నటీనటులు : విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, యోగిబాబు, ఛాయా సింగ్ తదితరులు.
సంగీతం : హిప్‌హాప్ తమిళన్
సినిమాటోగ్రఫర్ : డుడ్లీ
ఎడిటర్: : ఎన్ బి శ్రీకాంత్
నిర్మాతలు : శ్రీనివాస్ ఆదెపు
దర్శకత్వం : సుందర్ సి
విశాల్ అంటే తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులున్నారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా దుమ్ము దులిపేస్తుంటాయి. అదే నమ్మకంతో వరస సినిమాలు ఇక్కడా విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన నటించిన యాక్షన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అదెలా ఉందో చూద్దాం..
కథ:
సుభాష్ (విశాల్) ఆర్మీ కల్నల్ ఆఫీసర్. ఆయన కుటుంబం రాజకీయాల్లో ఉంటుంది. సుభాష్ తండ్రి ముఖ్యమంత్రి.. ఆయన అన్నయ్య శ్రవణ్ (రాంకీ) కాబోయే ముఖ్యమంత్రి. అంతా హ్యాపీ ఫ్యామిలీ. ఆయన కూడా మిలటరీలో ఓ మిషన్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. పెళ్లి కూడా సెటిల్ అవుతుంది. బంధువుల అమ్మాయి మీరా (ఐశ్వర్య లక్ష్మీ) తో ప్రేమలో పడతాడు సుభాష్. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓ రాజకీయ పార్టీ మీటింగ్‌కు ప్రధాని అభ్యర్థి వస్తాడు. అదే మీటింగులో సుభాష్ కుటుంబం కూడా ఉంటుంది. శ్రవణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాసేపటికే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అందులో ప్రధాని అభ్యర్థి గుప్తాజీని బాంబ్ చనిపోతాడు. ప్రధాని అభ్యర్థిని చంపేసింది సుభాష్ ఫ్యామిలీ అని పుకార్లు పుడతాయి. అందులోంచి తన కుటుంబాలన్ని ఎలా బయటికి తీసుకొస్తాడు.. ఆ సయమంలోనే శ్రవణ్ కూడా చనిపోతాడు. ఈ క్రమంలోనే తోటి ఆఫీసర్ తమన్నాతో కలిసి ఏం చేసాడనేది అసలు కథ.
కథనం:
టైటిల్‌తోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పాడు దర్శకుడు సుందర్. ఏ మాత్రం తీసిపోకుండా ఫస్ట్ సీన్ నుంచే సినిమాను అలాగే తెరకెక్కించాడు. ముఖ్యంగా ఫస్టా షాట్‌లోనే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ్నుంచే ఆసక్తి పుట్టించాడు. విశాల్, తమన్నా ఒకర్ని ఛేజ్ చేయడం.. చంపేయడంతో అసలు కథ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు దర్శకుడు సుందర్. అప్పటి వరకు ఉన్న యాక్షన్ స్టోరీ కాస్తా పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా అయిపోతుంది. రొటీన్‌గానే అనిపించినా ఆసక్తికరమైన కథనంతో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు సుందర్. రాజకీయాలు.. అక్కడుండే ఎత్తుగడలతో పాటు కుట్రలు, బాంబ్ బ్లాస్టులు అన్నీ చూపించాడు. మళ్లీ అందులోనే టెర్రరిజం కూడా జోడించి పర్ఫెక్ట్ యాక్షన్ డ్రామాగా యాక్షన్ కథ సిద్ధం చేసాడు. ఫస్టాఫ్ వరకు బాగానే సాగినా.. సెకండాఫ్ మాత్రం పూర్తిగా గోపీచంద్ నటించిన చాణక్య సినిమాను పోలి ఉంటుంది. కథ పాకిస్థాన్ వెళ్లడం.. అక్కడే ఓ టెర్రరిస్ట్ దాక్కొని ఉండటం.. అతన్ని పట్టుకునే క్రమంలో హీరో వేసే ఎత్తులు అన్నీ చాణక్య సినిమాతోనే ముడిపడి ఉంటాయి. ఆ సినిమా చూడని వాళ్లకు మాత్రం యాక్షన్ పండగే. అన్ని సీన్స్ దాదాపు కాపీ పేస్ట్ మాదిరే అనిపిస్తాయి. ఈ విషయంలో సుందర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. బహుశా చాణక్య దర్శకుడు తిరు, సుందర్ ఒకేలా ఆలోచించారేమో మరి. హై యాక్షన్ ఎంటర్ టైనర్‌గా స్క్రీన్ ప్లేతో సాగినా కూడా అక్కడక్కడా ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినా కూడా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు బాగానే కనెక్ట్ అవుతుంది ఈ చిత్రం. తమన్నాతో విశాల్ కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.. వీళ్లు ప్రేమజంట కంటే మిలటరీ జంటగానే కనిపించారు.
నటీనటులు:
విశాల్ మరోసారి అదరగొట్టాడు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అయితే చించేసాడు. మరో రేంజ్ విశాల్ కనిపించాడు. తమన్నా గ్లామర్ షోతో పాటు నటనలో కూడా పర్లేదు. యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేసింది. ఇక ఐశ్వర్య లక్ష్మీ కూడా పర్లేదు. ఉన్నంత వరకు బాగా చేసింది. రాంకీ లాంటి సీనియర్ నటులు కూడా బాగానే ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం:
డుడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. చాలా దేశాల్లోని ప్రదేశాలను చక్కగా ఆవిష్కరించాడు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన చాలా అందంగా చూపించాడు. ఇక శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే సెకండాఫ్ కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపించాయి. యాక్షన్ పొడుగు ఎక్కువైపోయింది. ట్రీమ్ చేసి ఉంటే.. బాగుండేదేమో అనిపించింది. సంగీత దర్శకుడు హిప్‌హాప్ తమీజా మరోసారి బ్యాగ్రౌండ్ స్కోర్ చించేసాడు కానీ పాటలు మాత్రం బాగోలేవు.
సుందర్ సి ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా అనేలా ఈ చిత్రం ఉంది. దర్శకుడిగా ఆయన మరో మెట్టెక్కాడు కానీ కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.
చివరగా ఒక్కమాట:
యాక్షన్.. యాక్షన్ ప్రియులకు పండగే..
రేటింగ్: 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.