తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. వెంకటేష్, దాసరి కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మ పుత్రుడుతో పరిచయమైన.. ప్రేమించుకుందా రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు జయప్రకాష్. ఆ సినిమాలో ఆయన నటన, డైలాగ్ తీరు ఎంతో ఆకట్టుకుంది. రాయలసీమ యాసలో జయ ప్రకాష్ మాట్లాడే తీరు మంత్ర ముగ్దుల్నీ చేస్తుంది. ఆ సినిమా తర్వాత జయ ప్రకాష్ చాలా సినిమాల్లో విలన్‌గా చేశాడు. భగవాన్, బావగారు బాగున్నారా లాంటీ సినిమాల్లో నటించినా.. బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమర సింహా రెడ్డి సినిమాలో మరో సారి రాయలసీమ యాసలో మాట్లాడుతూ విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డ్ వచ్చింది.
జయ ప్రకాష్ విలన్‌గా చాలా సినిమాల్లో అలరించాడు. అంతేకాదు కమెడీయన్‌గా కూడా ఆకట్టుకున్నాడు. శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన డీలో కానీ, ఇవివి ఎవడిగోల వాడిదిలో మంచి టైమింగ్‌తో అలరించాడు. ఇక ఆయన చివరి సినిమా మహేష్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు. విలనిజం పండించడంలో కోట శ్రీనివాస రావు తర్వాత జయ ప్రకాష్ అని చెప్పోచ్చు. అంతలా తన మాటలతో ఆకట్టుకోగలడు. జయ ప్రకాష్ స్వస్థలం.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల. సినిమాల్లోకి రాకముందు జయప్రకాష్ రెడ్డి పోలీసుశాఖలో పనిచేశారు. దర్శకరత్న దాసరి నారాయణ రావును ఆయనను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జయప్రకాశ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.