కరోనా తరువాత ఇన్సూరెన్స్ ప్రాధాన్యం ప్రజలకు తెలిసివచ్చింది. వైద్య ఖర్చులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆర్థిక భరోసాను అందిస్తాయి. సాధారణంగా ఎవరైనా వృద్ధాప్యంలో ఎక్కువగా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో వైద్య ఖర్చుల కవరేజీకి ప్రత్యేకంగా పాలసీ ఉండటం మంచిది. మీ వృద్ధ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా ప్లాన్ తీసుకోవాలని చూస్తుంటే, ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం.
* సమగ్ర కవరేజీతో ఇన్సూరెన్స్ ప్లాన్..
కొన్ని అనారోగ్యాలు, ప్రమాదాలు లేదా తీవ్రమైన అనారోగ్యాల నుంచి రక్షణను అందించని కవరేజీలను పక్కన పెట్టడమే మంచిది. ఆరోగ్య సమస్యలు అనూహ్యమైనవి. సీనియర్ సిటిజన్లు ఎప్పుడు ఎలాంటి అనారోగ్యాల బారిన పడతారో ఊహించడం కష్టం. అందువల్ల అన్ని అనారోగ్యాలకు చికిత్స అందించే సమగ్ర కవరేజీని ఎంచుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోయినా, OPD ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి ఖర్చులన్నీ పాలసీలో కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Life Insurance: అసలు లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఎన్ని రకాలు.. ఎప్పుడైనా ఆలోచించారా ?
సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అనేక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాన్‌లు తప్పనిసరి కో-పేమెంట్ వంటి కొన్ని పరిమితులతో రావచ్చు. కో-పేమెంట్ నిబంధన ప్రకారం మొత్తం ఆసుపత్రి బిల్లులో కొంత శాతాన్ని పాలసీదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్లాన్‌లలో బీమా మొత్తం పరిమితి రూ. 10-20 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. సాధారణ హెల్త్ ప్లాన్‌లు రూ. 1 కోటి వరకు బీమా మొత్తాన్ని అందిస్తున్నాయి. అందువల్ల మరిన్ని ఫీచర్లు, మంచి ఆప్షన్లను పొందడానికి రెగ్యులర్ హెల్త్ ప్లాన్‌లు తీసుకోవడం మంచిది.
ఒప్పో సంచలనం.. రూ. 60 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంఛ్ ఎప్పుడంటే..
* అధిక బీమా మొత్తం
అవసరమైన సమయంలో ఆసుపత్రి బిల్లులను కవర్ చేయడమే ఆరోగ్య బీమా పాలసీ ప్రథమ లక్ష్యం. బీమా చేసి మొత్తం అనేది పాలసీదారుడికి అన్ని ఖర్చులను తగిన విధంగా కవర్ చేయాలి. సాధారణంగా పెరుగుతున్న వయసుతో పాటు వ్యాధులు సంక్రమించే ప్రమాదం సైతం పెరుగుతుంది. దీనికి తోడు వృద్ధులు వేగంగా కోలుకోలేరు. దీంతో పదేపదే ఆసుపత్రిలో చేరడం కోసం అయ్యే ఖర్చును పాలసీ కవర్ చేయడం ముఖ్యం. మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. అందువల్ల అన్ని అంశాలను విశ్లేషించుకొని అధిక బీమా కవరేజీ అందించే పాలసీలను ఎంచుకోవాలి.
* వెయిటింగ్ పీరియడ్
బీమా తీసుకున్న తరువాత హెల్త్ పాలసీ వర్తించడానికి ముందు ఉండే సమయాన్ని వెయిటింగ్ పీరియడ్ అంటారు. సీనియర్ సిటిజన్లకు ముందుగానే అనారోగ్యాలు, దీర్ఘకాల అనారోగ్యాలు ఉంటే, ఈ వెయిటింగ్ పీరియడ్ 3-4 సంవత్సరాల వరకు పెరగవచ్చు. అందువల్ల ఆసుపత్రి ఖర్చులను తగిన సమయంలో కవర్ చేసే పాలసీని, అందులోనూ తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్ ఉండే పాలసీని ఎంచుకోవాలి. కొన్ని ప్లాన్‌లు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి ఇప్పటికే ఉన్న అనారోగ్యాలను కవర్ చేస్తాయి లేదా 30-40 రోజుల కంటే తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. వీటి గురించి పూర్తిగా ఆరా తీయాలి. వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను అర్థం చేసుకోవడానికి పాలసీ డాక్యుమెంట్‌లను పూర్తిగా చదవాలి.
Financial Planning: Home Loan తీర్చేసిన తరువాత డబ్బు ఏం చేస్తారు ? ఇలా చేయండి
* అదనపు లక్షణాలు
వృద్ధుల కోసం పాలసీని ఎంచుకునేటప్పుడు హాస్పిటల్ చెకప్స్, ఆసుపత్రికి వెళ్లి వచ్చేందుకు అంబులెన్స్ ఛార్జీలు వంటి అనేక ఇతర ఫీచర్ల కోసం చూడండి. కొన్నిసార్లు అనారోగ్యాల సమయంలో పదేపదే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. లేదా ఎక్కువసార్లు కన్సల్టేషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా ఇందుకు అయ్యే అదనపు ఖర్చులు భారంగా మారవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో పాలసీ ఈ అదనపు ఛార్జీలను కూడా కవర్ చేయాలి. ఒకే పాలసీలో ఆయుర్వేదం, యునాని చికిత్స వంటి ప్రత్యామ్నాయ వైద్యం కోసం కవరేజీని అందించే ప్లాన్‌ల కోసం కూడా ఆరా తీయడం మంచిది. పాలసీని ఎంచుకునేటప్పుడు ఈ అదనపు ఫీచర్లతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
* గృహ చికిత్స కవరేజ్ (Domiciliary treatment coverage)
డొమిసిలియరీ ట్రీట్‌మెంట్ ద్వారా.. మెడికల్ ప్రాక్టీషనర్ సూచనలతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా రోగి ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. సాధారణంగా ఆసుపత్రిలో ఖాళీలు లేకపోవడం లేదా రోగి అనారోగ్యం తీవ్రత కారణంగా ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దేశం మొత్తం ఆసుపత్రి గదుల కొరతను ఎదుర్కొన్న సందర్భాలను మనం కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చూశాం. సీనియర్ సిటిజన్ల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉండవచ్చు. వారిని ఆసుపత్రికి తరలించడానికి సాధ్యం కానప్పుడు ఇంటి నుంచే చికిత్స అందించాల్సి ఉంటుంది. కాబట్టి వృద్ధుల కోసం డొమిసిలియరీ ట్రీట్‌మెంట్ ఖర్చులను కూడా కవర్ చేసే పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం.
LIC Policy: రోజూ రూ.200 దాచుకుంటే రూ.28 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
* విడిగా స్పెషల్ హెల్త్ ప్లాన్
వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులను రెగ్యులర్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో భాగం చేయడం మంచిది కాదు. వారి కోసం విడిగా, ప్రత్యేకంగా ఒక ప్లాన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. వైద్య అత్యవసర పరిస్థితుల సమయంలో ఇలాంటి స్పెషల్ ప్లాన్లు ఎక్కువ కవరేజీని అందిస్తాయి. దీంతోపాటు బీమా పథకం ద్వారా సీనియర్ సిటిజన్‌లు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను సైతం పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance, Life Style, Lifestyle