మధ్య యుద్ధం ఏం జరుగుతుంది అనేది అసలు కథ..
కథనం:
పైన వేసిన కవర్ చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు అని. ఇంగ్లీషులో ఒక మంచి సామెత ఉంది. కొన్ని సినిమాలకు ఇదే అప్లై అవుతుంది. ట్రైలర్ చూసి సినిమా కూడా అంతే ఇంటెన్స్ గా ఉంటుందేమో అని అంచనా వేయకూడదు. మహా సముద్రం విషయంలో ఇదే జరిగింది. ఒక లవ్ స్టోరీ.. పర్ఫెక్ట్ యాక్షన్ డ్రామా.. ఈ రెండు మిక్స్ అయిపోయి ఏ తీరానికి చేరకుండా మిగిలిపోయింది మహా సముద్రం. ఫస్టాప్ అంతా కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కోసమే తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇంటర్వెల్ కు ముందు వరకు కథ చెప్పలేదు. సెకండాఫ్ చెప్పాలని చూసినా అప్పటికే అర్థమైపోతుంది. చాలా సన్నివేశాలు ముందుగానే తెలిసిపోతుంటాయి. ఊహించినట్లుగానే కథ ముందుకు సాగుతుంది.. అదే మహా సముద్రంకు అతి పెద్ద మైనస్. నెమ్మదిగా సాగే సన్నివేశాలు.. మధ్యలో అర్థంలేని ఆవేశాలు.. వెరసి మహా సముద్రంను రొటీన్ సినిమాగా నిలబెట్టాయి.
దర్శకుడు చెప్పిన ప్యూర్ ఇమ్మేన్స్ లవ్ స్టోరీ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి.. కానీ రొటీన్ కథ అంతగా సహకరించలేదు. రొటీన్ స్క్రీన్ ప్లేతో రెగ్యులర్ మసాలా డ్రగ్స్ సినిమాగా మిగిలిపోయింది మహా సముద్రం. దర్శకుడు అంత గొప్పగా చెప్పిన మహా (అదితి రావు హైదరి) క్యారెక్టర్ కూడా సినిమాలో సాదాసీదాగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ నుంచి మొదలై రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ముగుస్తుంది మహా సముద్రం. ఇద్దరు హీరోలున్నారు కదా.. సినిమాలో ఈ సీన్ అదిరిపోయిందిరా అనుకునేలా ఒక్క సీన్ కూడా లేదు. ముఖ్యంగా సిద్ధార్థ్ కారెక్టర్‌ను డైరెక్టర్ రాసుకున్న విధానం బాగానే ఉన్నా.. ముగించిన విధానం మాత్రం అస్సలు బాగోలేదు.
నటీనటులు:
ఎప్పటిలాగే శర్వానంద్ తన పాత్రలో బాగా నటించాడు. మరోసారి తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సిద్ధార్థ్ బాగా నటించినా కూడా.. సినిమా చూశాక ఈ పాత్ర ఎందుకు ఒప్పుకున్నాడు అనిపిస్తుంది. చుంచు మామగా జగపతిబాబు బాగున్నాడు. కాస్త నవ్వించాడు కూడా. రావు రమేష్ కారెక్టర్ కూడా పర్లేదు. ఆయన పాత్ర కూడా బాగానే ఉంది. అను ఇమ్మాన్యుయేల్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. మహా పాత్రలో అదితి రావు హైదరీ పర్లేదనిపించింది. మెయిన్ కథ ఈమె చుట్టూ తిరిగినా కూడా అదితి పాత్ర సాదాసీదాగానే అనిపిస్తుంది. కెజియఫ్ విలన్ గరుడ రామ్ బాగున్నాడు. మిగిలిన పాత్రలన్నీ జస్ట్ ఓకే..
టెక్నికల్ టీం:
చైతన్ భరద్వాజ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆర్ఎక్స్ 100కు ఈయన పాటలే ప్రాణం. కానీ ఇక్కడ అంతగా ఆకట్టుకోలేదు. ఆర్ఆర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ రాజ్ తోట వర్క్ బాగుంది. విశాఖ అందాలను బాగా చూపించారు. స్క్రీన్ ప్లే లోపాలతో ఎడిటింగ్ కూడా వీక్‌గానే అనిపిస్తుంది. సెకండాఫ్ చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. భారీ బడ్జెట్‌తోనే సినిమాను నిర్మించారు. ప్యూర్ లవ్ స్టోరీగా మహా సముద్రం తెరకెక్కిందని దర్శకుడు అజయ్ భూపతి చాలా నమ్మకంగా చెప్పాడు కానీ అందులో అంత ఇమ్మెన్స్ లవ్ స్టోరీ అయితే కనిపించలేదు. మామూలు కథనే మహా సముద్రం అంతా లోతుగా చూపించాలనుకున్నాడు కానీ అది వర్కవుట్ కాలేదు.
చివరగా ఒక్కమాట:
మహా సముద్రం.. ఎన్నో ఆటు'పోట్లు'..
రేటింగ్: 2.5/5
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.