కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని అన్ని కణాలలో కనిపించే కొవ్వు లాంటి పదార్ధం. మన శరీరం హార్మోన్లు, విటమిన్ D, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే పదార్థాలను తయారు చేయడానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. మన శరీరంలోని కాలేయమే ఇందుకు అవసరమైన కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది. గుడ్డు సొన, మాంసం, జున్ను వంటి వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి కూడా శరీరానికి కొలెస్ట్రాల్ అందుతుంది. అయితే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అది రక్తంలోని ఇతర పదార్థాలతో కలిసి ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకం ధమనుల గోడలకు అంటుకుంటుంది. ఇలా ఫలకం ఏర్పడటాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ సందర్భంలో కరోనరీ ధమనులు ఇరుకుగా మారి, పూడుకుపోయి కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె వ్యాధులకు దారి తీస్తాయి.
కొలెస్ట్రాల్ ఎన్ని రకాలు?
కొలెస్ట్రాల్‌లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి హై- డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL), మరొకటి లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL). లిపోప్రొటీన్లు కొవ్వు, ప్రోటీన్ల కలయికతో ఏర్పడతాయి. లిపిడ్లు ప్రోటీన్లకు జతకలిసి రక్తం ద్వారా కదులుతాయి. ఇలా కొలెస్ట్రాల్ శరీర భాగాలకు వెళ్తుంది. HDLను "మంచి కొలెస్ట్రాల్" అని పిలుస్తారు. ఎందుకంటే ఇది కాలేయానికి కొలెస్ట్రాల్‌ను రవాణా చేస్తుంది. కాలేయంలో తయారైన కొలెస్ట్రాల్ శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది. HDL మీ శరీరంలోని ఇతర భాగాల నుంచి కాలేయానికి తిరిగి కొలెస్ట్రాల్‌ను తీసుకువెళుతుంది. తర్వాత కాలేయం శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఇలా HDL శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది ధమనులలో చేరే అవకాశం తక్కువ.
LDLని "చెడు కొలెస్ట్రాల్" అని పిలుస్తారు, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్‌ను ధమనులకు తీసుకువెళుతుంది. అక్కడ అది ధమని గోడలకు అతుక్కుపోతుంది. ధమనులలో చాలా ఎక్కువ మొత్తంలో ఏర్పడే కొలెస్ట్రాల్.. అథెరోస్క్లెరోసిస్ అనే ఫలకం ఏర్పడటానికి దారితీయవచ్చు. ఇది మీ ధమనులలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలా గడ్డకట్టిన రక్తం విచ్ఛిన్నమై, గుండె లేదా మెదడులోని ధమనికి అడ్డుకుంటే.. స్ట్రోక్ లేదా గుండెపోటు రావచ్చు. ఫలకం ఏర్పడటం వల్ల ప్రధాన అవయవాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ తగ్గుతుంది. ఇది ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
వైద్య పరంగా VLDL అనే వెరీ లో-డెన్సిటీ లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఇది చాలా తక్కువ సాంద్రత ఉండే లిపోప్రొటీన్. VLDLను కూడా చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది మీ ధమనులలో ఫలకం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. కానీ VLDL, LDL రెండూ భిన్నంగా ఉంటాయి. VLDL ప్రధానంగా ట్రైగ్లిజరైడ్లను కలిగి ఉంటుంది, LDL ప్రధానంగా కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్‌కు (High cholesterol) కారణం ఏంటి?
అధిక కొలెస్ట్రాల్‌కు అత్యంత సాధారణ కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. చెడు కొవ్వులు (Bad fats) ఉండే పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. చెడు కొవ్వుల్లో సంతృప్త కొవ్వులు (Saturated fat) ఒక రకం. మాంసం, పాల ఉత్పత్తులు, చాక్లెట్, కాల్చిన, డీప్ ఫ్రైడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఇది ఉంటుంది. చెడు కొవ్వుల్లో ట్రాన్స్ ఫ్యాట్ (Trans fat) అనేది మరో రకం. కొన్ని వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఇది ఉంటుంది. ఈ పదార్థాలు తినడం వల్ల శరీరంలో LDL (చెడు) కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో HDL (మంచి) కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
పొగ తాగే అలవాటుతో శరీరంలో HDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఇలా జరుగుతుంది. దీంతోపాటు ఇది LDL కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతుంది. జన్యువుల కారణంగా కూడా కొంతమంది హై కొలెస్ట్రాల్ బారిన పడవచ్చు. ఉదాహరణకు, ఫ్యామిలీ హైపర్ కొలెస్టెరోలేమియా (FH) అనేది అధిక కొలెస్ట్రాల్ వారసత్వంగా వచ్చే కండీషన్. ఇతర వైద్య పరిస్థితులు, కొన్ని మందులు కూడా అధిక కొలెస్ట్రాల్‌కు కారణం కావచ్చు.
అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచే పరిస్థితులు ఏవి?
కొన్ని ప్రత్యేక పరిస్థితులు శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కారణమవుతాయి. అవేంటంటే..
వయసు
ఒక వ్యక్తి పెరిగి పెద్దయ్యాక వారి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అయితే కొంతమంది పిల్లలు, యుక్తవయస్కులతో సహా యువకుల్లో కూడా అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది.
వారసత్వం
కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అధిక రక్త కొలెస్ట్రాల్ ఉంటే, వారసత్వంగా కూడా ఈ సమస్య రావచ్చు.
బరువు
అధిక బరువు లేదా ఊబకాయం కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
హై కొలెస్ట్రాల్‌ను ఎలా నిర్ధారిస్తారు?
ఒక వ్యక్తి శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవడానికి ఎలాంటి లక్షణాలు ఉండవు. కొలెస్ట్రాల్ స్థాయిని కొలవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిని గుర్తించేందుకు ఇది ఒక్కటే మార్గం. వయసు, ప్రమాద కారకాలు, కుటుంబ చరిత్ర ఆధారంగా మీరు ఎంత తరచుగా ఈ టెస్టు చేయించుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా 19 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి.. 9 నుంచి 11 సంవత్సరాల మధ్య మొదటిసారి టెస్ట్ చేయించాలి. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించాలి. అధిక బ్లడ్ కొలెస్ట్రాల్, గుండెపోటు లేదా స్ట్రోక్ వంటివి కుటుంబంలో ఎవరికైనా వస్తే.. 2 సంవత్సరాల వయసు నుంచే పిల్లలకు ఈ టెస్ట్ చేయించాలి. యువకులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. 45- 65 సంవత్సరాల వయసు ఉండే పురుషులు.. 55- 65 సంవత్సరాల వయసు ఉండే స్త్రీలు ప్రతి 1 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి.
కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవచ్చు?
గుండె ఆరోగ్యాన్ని కాపాడే మంచి జీవనశైలి మార్పులను అలవాటు చేసుకొని కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. ఆహారంలో మార్పులు, వెయిట్ మేనేజ్మెంట్, శారీరక శ్రమ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. కేవలం జీవనశైలి మార్పులు మాత్రమే మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగినంతగా తగ్గించకపోతే, వైద్యులు కొన్ని రకాల మందులను సూచిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips