హోమ్ /వార్తలు /సినిమా /

Acharya Aatreya Birth Anniversary: మనసు కవి ఆత్రేయ శత జయంతి ప్రత్యేకం..

Acharya Aatreya Birth Anniversary: మనసు కవి ఆత్రేయ శత జయంతి ప్రత్యేకం..

నేడు ‘ఆచార్య ఆత్రేయ’ శత జయంతి (File/Photo)

నేడు ‘ఆచార్య ఆత్రేయ’ శత జయంతి (File/Photo)

Acharya Aatreya 100 Birth Aniversary: ఆచార్య ఆత్రేయ..తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది కవులున్న ఆయన మనసు కవిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ శుక్రవారం ఆచార్య ఆత్రేయ శత జయంతి సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేకం..

Acharya Aatreya 100 Birth Aniversary: ఆచార్య ఆత్రేయ..తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది కవులున్న ఆయన మనసు కవిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  మనసు చేత మనసు కొరకు మనసే రాసిన పాటల్లా వుంటాయవి. అందుకే మనసు కవిగా, మన సుకవిగా పేరు పొందారాయన. పోరా బాబూ పో.. అంటూ ‘దీక్ష’ చిత్రంతో  మొదలైన పాటల ప్రవాహం..  ‘ప్రేమయుద్ధం’ చిత్రంలో రాసిన మువ్వల గానం.. వరకూ సాగింది. ఆ మధ్య కాలంలో సుమారు రెండు వేల పాటలు.  వేటికవే ప్రత్యేకాలు. ప్రతిదాన్లో సమ్మోహనమంత్రమేదో దాచి రాసినట్టు ఉంటాయవి. అలాంటి పాటలు రాసిన ఆత్రేయ జయంతి సందర్భంగా ఒక జ్ఞాపకం. ఈ శుక్రవారం ఆచార్య ఆత్రేయ శత జయంతి సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేకం..

పాడమని నన్నడగవలెనా పరవశించీ పాడనా అని ఎంతో తేలిగ్గా పాటైతే రాసారు గానీ ఆత్రేయ రాయడమంటే అంత సులభంగా అయ్యే పని కాదు. అదో పెద్ద కలం కార్యం. భువి నుంచి దివికి దేవతలు దిగిరావాలి. ఆయన మనసు పులకించాలి. తర్వాత రాయాలి అన్నంత చందంగా వుంటుంది ఆయన పాటలు రాసే విధానం. అందుకే రాయక ముందు నిర్మాతలనూ రాసిన తర్వాత ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. కలానికి ఇంకు బదులు మనసు తడి వాడి రాస్తారాయన. అందుకే అంత ఆలస్యం అనీ చెబుతారు. అందుకే ఆయన ఆత్రేయ అయ్యారు. ఆచార్య ఆత్రేయగా నిలిచారు.

ఆత్రేయ అసలు పేరు.. కిళాంబి వెంకట నరసింహాచార్యులు. సరిగ్గా వందేళ్ల క్రితం 1921 మే 7, నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మండలం, మంగళంపాడు గ్రామంలో. తల్లిదండ్రులు సీతమ్మ, కృష్ణమాచార్యులకు జన్మించారు.  భార్య పద్మావతి. కవి, రచయిత, నిర్మాత, దర్శకుడు ఇలా పలురకాలుగా రాణించిన ఆత్రేయ.. బాణం అనే యువతి ప్రేమలో పడి తరువాత పద్మావతిని పెళ్లాడారు. ఆ ప్రేమ విఫలమే కావచ్చు.. ఆయన్నో కవిగా మలుపు తిప్పింది. ఆ విషాదమే కావచ్చు అమృతతుల్యమైన సాహిత్యానికి అంకురార్పణ వేసింది.  ప్రేమ మనసులతో ఎలా ఆడుకుంటుందో తెలియడం వల్లే కావచ్చు ఆత్రేయ అన్నేసి తత్వాలను ఔపోసన పట్టారు. మనసును వీణలా మీటి రాగాలు పండించారు. అంతులేని సాహిత్యాలు వొలికించారు.

ఇక తెలుగు సినిమాల్లో వాన పాటలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఆత్మబలం’ సినిమాలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే.. ఈ పాటను ఆత్రేయగారు.. మద్రాసు బీచ్‌ రోడ్డులో వెళుతుంటే.. సడెన్ వర్షం పడిందట. అపుడు ఓ జంట చెట్టు నీడన పరిగెత్తుతూ కనబడ్డారట. వెంటనే ఆత్రేయ బుర్రకు పదును పెట్టారు. టకా టకా చిటటప చినుకులు పుడుతూ ఉంటే పాటకు శ్రీకారం చుట్టారు. తెలుగు సినిమాల్లో ఈ పాటకు ఎప్పటికీ చిర స్థాయిగా నిలిచిపోయింది.

మనసు గతి ఇంతే మనిషి బతుకు ఇంతే మనసున్న మనిషికీ సుఖము లేదంతే అంటూ ఆయన కలం నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి. తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించడంలో ఆత్రేయ దిట్ట. ఆయన పాటలు తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించాయి. ప్రేక్షకుడ్ని సినిమాలో మమేకమయ్యేలా చేయడంలో ఆయన కాయనే సాటి.

కేవలం విరహగీతాలనే కాకుండా తన కలంలోంచి ఒక్కో పాట ఒక్కో వైవిధ్యంగా రాసుకొచ్చారు ఆత్రేయ. భారతమాతకు జేజేలు.. బంగరుభూమికి జేజేలు అనే పాట అలాంటిదే.  ‘బడి పంతులు’ చిత్రంలో ఆత్రేయ తన కలం నుంచి దేశభక్తి పొంగించారు.

అంతేనా అదే చేత్తో మరో పాట రాసి కడుపుకాలే కష్టజీవులు.. ఒడలు విరిచి గనులు తొలచే అంటూ శ్రామిక పక్షాన నిలిచాడు. తోడికోడళ్లు చిత్రం ద్వారా ఆత్రేయ ఈ శ్రామిక చైతన్యం ప్రేక్షకులకు రుచి చూపించారు.

భక్తిరసప్రధానంగానూ ఆత్రేయ కలం అద్భుతాలు సృష్టించింది. శేషశైలావాస శ్రీవెంకటేశా అంటూ ఆయన శ్రీనివాసుడికి జోలపాడిన విధం మరిచిపోలేనిది. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. విన్న వెంటనే శీవారి చెంతకు పట్టుకెళ్లిపోతుంది.

సరిగ్గా అదే సమయంలో ఉన్నావా అసలున్నావా అంటూ ఆత్రేయ పాట  దైవాన్ని ప్రశ్నించింది కూడా.

అంతేనా అంతస్తులు చిత్రంలో రాసిన తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము.. అంటూ శృంగారరసం ఒలికించింది ఆత్రేయ కలం. కొన్ని కొన్ని ఆయనే రాయాలన్నంతగా ఉంటాయా పాటలు. తెలుగుపాటకు మనసుతో నవరాసాలను అద్ది ప్రేక్షకులను ఓలలాడించారు.

ఆత్రేయ. ప్రేమనగర్ సినిమాలో కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే పాటలో తొణికిసలాడిన రొమాన్స్ తెలుగుసినిమా వున్నంత కాలం బతికే వుంటుంది.

ఎన్నో మంచి పాటలు. నేనొక ప్రేమపిపాసిని.. అని అంతరంగ ఆవిష్కరణ చేశాడు. సిరిమల్లె పూవల్లె నవ్వు.. అంటూ నవ్వులు చిందించారు. మాటరాని మౌనమిది అంటూ మనసు మీటారు. రేపంటి రూపం కంటీ అంటూ మంచి చెడులు విశ్లేషించాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.. అంటూ ఎదురు చూశారు.

ముఖ్యంగా కమల్ హాసన్, బాలచందర్ కలయికలో తెరకెక్కిన ‘ఆకలి రాజ్యం’ సినిమాలో శ్రీశ్రీ ప్రస్తావన ఉంటుంది. కానీ అందులో సందేశాత్మకమైన ‘సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్’ అంటూ ఆకలి కేకలను తన కలంలో వినిపించారు. ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా’ అంటూ వేసిన సమాజాన్ని ప్రశ్నించింది. అలా తన కలానికి రెండు వైపులా పదును ఉందని నిరూపించారు.

రాళ్లల్లో ఇసుకల్లో ప్రేమికుల చేత ప్రేమలేఖలు రాయించాడు. కేవలం కలంతో మనసుకు గాలం వేయడం అనే విద్యా ఆత్రేయకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పొచ్చు.

అభినందన సినిమాలో ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం అంటూ తన కలంతో రాగాలు పలకరించారు. ఆత్రేయ కలానికి ఇళయారాజా బాణీలు.. ఎస్పీ బాలు గాత్రం ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్లింది.

ప్రేమ గీతాలు రాయడంలో దిట్ట అయిన ఆత్రేయ అదే ‘ప్రేమ’ పేరుతో తెరకెక్కిన చిత్రంలో ‘ప్రియతమా నా హృదయమా’ అంటూ అలతి అలతి పదాలతో ఆయన పలకించిన పదాలు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి.

1989,  సెప్టంబర్ 13.. ఎందరో సినీ అభిమానులను విషాదంలో ముంచుతూ ఈ లోకాన్ని విడిచివెళ్లారు ఆత్రేయ. మనసుతో ఆయన పలికించిన భావాలకు ఆచార్యత్వం వహించారు. కనుకనే ఆచార్య ఆత్రేయ అయ్యారు.  ఆయన కలం మూగపోయినా పాటలు ఆగవు. ఆ పాటలు ఆగినా అందులోని రాగాలకు అంతం లేదు. వాటిలో పలికించిన భావాలకు మరణం లేదు. ఆత్రేయ ఆగని మనోభావాల ఉధృతికి చెరగని ముద్రలాంటి వారు. ఇందులో అనుమానం లేదు.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు