Krithi shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు కృతి శెట్టి. హీరోయిన్గా ఆమెకు ఇది మొదటి చిత్రమే అయినప్పటికీ.. నటనలో పరిణతిని చూపించారు. విజయ్ సేతుపతితో నటించిన సన్నివేశాల్లోనూ కృతి ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టగా.. విడుదల తరువాత కృతిని బుక్ చేసుకునేందుకు పలువురు దర్శకనిర్మాతలు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా సమాచారం. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హీరోయిన్ అవ్వకముందు పలు యాడ్లలో నటించింది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మూవీలోనూ కనిపించింది. ఇంతకు ఆ చిత్రం ఏంటి.. అందులో కృతి ఏ పాత్రలో నటించింది అంటే..
ప్రముఖ మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా సూపర్ 30 అనే చిత్రం బాలీవుడ్లో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ 2019లో విడుదల అయ్యింది.
ఇందులో చాలా మంది విద్యార్థులుగా నటించగా.. వారిలో కృతి కూడా కనిపించింది. కీలక సన్నివేశాలు కానప్పటికీ.. కృతి మాత్రం రెండు మూడు చోట్ల కనిపిస్తుంది. అప్పుడప్పుడే మోడలింగ్ మొదలు పెట్టిన కృతికి.. సూపర్ 30లో అవకాశం రావడం విశేషం.
కాగా ప్రస్తుతం కృతి శెట్టి.. నాచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్‌లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు సుధీర్ బాబుతో ఓ చిత్రంలోనూ నటించనున్నారు. అలాగే ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మిగిలిన భాషల్లో నటించేందుకు కృతి రెడీగా ఉన్నట్లు సమాచారం.