Surrogacy: మనవరాలికి జన్మనిచ్చిన మహిళ.. అమెరికాలో ఆశ్చర్యకర ఘటన

తన కూతురి కోసం ఓ మహిళ లేటు వయసులో సరోగేట్ మదర్‌గా మారింది. 51 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ఆమె, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవించింది. తన సొంత మనవరాలికే జన్మనిచ్చి రికార్డు సృష్టించింది.

news18-telugu
Updated: November 17, 2020, 2:03 PM IST
Surrogacy: మనవరాలికి జన్మనిచ్చిన మహిళ.. అమెరికాలో ఆశ్చర్యకర ఘటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన కూతురి కోసం లేటు వయసులో సరోగేట్ మదర్‌గా మారింది ఒక మహిళ. 51 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ఆమె, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవించింది. తన కూతురు పిల్లల్ని కనలేదని వైద్యులు చెప్పిన తరువాత సరోగేట్ మదర్ గా ఉండేందుకు ఆమె ముందుకు వచ్చింది. ఇలా తన సొంత మనవరాలికి సరొగేట్‌ మదర్‌గా జన్మనిచ్చింది.  చికాగోలోని ఇల్లినాయిస్‌కు చెందిన బ్రెన్నా లాక్‌వుడ్ వయసు 29ఏళ్లు. ఆమె భర్త ఆరోన్‌తో కలిసి IVF పద్ధతి సహా అన్ని ప్రయత్నాలు చేసినా తల్లి కాలేకపోయింది. ఆఖరి ప్రయత్నంగా సరోగసీ పద్ధతిని వారికి వైద్యులు సిఫారసు చేశారు. దీంతో యువతి తల్లి జూలీ లవింగ్ ఆ దంపతుల కలను నిజం చేసేందుకు ముందుకు వచ్చింది.  ఇరవై వరకు మారథాన్‌లలో పాల్గొన్న జూలీ, యాభై ఏళ్లు నిండినా ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది.

దీంతో సరొగేట్ మదర్‌గా ఉండేందుకు వైద్యులు ఆమెకు అనుమతిచ్చారు. ఇలా ఈ నెల మొదటి వారంలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తన కూతురుని తల్లిని చేసింది. బ్రెన్నా ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. తన కుటుంబ సభ్యులు అందించిన సహకారాన్ని ivf.surrogacy.diary ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో ఆ పోస్టు క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆమెకు ఇన్‌స్టాలో 1,50,000 మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

రెండుసార్లు విఫలం
బ్రెన్నా అంతకు ముందు రెండు సార్లు గర్భం దాల్చినా అనారోగ్య కారణాల వల్ల ప్రసవానికి ముందే అబార్షన్ అయింది. ఒకసారి కవలలను ఆమె కోల్పోయింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తల్లి కావడానికి బ్రెన్నా ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నా ఫలితం దక్కలేదు. IVF పద్ధతిలో కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సరోగసీ విధానాన్ని ఎంచుకోవడం మంచిదని డాక్లర్లు వారికి సలహా ఇచ్చారు. దీంతో బ్రెన్నా తల్లి జూలీ సరోగసీ మదర్‌గా ఉండేందుకు ముందుకు వచ్చింది. తన సొంత మనవరాలికి తల్లిగా మారిన జూలీ నవంబర్ 2న ప్రసవించింది. ఆ పాపకు ‘బ్రియర్ జూలియట్ లాక్‌వుడ్‌’ అని పేరు పెట్టారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు..
తన తల్లి సహకారంతో బిడ్డను పొందిన బ్రెన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వివరాలను పంచుకుంది. ‘మా పాప మా అందరి హృదయాలను ఆనందంతో నింపింది. ఈ వయసులో నా తల్లి నా బిడ్డకు జన్మనిచ్చి అసలైన రాక్‌స్టార్‌గా మారింది’ అని ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది. ‘నా మాతృత్వం కోసం మా అమ్మ ఎంతో చేసింది. నా తల్లి నన్ను పెంచి పెద్దచేసినట్లుగానే మా బిడ్డను మేం పెంచుతాం. మా బిడ్డ అవసరాలను ఎలా తీర్చాలనే విషయం మదిలోకి వచ్చినప్పుడు, మా అమ్మ నాకు చేసిన సేవలే గుర్తొస్తున్నాయి. ఆమె ప్రేమించే విధానం, ఆమె చూపించే స్వచ్ఛమైన ప్రేమ వంటి గుణాలు నా కూతురికి కూడా వచ్చేలా పెంచుతాం. ఇప్పుడు మా అమ్మ జూలీ, కూతురు బేబీ బ్రియార్ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’ అని బ్రెన్నా పంచుకున్నారు.

ఆ వయసులోనూ ఆరోగ్యంగా...

జూలీ సరోగేట్ మదర్‌గా మారిన తర్వాత, తల్లీకూతుళ్లిద్దరూ అమెరికాలోని ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. తమ కుటుంబంలోకి రాబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని వారిద్దరూ చెప్పారు. జూలీ కూడా తన కూతురి కోసం మరోసారి తల్లి కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ‘సరోగసీ ద్వారా తల్లి కావాలని బ్రెన్నా దంపతులు నిర్ణయించుకున్న తరువాత, సరోగేట్ మదర్‌గా ఉంటానని నేనే వారితో చెప్పాను. ముందు బ్రెన్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. ఆ తరువాత దీని గురించి తనతో మాట్లాడాను. ఇప్పుడు నా మనవరాలి కోసం మరోసారి తల్లి అయ్యాను’ అని జూలీ వివరించింది. జూలీకి పరుగెత్తడమంటే చాలా ఇష్టం. ఆమె ఇప్పటి వరకు 19 మారథాన్‌లలో పాల్గొంది. ఇదే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెబుతోంది. ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యంగా ఉండటంతో ఈ వయసులో మరోసారి తల్లిగా మారేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా పోయాయి. వైద్యుల జాగ్రత్తలతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తన కూతురుని కూడా తల్లిని చేసింది.
Published by: Nikhil Kumar S
First published: November 17, 2020, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading