ఈ మధ్య సినిమా సెట్లలో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఆ మధ్య భారతీయుడు 2 షూటింగ్లో జరిగిన ప్రమాదం గురించి ఎవరూ అంత ఈజీగా మరిచిపోలేరు. ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది మరిచిపోకముందే మరికొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. అప్పట్లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ షూటింగ్ సమయంలో కూడా ఓ వ్యక్తి మరణించాడు. ఇప్పుడు మరో దుర్ఘటన కూడా జరిగింది. తాజాగా ఓ కన్నడ సినిమా షూటింగ్లో కరెంట్ షాక్ కొట్టి ఓ వ్యక్తి బలైపోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అజయ్ రావు, రంచిత రామ్ జంటగా నటిస్తున్న సినిమా లవ్ యూ రచ్చు సినిమా షూటింగ్ రామనగర తాలూక జోగర్పాల్య సమీపంలో జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సెకండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే షూటింగ్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు.
ఈ షూటింగ్లో అనుకోకుండా ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్తో సెట్లో పని చేస్తున్న వివేక్ అనే 28 ఏళ్ళ సినీ కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు.. మరొకరికి తీవ్రగాలయ్యాయి. ఈ ఘటన బిదాడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దాంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని పరిస్థితి ఆరా తీసారు. ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్ నిలిపేసారు చిత్ర యూనిట్.
జరిగిన దానికి వాళ్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. గాయపడిన మరో వ్యక్తిని బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. చనిపోయిన వివేక్ మృతదేహాన్ని రాజరాజేశ్వరనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచారు. శంకర రాజ్ తెరకెక్కిస్తున్న లవ్ యూ రచ్చు సినిమాను మరో ప్రముఖ దర్శకుడు గురు దేశ్పాండే నిర్మిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kannada Cinema, Telugu Cinema