World Vegetarian Day: శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా?

World Vegetarian Day: నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 1, 2020, 12:13 PM IST
World Vegetarian Day: శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా నేపథ్యంలో ఆరోగ్యంపై అన్ని వర్గాల ప్రజలకూ అవగాహన పెరుగుతోంది. అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి. కొంతమంది శాకాహారమే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంగడా, మరికొంతమంది మాంసాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. వేగంగా మారుతున్న జీవనశైలిలో చాలామంది మాంసాహారాన్ని వదిలేసి శాకాహారాన్ని ఎంచుకుంటున్నారని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

* ప్రతి సంవత్సరం అక్టోబర్1న ప్రపంచ వ్యాప్తంగా శాఖాహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు. శాకాహార ఉపయోగాలను ప్రజలకు వివరించడానికి, శాకాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 1977లో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ (NAVS) ప్రపంచ శాకాహార దినోత్సవం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 1978లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ దీన్ని ఆమోదించింది. శాకాహారం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పరిమితులను కూడా గుర్తించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శాకాహారం- ఆరోగ్య ప్రయోజనాలు
శారీరక ఆరోగ్యం మెరుగుపడటానికి, శరీరం జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి శాకాహారం అవసరం. శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే...
1. గుండె ఆరోగ్యం
మాంసాహారం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. దీనికి బదులుగా అన్నిరకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే హార్ట్ ఎటాక్, హార్ట్ స్ర్టోక్ ల బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఈ రెండింటి వల్లే గుండె సంబంధ అనారోగ్యాలతో ఎక్కువ మంది చనిపోతున్నారు. కానీ గుండె ఆరోగ్యానికి మాంసాహారం కంటే శాకాహారమే మంచిదని చెప్పే కచ్చితమైన ఆధారాలు లేవు.

2. రోగనిరోధక శక్తి వృద్ధిశాకాహారంలో భాగమైన పండ్లు, కూరగాయలలో విటమిన్ సి, డి వంటి సూక్ష్మ పోషకాలు, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి, అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.

3. క్యాన్సర్ కు దూరంగా
క్యాన్సర్ కణాల అభివృద్ధికి మాంసాహారం కూడా కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శాకాహారం ఎక్కువగా తీసుకునేవారు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం తక్కువ అని మరికొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. కానీ ఈ రెండింటి మధ్య పెద్దగా తేడాలు ఉండే అవకాశం లేదు.

4. డయాబెటిస్ అదుపులో ఉంటుంది
టైప్ 2 డయాబెటిస్ను అదుపులో ఉంచడానికి ఆకుకూరలు, మొక్కల సంబంధిత శాకాహారం తోడ్పడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. పండ్లు, కూరగాయలు, కాయలు, విత్తనాలు వంటి వాటిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్(పీచు పదార్థం) జీవక్రియల సమతుల్యాన్ని కాపాడుతుంది. దీంతో మధుమేహాన్ని సాధ్యమైనంత వరకు అదుపుతో ఉంచుకోవచ్చు.

5. పర్యావరణాన్ని కాపాడుతుంది.
జంతు సంబంధ ఆహార పదార్థాలకు దూరంగా ఉండే శాకాహారులు పర్యావరణ పరిరక్షణకు పరోక్షంగా సాయం చేస్తారు. మాంసాహారం వినియోగదారులకు చేరేవరకు ఎన్నో రకాలుగా పర్యావరణం ప్రభావితమవుతుంది. శాకాహారం పర్యావరణ అనుకూలమైనది.

* పరిమితులు
1. పోషకాహార లోపం ప్రమాదం
శాకాహారంలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, కొన్ని రకాల విటమిన్లు, సూక్ష్మపోషకాలు వంటివి కేవలం మాంసాహారం నుంచే లభిస్తాయి. వీటిలో విటమిన్ డి, బి 12 వంటివి ముఖ్యమైనవి. కేవలం శాకాహారమే తీసుకునేవారికి ఇలాంటి పోషకాలు అందక, పోషకాహార లోపం బారిన పడే అవకాశం ఉంది. ఇది శరీర జీవ క్రియలను దెబ్బతీయడంతో పాటు అనారోగ్యాలకు కూడా దారితీయవచ్చు.

2. ప్రోటీన్ అందకపోవడం
శాకాహారం నుంచి తగినన్ని ప్రోటీన్లు లభించవు. ఎముక, కండరాల పెరుగుదల, అభివృద్ధికి ఈ మాంసకృత్తులు ఎంతో అవసరం. శరీర కణాల మరమ్మతులకు కూడా ఇవి అవసరం. శాకాహారంలో ప్రోటీన్ వనరులు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే శాకాహారం ద్వారా అందే ప్రోటీన్లపై సందిగ్ధత నెలకొంది.

3. సప్లిమెంట్లు అవసరం కావచ్చు
శారీరక ఆరోగ్యాన్ని కాపాడటానికి, జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఎన్నో రకాల పోషకాలు క్రమం తప్పకుండా శరీరానికి అందేలా చూసుకోవాలి. శాకాహారం ద్వారా ఇలాంటివి తగినంతగా అందనప్పుడు వాటిని బర్తీ చేయడానికి సప్లిమెంట్లు తీసుకోవాలి. లేదంటే శాకాహారం అనేక పోషక లోపాలకు దారితీయవచ్చు.

* శాకాహారం మన ఆరోగ్యానికి దోహదం చేస్తున్నప్పటికీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తించాలి. వేగన్ డైట్‌ను ఎవరికి వారే సొంతంగా అలవాటు చేసుకోవడం మంచిది కాదు. ఇందుకు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మన జీవనశైలి, శరీర అవసరాలు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగానే డైట్ ప్లాన్ ఉండాలి. అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు ఉండే సమతులాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని గుర్తించాలి.
Published by: Shiva Kumar Addula
First published: October 1, 2020, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading