సైలెంట్ హార్ట్ ఎటాక్ అనేది ఒకటి ఉంటుందని చాలామంది ప్రజలకు తెలియదు. వారాలు లేదా నెలల తర్వాత గుండె దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించే వరకు దీని బారిన పడినట్లు బాధితులకు తెలియదు. గుండెపోటుతో సంబంధం లేని లక్షణాలు కనిపించడం, కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం వల్ల సైలెంట్ హార్ట్ ఎటాక్‌ను గుర్తించడం కష్టతరం అవుతుంది. కానీ ఇది సాధారణ గుండెపోటు మాదిరిగానే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.
సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి?
ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా తేలికపాటి లక్షణాలతో లేదా గుండెపోటుతో సంబంధం లేని లక్షణాలతో హార్ట్ ఎటాక్ రావడాన్ని సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ అనేది గుండెకు ఆక్సిజన్ అందనప్పుడు గుండె కండరాలు గాయపడటం వల్ల వస్తుంది. కొరోనరీ ధమనులలో ఒకదాని ద్వారా రక్తం గుండెకు ప్రవహించకుండా ఆగిపోవడం, నాళాల్లో రక్తం గడ్డకట్టడం గుండెపోటుకు కారణమవుతుంది.
ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు లేదా మేల్కొని ఉన్నప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. సాధారణంగా శారీరకంగా లేదా మానసికంగా ఒత్తిడికి (Emotional stress) గురవ్వడం, మితిమీరిన శారీరక శ్రమ కారణంగా అప్పటికే ఉన్న సమస్య ఒక్కసారిగా బయట పడవచ్చు. సైలెంట్ హార్ట్ ఎటాక్స్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అన్ని రకాల గుండెపోటులలో దాదాపు 50% నుంచి 80% వరకు ఇలా సైలెంట్ వర్గానికి చెందినవని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.
సైలెంట్ హార్ట్ ఎటాక్ వ్యక్తుల శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
గుండెలోని కొన్ని భాగాలకు ఆక్సిజన్ ఉండే రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్ కూడా గుండెను ఇలాగే గాయపరుస్తుంది. కానీ లక్షణాలు కనిపించకపోవడం వల్ల నష్టాన్ని పరిమితం చేయడానికి అవసరమైన వైద్య సహాయం సకాలంలో అందకపోవచ్చు. సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయి?
సైలెంట్ హార్ట్ ఎటాక్ ఉన్న వ్యక్తుల్లో సాధారణంగా గుండెపోటుతో సంబంధం లేని లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు తేలికపాటి లక్షణాలు ఉంటాయి లేదా ఎటువంటి లక్షణాలు బయటపడవు. దీంతో తమకు గుండెపోటు వచ్చిందని బాధితులు గుర్తించకపోవచ్చు.
సైలెంట్ హార్ట్ ఎటాక్ ప్రధాన లక్షణాలు
ఛాతీలో నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం
కొన్నిసార్లు గుండెపోటు సమయంలో వచ్చే నొప్పి ఆకస్మికంగా, తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే, వీలైనంత త్వరగా బాధితులకు వైద్య సహాయం అందించవచ్చు. సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తే, లక్షణాలు పెద్దగా కనిపించవు. కానీ అన్ని రకాల గుండెపోటులు బాధితుల ఛాతీ మధ్యలో తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి, కండరాలు పిండేసినట్లు అనిపించడం, ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు నెమ్మదిగా ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు పూర్తిగా తగ్గిపోయి తిరిగి రావచ్చు. సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు ఉంటే, ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ తీవ్రతతో బయటపడవచ్చు. ఈ లక్షణాలు గుండెల్లో మంట, అజీర్తి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలుగానే ఉండవచ్చు. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి టెస్టులు చేయించుకొని, ట్రీట్‌మెంట్ తీసుకోవడం మంచిది.
శరీర భాగాల్లో అసౌకర్యం
గుండెపోటు అనేది కేవలం బాధితుల గుండెను మాత్రమే ప్రభావితం చేయదు. శరీరం అంతటా దాని ప్రభావాలు కనిపించవచ్చు. చేతులు, వెన్ను, మెడ నొప్పి, దవడ, పొట్ట భాగంలో సమస్యలు ఉంటే అప్రమత్తం కావాలి. ఈ లక్షణాలు వ్యక్తులను బట్టి మారవచ్చు. ఎలాంటి కారణం లేకుండా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. సైలెంట్ హార్ట్ ఎటాక్ ప్రమాదమేమోనని అనుమానించాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం
చిన్న పనులు చేసినప్పుడు కూడా తీవ్రంగా అలసిపోయినట్లు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడం, మైకం రావడం వంటివి కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు కావచ్చు. సాధారణంగా గుండె శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయలేకపోయిన సందర్భంలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తూ, ఛాతీలో నొప్పి ఉంటే మాత్రం అది కచ్చితంగా గుండెపోటు లక్షణమేనని భావించాలి.
తీవ్రమైన ఫ్లూ లక్షణాలు
చల్లని చెమట పట్టడం, వికారంగా అనిపించడం, వాంతులు వంటి ఫ్లూ లక్షణాలు కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు సంకేతాలు కావచ్చు. ఇవి సాధారణ ఫ్లూ లక్షణాల కంటే తీవ్రంగా ఉంటే అప్రమత్తం కావాలి.
తలతిరగడం
తలతిరగడం కూడా గుండెపోటుతో పాటు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు ముందస్తు హెచ్చరికగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. చలి వేస్తూ చెమటలు పట్టడం, ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవటం వంటి లక్షణాలతో పాటు తల తిరిగినట్లు అనిపిస్తే, గుండెపోటుగా అనుమానించాలి. కొందరు వ్యక్తులు మూర్ఛపోవచ్చు లేదా స్పృహ కోల్పోవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే వైద్య సహాయం అందించాలి.
గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు
కడుపు నొప్పి, అజీర్ణం, గుండెల్లో మంట, వికారం వంటి జీర్ణ సంబంధ సమస్యలు గుండెపోటు ప్రారంభ లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో పొత్తి కడుపు పైభాగం మధ్యలో కత్తిపోటు కంటే భారీగా నొప్పిగా అనిపిస్తుంది. కొన్ని నిమిషాల పాటు ఇలా తీవ్రమైన నొప్పి ఉంటే, అది సైలెంట్ హార్ట్ ఎటాక్‌గా అనుమానించాలి. దీంతోపాటు శ్వాస సమస్యలు, గుండె కొట్టుకునే వేగం మారడం వంటివి కూడా ఉంటే, అది గుండెపోటును సూచిస్తుంది.
సాదారణ గుండెపోటు లక్షణాలకు, సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలకు తేడా ఏంటి?
సాంప్రదాయ గుండెపోటు లక్షణాలు సైలెంట్ హార్ట్ ఎటాక్ కంటే భిన్నంగా, తీవ్రంగా ఉంటాయి. ఛాతీ నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండటం, శ్వాస ఆడకపోవడం, శరీరంలోని పై భాగాలు లేదా అవయవాల్లో నొప్పి, అసౌకర్యం, తల తిరగడం, చల్లని చెమటలు, వికారం, వాంతులు, కొన్ని రోజుల పాటు అలసటగా ఉండటం.. ఇవన్నీ సాధారణ గుండెపోటు లక్షణాలు. వ్యక్తులను బట్టి కొందరిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Heart Attack