30 Rojullo Preminchadam Ela review: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ రివ్యూ.. ఏంటిది అబ్బాయి గారు..?

30 రోజుల్లో ప్రేమించడం ఎలా రివ్యూ (Pradeep 30 Rojullo Preminchadam Ela review)

30 Rojullo Preminchadam Ela review: ఇన్నేళ్లూ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరో అయ్యాడు. ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? అంచనాలు అందుకుందా..? ప్రదీప్ హీరోగా నిలబడ్డట్టేనా..?

  • Share this:
రివ్యూ: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, భద్రమ్, సమీర్, శుభలేక సుధాకర్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
సినిమాటోగ్రఫర్: దాశరథీ శివేంద్ర
నిర్మాత: SV బాబు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మున్నా

ఇన్నేళ్లూ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరో అయ్యాడు. ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? అంచనాలు అందుకుందా..? ప్రదీప్ హీరోగా నిలబడ్డట్టేనా..?

కథ:
అబ్బాయి గారు (ప్రదీప్), అమ్మాయి గారు (అమృత అయ్యర్) స్వాంతంత్య్రానికి పూర్వం ఓ ఊళ్లో మంచి ప్రేమికులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ అనుకోకుండా ఒకరిపై ఒకరు కోపంతో చనిపోతారు. ఆ తర్వాత మళ్లీ జన్మలో అర్జున్, అక్షరగా పుడతారు. అర్జున్‌కు బాక్సింగ్ అంటే ప్రాణం.. అక్షరకు అక్క అంటే ప్రాణం. అలాంటి అర్జున్, అక్షర ఇద్దరూ ఒకే కాలేజీలో చేరతారు. ఇద్దరికీ గత జన్మ జ్ఞాపకం లేకుండానే ఒకరంటే ఒకరికి కోపం ఉంటుంది. అందుకే కాలేజీలో కూడా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఓ కాలేజ్ టూర్‌కు వెళ్తారు. అప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. దాంతో ఇద్దరూ పెద్ద సమస్యలో ఇరుక్కుపోతారు. 30 రోజుల్లో ఒకరినొకరు మనస్పూర్థిగా ప్రేమించుకుంటే గానీ ఆ సమస్యలోంచి బయట పడలేమని అర్థం చేసుకుంటారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు వాళ్లకు ఎదురైన సమస్య ఏంటి.. ఎలా బయటపడ్డారు అనేది అసలు కథ..

కథనం:
ఒక జన్మలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకోవడం.. కానీ కలవకుండానే ప్రాణాలు పోగొట్టుకోవడం.. ఓడిపోయిన ప్రేమను గెలిపించుకోడానికి మళ్లీ పుట్టడం.. తెలుగు ఇండస్ట్రీలోనే ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫార్ములా.. పునర్జన్మ. జాగ్రత్తగా డీల్ చేస్తే జానకిరాముడు అవుతుంది.. తేడా కొడితే ఎందుకంటే ప్రేమంట అంటారు..? అలాంటి కథనే తన డెబ్యూ కోసం తీసుకున్నాడు యాంకర్ ప్రదీప్. కత్తి మీద సాము లాంటి పునర్జన్మ కాన్సెప్టుతోనే వచ్చాడు ఈ కుర్ర యాంకర్. ప్రేమతో చచ్చిపోయి.. వచ్చే జన్మలో కలవడం కామన్ పాయింట్. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో మాత్రం కోపంతో చనిపోయి మళ్లీ పుట్టడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు మున్నా. టైటిల్స్ పడటమే గత జన్మతో మొదలుపెట్టి.. 10 నిమిషాల్లోనే ప్రస్తుతానికి తీసుకొచ్చేసాడు. ఫస్టాఫ్ అంతా కాలేజ్ సీన్స్‌తో కాస్త ఎంటర్‌టైన్ చేసాడు.. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఆ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగిపోతాయి.. కానీ అక్కడ్నుంచే కథ నెమ్మదించింది. స్క్రీన్ ప్లే ఇంకాస్త వేగంగా ఉండుంటే సినిమా మరింత అందంగా ఉండేది. సెకండాఫ్‌లో ప్రెగ్నెంట్ లేడీ సీన్.. అమ్మ సీన్ బాగున్నాయి. దాంతో పాటు హీరోయిన్ అక్కను ఆమె తండ్రికి దగ్గర చేసే సీన్ కూడా ఎమోషనల్‌గా బాగానే ఉంది. క్లైమాక్స్ ఈజీగా తేల్చేసినట్లు అనిపిస్తుంది.. కానీ పర్లేదు.
కొన్ని సన్నివేశాలు చాలా అందంగా రాసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. ముందు జన్మ నుంచి కథ మొదలు పెట్టి.. ఆ తర్వాత ఈ జన్మలోకి వచ్చాడు. అక్కడా పెద్దగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేదు. అయితే దర్శకుడు నిజమైన ప్రేమ గురించి చెప్తానని చెప్పి.. ఓ బాబాతో ముందు జన్మ ప్రేమకథ చెప్తాడు. అయితే అక్కడ నిజంగా అంత ప్రేమ కనిపించే సన్నివేశాలు లేవు. ఓ పాటతోనే ప్రేమను తేల్చేసాడు. ఆ తర్వాత వాళ్లను చంపేసాడు. కానీ అక్కడ ఇంకాస్త ప్రేమను తెలిపే సన్నివేశాలు ఉండుంటే బాగుండేది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయినా.. ఆ తర్వాత కథలో కాస్త కన్ఫ్యూజన్ మొదలైంది. దాన్ని కూడా క్లారిటీగా రాసుకునే ప్రయత్నం చేసాడు. క్లైమాక్స్ కూడా ముందు జన్మకు లింక్ పెట్టి బాక్సింగ్‌తోనే కథను ముగించేసాడు. ఓవరాల్‌గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా పర్లేదనిపిస్తుందంతే.

నటీనటులు:
యాంకర్ ప్రదీప్ హీరోగా బాగానే ఉన్నాడు. బుల్లితెరపై స్టార్ అయినా వెండితెరపై మాత్రం నటనలో ఇంకా మెలుకువలు రావాలి. కొన్నిచోట్ల హీరోయిన్ అమృత అయ్యర్ ఆయన్ని నటనలో తినేసింది. ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది అమృత. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అమృత నటన.. సెకండాఫ్ ఇరగదీసింది. వైవా హర్ష కూడా బాగానే చేసాడు. కొన్ని సీన్స్ చాలా బాగా నవ్వించాడు కూడా. భద్రం పర్లేదు. సమీర్, శుభలేక సుధాకర్, పోసాని, హేమ, శివనాగేశ్వరరావు బాగానే చేసారు.

టెక్నికల్ టీం:
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు ప్రాణం అనూప్ రూబెన్స్ సంగీతం. నీలినీలి ఆకాశం మాత్రమే కాదు.. అన్ని పాటలు ఆకట్టుకుంటాయి. స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదనే కసో ఏమో కానీ ఈ సినిమాను కేవలం తన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే నిలబెట్టేసాడు. చాలా సన్నివేశాలు అదుర్స్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఎడిటింగ్ వీక్. సెకండాఫ్ ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు మున్నా పునర్జన్మల కథను బాగానే డీల్ చేసినా అక్కడక్కడా తేలిపోయింది. స్క్రీన్ ప్లే ఇంకా పక్కాగా ఉండుంటే సినిమా రేంజ్ మారిపోయేది.

చివరగా ఒక్కమాట:
30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. పాటలు మాత్రమే బాగున్నాయి..

రేటింగ్: 2.5/5
Published by:Praveen Kumar Vadla
First published: