కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) విధానం కామన్ వర్కింగ్ మోడ్‌గా మారింది. ప్రస్తుతం చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పిస్తున్నాయి. అయితే ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది తమ మంచాలు లేదా బెడ్‌ల మీద కూర్చుని పని చేస్తున్నట్టు సర్వేల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడానికి కుర్చీ, టేబుల్ సెటప్‌ను ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. బెడ్ లేదా మంచాలపై హాయిగా కూర్చుని పని చేయడం మంచి అనుభూతిని కలిగించినప్పటికీ.. దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజంతా మంచం మీద కూర్చుని, పని చేయడం వల్ల భుజం లేదా వెన్నునొప్పి వస్తుంది. ఇది ప్రొడక్టివిటీని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మంచం లేదా బెడ్‌లపై కూర్చుని పని చేయకపోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఒక టేబుల్, కుర్చీని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. టేబుల్ సెటప్‌ను కొనుగోలు చేయడం అదనపు ఖర్చుగా భావిస్తుంటే.. డైనింగ్ టేబుల్స్‌ను డెస్క్‌గా వాడుకోవచ్చు. కుర్చీ, టేబుల్ వినియోగించకుండా బెడ్‌పై కూర్చుని పని చేయడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోండి.
- బెడ్‌పైన కూర్చుని పని చేయడం వల్ల బాడీ పొజిషన్ సక్రమంగా ఉండదు. మంచం మీద కూర్చున్నప్పుడు, ల్యాప్‌టాప్ స్క్రీన్ కళ్ల కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. ఎక్కువ సమయం తల కిందకు వంచి చూడటంతో మెడకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బెడ్ మీద కూర్చుంటే సర్ఫేస్ సమానంగా ఉండదు కాబట్టి.. వెన్నెముక సమస్యలకు దారి తీస్తుంది.
- మంచం మీద కూర్చొని పని చేసినప్పుడు, ప్రొడక్టివిటీ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కుర్చీ, టేబుల్‌ని ఉపయోగించడం ఉత్తమం. అంతేకాకుండా, మంచం మీద కూర్చోవడం నిద్రపోయేలా చేస్తుంది. ఈ ప్రభావం పని మీద కూడా కనిపిస్తుంది. అనవసరమైన పొరపాట్లకు కారణమవుతుంది.
- బెడ్ మీద కూర్చుని పని చేయడం మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. కర్టెన్‌ల కారణంగా బెడ్‌రూమ్‌లలోకి ఎక్కువ వెలుతురు రాదు. కాస్త చీకటిగానే ఉంటాయి. గదిలో తగినంత వెలుతురు లేనప్పుడు, అది మానసిక స్థితిని తేలికపరచకపోవచ్చు. మానసిక స్థితి సక్రమంగా లేకపోతే ప్రొడక్టివిటీ ప్రభావితమవుతుంది.
- బెడ్ మీద ఎక్కువ సేపు కూర్చుంటే ఎనర్జీ లెవల్స్ ప్రభావితం అవుతాయి. మానసిక స్థితి సక్రమంగా లేనప్పుడు.. ఆ ప్రభావం ఎనర్జీ లెవల్స్‌పై కనిపిస్తుంది. తక్కువ ఎనర్జీ లెవల్స్‌తో ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందువల్ల, ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు మంచం మీద కూర్చోకూడదని, కుర్చీని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bed rooms, Health, Work From Home, Work from office