Abijeet Bigg Boss 4: బిగ్ బాస్ 4 సమరం ముగిసింది. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ విజేతగా అభిజీత్, రన్నర్‌గా అఖిల్ నిలిచారు. కాగా ఈ సీజన్ ప్రారంభం కాకముందు దీనిపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. కరోనా నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ ఉండకపోవచ్చునన్న అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు కరోనా నేపథ్యంలో ఆ మధ్యలో షూటింగ్‌లకు కూడా అనుమతి లేకవడంతో.. బిగ్ బాస్ 4 ఈ ఏడాది ఉండకపోవచ్చునని అనుకున్నారు. కానీ షూటింగ్‌లకు పర్మిషన్ రావడం, ఈ ఏడాది నాలుగో సీజన్‌ని ఎలాగైనా పూర్తి చేయాలని నిర్వాహకులు దృఢ నిశ్చయంతో ఉండటంతో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. ఎన్నో జాగ్రత్తల మధ్య నాగార్జున వ్యాఖ్యతగా ప్రారంభమైన ఈ సీజన్ విజయవంతంగా ముగిసింది.
ఈ క్రమంలో నిర్వాహకులు కూడా ఎన్నో జాగ్రత్తలను తీసుకున్నారు. కంటెస్టెంట్లను లోపలికి వెళ్లేముందు క్వారంటైన్లో ఉంచి, పరీక్షలు నిర్వహించి తరువాత లోపలికి పంపారు. అలాగే బయటికి వచ్చిన తరువాత ఎవ్వరినీ ఈసారి రీఎంట్రీ చేయించలేదు. అంతేకాదు ఫ్యామిలీ సమయంలోనూ ఓ గాజు గ్లాస్‌ని అడ్డుగా పెట్టి ఎంటర్‌టైన్‌ని ఏ మాత్రం తగ్గించకుండా చూసుకున్నారు.
ఇక ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అభిజీత్.. చివరి వరకు తన యాట్యిట్యూడ్తో అందరినీ మెప్పించారు. ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా.. అందరినీ కలుపుకుంటూ పోతూ మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నారు. మొదట్లో అందరితో కాకుండా కొంతమందితోనే ఉంటూ వచ్చిన అభిజీత్.. ఆ తరువాత మారుకుంటూ వచ్చారు. టాస్క్‌లలో పెద్దగా పర్ఫామ్ చేయకపోయినప్పటికీ.. తన ప్రవర్తనతో పాటు మంచి మార్కులు కొట్టేశాడు. మొత్తం 11 సార్లు ఎలిమినేషన్‌కి నామినేట్ అవుతూ వచ్చిన అభి.. ఒక్కసారి కూడా డేంజర్ జోన్లో ఉండలేదు. అయితే ఈ విన్నర్ ఇప్పుడు బిగ్‌బాస్ చరిత్రను తిరగరాశాడు.
అదేంటంటే ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకుండా ట్రోఫీనే గెలిచాడు అభిజీత్. అవును.. ఆరోగ్య కారణాల వలన పలు టాస్క్‌లలో పాల్గొనలేకపోయిన అభి.. కొన్నింటిలో మాత్రం బాగా ఆడాడు. ఇక కెప్టెన్ బరిలో ఒక్కసారి మాత్రమే నిలిచాడు. అయితే ఆసారి కూడా అభి గెలవలేకపోయాడు. ఇలా ఒక్కసారి కూడా అభిజీత్ కెప్టెన్ అవ్వలేదు. కానీ చివరకు విన్నింగ్ ట్రోఫీని దక్కించుకున్నాడు.
తెలుగులో బిగ్‌బాస్ ఇప్పటివరకు మూడు సీజన్లను పూర్తి చేసుకోగా.. మొదటి సీజన్ విజేత శివ బాలాజీ, రెండో సీజన్ విజేత కౌశల్, మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్.. ముగ్గురు కెప్టెన్లుగా అయ్యారు. కానీ అభిజీత్ మాత్రం ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేకపోయాడు. దీంతో బిగ్‌బాస్ హిస్టరీలో ఒక్కడుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అభి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.