హోమ్ /వార్తలు /సినిమా /

Crazy Fellow movie review: ‘క్రేజీ ఫెల్లో’ మూవీ రివ్యూ.. అలరించే ఎంటర్‌టైనింగ్ ఫెలో..

Crazy Fellow movie review: ‘క్రేజీ ఫెల్లో’ మూవీ రివ్యూ.. అలరించే ఎంటర్‌టైనింగ్ ఫెలో..

క్రేజీ ఫెల్లో మూవీ రివ్యూ (Twitter/Photo)

క్రేజీ ఫెల్లో మూవీ రివ్యూ (Twitter/Photo)

Crazy Fellow movie review: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలలో ఆది సాయికుమార్ ముందుంటాడు. ఎప్పుడు చూడు కనీసం రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటాడు ఈ కుర్రాడు. ఇప్పుడు కూడా మరో సినిమాతో వచ్చేసాడు. ఈ ఏడాది ఇప్పటికే బ్లాక్, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసిన ఆది.. తాజాగా క్రేజీ ఫెల్లో అంటూ వచ్చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? వీకెండ్‌కు ఓ లుక్ వేయొచ్చా లేదా..? మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా, సప్తగిరి, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, నర్రా శ్రీనివాస్ తదితరులు

సినిమాటోగ్రఫి: సతీష్ ముత్యాల

సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్

ఎడిటర్: సత్య గిడుతూరి

నిర్మాత: కేకే రాధమోహన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఫణికృష్ణ

విడుదల తేది: 14-10-2022

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలలో ఆది సాయికుమార్ ముందుంటాడు. ఎప్పుడు చూడు కనీసం రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటాడు ఈ కుర్రాడు. ఇప్పుడు కూడా మరో సినిమాతో వచ్చేసాడు. ఈ ఏడాది ఇప్పటికే బ్లాక్, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసిన ఆది.. తాజాగా క్రేజీ ఫెల్లో అంటూ వచ్చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? వీకెండ్‌కు ఓ లుక్ వేయొచ్చా లేదా..? మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ:

అభిరామ్ (ఆది సాయికుమార్) కింగ్ సైజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. చిన్నపుడే అమ్మానాన్నలు చనిపోయిన అభిని అన్నా వదినలే పెంచుతారు. అది కూడా చాలా గారాబంగా చూసుకుంటారు. ఎలాంటి బాధ్యత లేకుండా ఉన్న అభిని తన వదిన బలవంతంగా.. భర్తకు తెలిసిన కంపెనీలో జాబ్ వేయిస్తుంది. ఆ కంపెనీ (సప్తగిరి) రన్ చేస్తుంటాడు. సదరు కంపెనీలో చేరిన వెంటనే మధుమిత అలియాస్ చిన్ని (దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడుతుంది. ఈ ఇద్దరూ ఎప్పుడూ ఉప్పు నిప్పులా కాలిపోతూ ఉంటారు. అభిరామ్‌కు ఓ స్నేహితుడు ఉంటాడు. అతడి పేరు రమేష్ (నర్రా శ్రీనివాస్). అతడి బలవంతం మేరకు డేటింగ్ యాప్‌లో చిన్నితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంటాడు అభిరామ్. అక్కడ చిన్ని అంటే మధుమిత.. కానీ కొన్ని రోజులు డేటింగ్ చేసిన తర్వాత అదే పేరుతో ఉన్న మరో చిన్ని (మిర్నా మీనన్)కి వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. డేటింగ్ యాప్‌లో పేరు మార్చి.. అభిరామ్ ఎందుకు నాని పేరుతో చిన్నితో డేటింగ్ చేశాడు.. మరో అమ్మాయికి లవ్ యూ చెప్పిన అభి.. ఆ సమస్యలోంచి ఎలా బయడపతాడు అనేది మిగిలిన కథ..

కథనం:

చూడ్డానికి రొటీన్ కథలాగే అనిపించినా కూడా క్రేజీ ఫెల్లోలో ఎంటర్‌టైన్మెంట్ అయితే బాగానే నింపేసాడు దర్శకుడు ఫణి కృష్ణ. ఎప్పట్నుంచో చూసిన కథలాగే ఉన్నా.. స్క్రీన్ ప్లే పరంగా పర్లేదు అనిపించాడు. తను రాసుకున్న లవ్ స్టోరీని సైతం పక్కా కమర్షియల్ పంథాలో నడిపించాడు దర్శకుడు. నెక్ట్స్ వచ్చే సీన్ ముందుగానే ఊహించేలా ఉంటుంది కానీ దాన్ని సైతం వినోదాత్మకంగా అల్లే ప్రయత్నం అయితే చేసాడు. ఈ విషయంలో ఆది సాయికుమార్ నటన కూడా యాడ్ ఆన్ అయింది. హీరో తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం.. అతన్ని అన్నా, వదిన మరో అమ్మా నాన్నగా పెంచడం.. ఎలాంటి బాధ్యతలు లేకుండా ఉండటం.. అంత బాధ్యత లేకుండా ఉన్నా.. ఫ్యామిలీకి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ముందుకు రావడం.. ఇవన్నీ ఈ సినిమాలో బాగానే రాసుకున్నాడు దర్శకుడు. అప్పటి వరకు తను ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానుకున్న హీరో.. మరో అమ్మాయికి ఇంటర్వెల్ ముందు వచ్చి ఐ లవ్యూ చెప్పడంతో కథలో అసలు మలుపు తిరుగుతుంది. సెకండ్ హీరోయిన్ మిర్నా మీనన్ ఎంట్రీతో ఆసక్తికరంగా మారుతుంది. అప్పటి వరకు తాను డేటింగ్ చేసిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయికి ప్రపోజ్ చేయడంతో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ అయితే పెంచేసాడు దర్శకుడు. సెకండాఫ్‌ పూర్తిగా దీనిపైనే రన్ అవుతుంది. ఒక చిన్నికి ఐ లవ్ యూ చెప్తున్న సమయంలోనే.. అసలు చిన్నికి యాక్సిడెంట్ అవ్వడం.. ఆ తర్వాత హీరోకు ఆ విషయం తెలిసి మధుమిత అలియాస్ చిన్నిని కాపాడుకోడానికి ఎలాంటి ప్రయత్నం చేసాడు అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

టెక్నికల్ టీం:

ఆర్ఆర్ ధృవన్ పాటలు బాగాలేవు.. అంతగా ఆకట్టుకోలేదు.. కాకపోతే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫి రిచ్‌గా ఉంది. సత్య గిడుతూరి ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్ ఇంకాస్త కత్తెర పడుండాల్సి ఉండుంటే బాగుండేది. నిర్మాత కేకే రాధామోహన్ నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి. దర్శకుడు ఫణి కృష్ణ టేకింగ్ బాగుంది.. రాసుకున్న కథ రొటీన్‌గానే ఉన్నా.. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.

నటీనటులు:

ఆది సాయికుమార్ మరోసారి ఆకట్టుకున్నాడు.. స్క్రీన్ పై నటనతో పాటు డాన్సులు, ఫైట్స్‌లోనూ బాగున్నాడు.. లవర్‌ బాయ్ క్యారెక్టర్‌లోనూ బాగా చేసాడు. మంచి ఈజ్‌తో కనిపించాడు. అభిరామ్‌ పాత్ర కోసం ఈయన అయిన మేకోవర్ చాలా బాగుంది.. ఇద్దరమ్మాయిల మధ్య నలిగే పాత్రలో మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. మంచి కథ పడితే.. ఆదిలో మంచి నటుడు ఉన్నాడని క్రేజీ ఫెల్లో నిరూపించింది. ఒకే పాత్రలో వేరియేషన్స్‌, ఎమోషన్స్‌ను చక్కగా చూపించాడు. ఫైట్స్, డాన్స్‌లలో బాగున్నాడు. మధుమతిగా దిగంగన సూర్యవంశీ గ్లామర్‌గానూ.. పెర్ఫార్మెన్స్ పరంగానూ బాగానే ఉంది. మరో చిన్నిగా మిర్నామీనన్ బబ్లీగా, క్యూట్‌గా అనిపించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ నర్రా శ్రీనివాస్ కామెడీ ఈ సినిమాకు బాగానే ప్లస్ అవుతుంది. మిగిలిన పాత్రలన్నీ ఓకే..

ప్లస్ పాయింట్స్:

ఆది సాయికుమార్ నటన

స్క్రీన్ ప్లే

ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్:

తొలి 30 నిమిషాలు

రొటీన్ కథ

చివరి మాట: క్రేజీ ఫెల్లో.. రొటీన్ బట్ ఎంటర్‌టైనింగ్ ఫెల్లో..

రేటింగ్: 2.75/5

First published:

Tags: Aadi Sai Kumar, Tollywood

ఉత్తమ కథలు