హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Covid Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక జ్వరం వస్తుందా.. దానికి కారణం ఇదే.. తెలుసుకోండి..

Covid Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక జ్వరం వస్తుందా.. దానికి కారణం ఇదే.. తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక కొంత మందికి జ్వరం వస్తుంటే.. మరికొంత మందికి ఒళ్ల నొప్పులు.. లేదా ఆయాసం.. లేదా తీవ్రమైన తలనొప్పి వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించడానికి గల కారణాలను నిపుణులు ఈ విధంగా తెలిపారు. వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

కరోనా టీకా తీసుకున్న తర్వాత కొందరిలో జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, అలసట, ఆయాసం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా వస్తుందేమోనన్న అపోహ చాలా మందిని కలవరపెడుతోంది. అయితే, టీకా తర్వాత అలాంటి లక్షణాలు చాలా సాధారణమని, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పునరుత్తేజమవుతుందని చెప్పడానికి అవే సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. మరికొంత మందిలో ఇవేవీ కనిపించలేదని చెబుతుంటారు. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏదైనా అనారోగ్యం వస్తే లేదా ఏమీ రాకుండా సాధారణంగా ఉండిపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భౌగోళికంగా ఆయా ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ శరీరంలో ఎలా పనిచేస్తున్నదో తెలుసుకుంటున్నారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ కంటే ముందే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినా.. చాలా తక్కువ సంఖ్యలోనే జరిగాయి. తాజాగా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోట్లకు చేరుకున్న నేపధ్యంలో వైద్య నిపుణులు కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆయా దేశాల్లో పరిస్థితుల ఆధారంగా శరీరంలోవ్యాక్సిన్ తెచ్చే మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు.

కరోనా వ్యాక్సన్ వేసుకున్నాక మనిషి శరీరంలో దాని ప్రభావం ఎంత మేరకు ఉందనేది తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థలో రెండు ప్రధాన భాగాలుంటాయి. ఒకటి.. సహజ వ్యవస్థ. రెండోది.. సముపార్జిత వ్యవస్థ. మన ఒంట్లోకి ఏదైనా ప్రవేశించిందని శరీరం గుర్తించిన వెంటనే ఈ సహజ వ్యవస్థ స్పందించి ప్రతి చర్య మొదలుపెడుతుంది. అలా మనం కరోనా టీకా వేసుకోగానే.. తెల్ల రక్తకణాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని వల్లే టీకా వేసుకున్న భాగంలో తిమ్మిర్లు, నొప్పిగా అనిపించడం, అలసటగా ఉండటం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. మన రోగ నిరోధక వ్యవస్థలోని ఈ రాపిడ్‌ రెస్పాన్స్‌ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువతలో ఈ ప్రతిస్పందన ఎక్కువగా ఉంటే.. వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది.

అందుకే వృద్ధుల కంటే యువతలోనే టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాలు కన్పిస్తాయి. అయితే టీకా రెండు డోసులు తీసుకున్నా కొందరిలో జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఉండకపోవచ్చు. అంతమాత్రనా వ్యాక్సిన్‌ పనిచేయట్లేదని కాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే.. టీకాలు మన రోగ నిరోధక వ్యవస్థలోని రెండో భాగమైన సముపార్జిత వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయి. టి, బి కణాలు, యాంటీబాడీలు ఇందులోని భాగమే. అసలైన ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది. ఈ వ్యవస్థ పునరుత్తేజమై శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవే వైరస్‌ నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. మహిళలు వ్యాక్సిన్ వేసుకున్నాక గడ్డలు కట్టిందని చెబుతుంటారు. అవి క్యాన్సర్ గడ్డలేమోనని అనుమానిస్తుంటారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకూడదంటే మహిలలు రొమ్ము క్యాన్సర్ నిర్దారణకు మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

టీకా వల్ల ఎలాంటి లక్షణాలు కల్పించినా అవి గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. కానీ ఎక్కువ కాలం లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అపోహలకు దూరంగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ స్థాయి తెలిసిపోతుందని.. తక్కువగా ఉంటే వెంటనే పెంచుకోవాల్సిన అవసరం సూచిస్తుందని చెబుతున్నారు.

First published:

Tags: Corona cases, Corona Vaccine, Corona vaccine first dose, Covaxin, Covishield, Fever, Health benefits, Health Tips, Sanjeevani

ఉత్తమ కథలు