సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది మాధవీలత. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్గా మారిన మాధవీలత... నానితో కలిసి ‘స్నేహితుడా...’, ‘అరవింద్ 2’ వంటి సినిమాల్లో కనిపించింది. క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలతో సంచలనం క్రియేట్ చేసిన శ్రీరెడ్డి కంటే ముందే... ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గళం వినిపించింది మాధవీలత. అయితే అప్పట్లో పాపను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. చూడడానికి బాగానే ఉన్నా, హైట్ తక్కువగా ఉండడంతో మాధవీలతకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు. తాను పవన్ కల్యాణ్ వీరాభిమానినని సగర్వంగా ప్రకటించుకుని, ఆ పార్టీ తరుపున క్యాంపెయిన్ కూడా చేసిన మాధవీలత... ఉన్నట్టుగా బీజేపీలో చేరింది. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేసింది. అయితే వైసీపీ ఫ్యాన్ గాలి ముందు ఈ బీజేపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మాధవీలతకు కేవలం 1989 ఓట్లు మాత్రమే దక్కాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఫేస్బుక్ ద్వారా స్పందించిన మాధవీలత... తాను ఓడిపోతానని ముందుగానే తెలుసని ప్రకటించింది. ఓడిపోతానని తెలిసి బాధ్యతగా పార్టీకోసం బరిలో దిగానని ప్రకటించింది.

పవన్ కళ్యాణ్ పోటీచేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే...
‘నేను ఓడిపోతానని తెలుసు... పార్టీకి కూడా తెలుసు. ప్రజలందరికీ తెలుసు. ముందుగానే ఓడిపోతానని తెలిసి నా బాధ్యతగా పార్టీ కోసం పనిచేస్తున్నా. ఎక్కడా నేను గెలుస్తానని చెప్పలేదు. మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నా. వచ్చారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి నాకు వింతగా విడ్డూరంగా ఉంది...’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మాధవీలత... ‘డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాం... మాకు నిజాయితీపరులు వద్దు అని భలే చెప్పారుగా...’ అంటూ వెటకారంగా పోస్ట్ చేసింది మాధవీలత.

ప్రచారంలో భాగంగా దోసెలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన మాధవీలత
‘బీజేపీ జనాలకు డబ్బులు పంచలేదు. మోదీ మీద ఉన్న ప్రేమతో ఓట్లు పడ్డాయి. మరి పీకే (పవన్ కల్యాణ్) ఎందుకు గెలవలేదు? పీకే అభిమానులకు ఏమైంది? పవన్ కల్యాణ్ ఓటమి నాకు బాధగా ఉంది...’ అంటూ మరో పోస్టు వేసింది మాధవీలత. ఆంధ్రా ఓటర్లను అవమానిస్తూ తన బాధనంతా ఫేస్బుక్ ద్వారా వెల్లడిస్తూ వెళ్లింది మాధవీలత. ‘చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని చెప్పింది మీరే... జేడీ లక్ష్మీనారాయణ వచ్చారు... మరి ఆయన్ని ఎందుకు ఓడించారు? విద్యార్థులు ఏమయ్యారు? మీ ఓట్లు ఏమయ్యాయి? డబ్బు, కులం కావాలి? చదువు, నీతి మాకొద్దని మరోసారి చెప్పేసారుగా’ అంటూ తన పోస్టులను కొనసాగించింది మాధవీలత. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఉంటే... బీజేపీ ఓడిన మూడు రాష్ట్రాల్లో కూడా పదికి మించి సీట్లు వచ్చేవని, ఇలాంటి ఆరోపణలు చేసేముందు కాస్త తెలివిగా ఆలోచించాలంటూ ఫేస్బుక్లో కౌంటర్ ఇచ్చింది మాధవీలత. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం టీవీ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్ చేస్తోంది మాధవీలత.