హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

What is Blood Pressure: అందరూ బీపీ, బీపీ అంటారు.. అసలు బ్లడ్ ప్రెజర్ అంటే ఏంటి? ఎలా కొలుస్తారు?

What is Blood Pressure: అందరూ బీపీ, బీపీ అంటారు.. అసలు బ్లడ్ ప్రెజర్ అంటే ఏంటి? ఎలా కొలుస్తారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రక్తపోటు అనేది మీ శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేయడానికి మీ గుండె ఉపయోగించే శక్తి కొలత. బీపీని స్పిగ్మోమానోమీటర్ (Sphygmomanometer) అనే పరికరంతో, మెర్క్యురీ మిల్లీమీటర్లలో (mmHg) కొలుస్తారు. దీన్ని కొలవటానికి రెండు సంఖ్యలను ప్రామాణిక నిష్పత్తిగా తీసుకుంటారు.

ఇంకా చదవండి ...

ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని వైద్యులు నాలుగు లక్షణాల ఆధారంగా నిర్దేశిస్తారు. ఏ వ్యక్తికైనా శరీర ఉష్ణోగ్రత, నాడి లేదా హృదయ స్పందన రేటు, రెస్పిరేషన్ లేదా శ్వాస రేటు, రక్తపోటు సరిగా ఉంటే.. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఈ నాలుగు లక్షణాలకు నిర్ణీత పరిమితిని వైద్యులు గుర్తించారు. ఈ నాలుగు రేట్లు పరిమితిని మించి పెరిగినా, లేదా తగ్గినా.. అది అనారోగ్యానికి సంకేతంగా భావించాలి. రక్తపోటు (Blood Pressure- BP) ఒక పరిమితిని మించి పెరిగితే, దాన్ని అధిక రక్తపోటు (High BP or Hypertension) అంటారు. ఇలా రక్తపోటు మితి మీరితేనే దాన్ని వ్యాధి లక్షణంగా భావించాలి. అంతేకానీ మామూలు సందర్భాల్లో రక్తపోటు అనేది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం కూడా కాదు. 

రక్తపోటు అంటే ఏంటి?

మన శరీర అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె ఆరోగ్యం బాగుంటేనే.. మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అంటే గుండె పనితీరుపై ఎలాంటి ఒత్తిడి పడకూడదు. అయితే కొన్ని కారణాలతో గుండెపై ఒత్తిడి పడుతుంది. దీన్ని బ్లడ్ ప్రెజర్‌ లేదా బీపీ అంటారు. బీపీని కొన్ని రకాల పరికరాల సాయంతో కొలుస్తారు. మన రక్తనాళాల్లో రక్తం అలల మాదిరిగా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహిస్తున్న రక్తం.. నాళాల గోడల మీద ఒత్తిడిని (Pressure) కలగజేస్తుంది. ఈ ఒత్తిడి గుండెకు దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళ్తున్నా కొద్దీ తగ్గుతుంది. 

అంటే రక్తం కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి, చివరికి సిరలలో ప్రవేశిస్తుంది. అనంతరం నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్లీ గుండెకు చేరుకుంటుంది. అందువల్ల శరీరం అంతటా ఈ రక్తపోటు ఒకేలా ఉండదు. వైద్యులు రక్తపోటును లెక్కించడానికి ధమనులలో ఉన్న పీడనాన్ని (Pressure) పరిగణనలోకి తీసుకుంటారు. శరీరం అంతా ఈ పీడనం ఒకేలా ఉండదు. సాధారణంగా మన భుజం నుంచి మోచేతి మధ్య ఉండే జబ్బ మీద పరికరాన్ని పెట్టి బీపీని కొలుస్తారు. 

రక్తపోటును ఎలా కొలుస్తారు?

రక్తపోటు అనేది మీ శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేయడానికి మీ గుండె ఉపయోగించే శక్తి కొలత. బీపీని స్పిగ్మోమానోమీటర్ (Sphygmomanometer) అనే పరికరంతో, మెర్క్యురీ మిల్లీమీటర్లలో (mmHg) కొలుస్తారు. దీన్ని కొలవటానికి రెండు సంఖ్యలను ప్రామాణిక నిష్పత్తిగా తీసుకుంటారు. భిన్నంలో పై సంఖ్య సిస్టోలిక్‌ ప్రెజర్‌ను (Systolic Pressure) సూచిస్తుంది. రెండో సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య) డయాస్టోలిక్‌ ప్రెజర్‌ను (Diastolic Pressure) సూచిస్తుంది. సిస్టోలిక్ ప్రెజర్ అంటే.. మీ గుండె రక్తాన్ని బయటకు నెట్టివేసినప్పుడు నమోదయ్యే ఒత్తిడి. అంటే గుండె నుంచి శరీరానికి రక్తం ప్రసరించేటప్పుడు ఉత్పత్తి అయ్యే ప్రెజర్. డయాస్టోలిక్ ప్రెజర్ అంటే.. హార్ట్ బీట్స్ మధ్యలో రక్త నాళాలపై పడే ఒత్తిడి. ఉదాహరణకు మీ రక్తపోటు "140 ఓవర్ 90" లేదా 140/90mmHg ఉంటే.. మీ సిస్టోలిక్ ప్రెజర్ 140mmHg, డయాస్టొలిక్ ప్రెజర్ 90mmHg ఉందని అర్థం.

రక్తపోటు అనేక ఫ్యాక్టర్స్‌ ఆధారంగా మారుతుంది. మెడిసిన్, సమయం, పని ఒత్తిడి, ఆందోళన కారణంగా బీపీ రేటు మారవచ్చు. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపోటు 120/80 ఉంటుందని వైద్య నిపుణులు నిర్ణయించారు. ఈ విలువ 135/85 దాటితే.. ఆ వ్యక్తి అధిక రక్తపోటు లేదా హై బీపీతో బాధ పడుతున్నట్లు లెక్క. సాధారణంగా ఈ కొలతలు రెండు మూడు సార్లు తీసి, ఈ రేటు ఎక్కువగా ఉంటేనే రక్తపోటు ఎక్కువయిందని నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రక్తపోటు సిస్టోలిక్ రక్తపోటు ≥140 mmHg, డయాస్టోలిక్ రక్తపోటు ≥90 mmHg కంటే అధికంగా ఉన్నప్పుడు (140/90) మాత్రమే, హై బీపీగా పరిగణించాలి. దీనికి ఫార్మకోలాజికల్ యాంటీ హైపెర్టెన్సివ్ చికిత్సను ప్రారంభించాలని 2021 ఆగస్టు 25న డబ్లూహెచ్‌ఓ సిఫార్సు చేసింది. 

 బీపీకి సంబంధించిన ప్రమాణిక విషయాలు..

సాధారణంగా ఒక వ్యక్తి రక్తపోటు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఇది తరచుగా మారుతూ ఉంటుంది. సాధారణ రక్తపోటు (Ideal BP) అంటే.. బీపీ 90/60 mmHg నుంచి 120/80 mmHg మధ్యలో ఉండాలి. అధిక రక్తపోటు (High BP) అంటే.. బీపీ 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. అల్ప రక్తపోటు (Low BP) అంటే.. బీపీ 90/60 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు. ఒకవేళ మీ బీపీ రీడింగ్ 120/80 mmHg నుంచి 140/90 mmHg మధ్య ఉంటే.. మీకు హైబీపీ వచ్చే ప్రమాదం ఉంది.  

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు అనేది అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లకు సంబంధించినది. పొగ తాగడం, అతిగా మద్యం సేవించడం, అధిక బరువు, వ్యాయామం చేయకపోవడం.. వంటివి ఇందుకు దారితీయవచ్చు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, అధిక రక్తపోటు కరోనరీ హార్ట్ డిసీజ్, కిడ్నీ వ్యాధులు వంటి అనేక తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది.

లో-బీపీ 

తక్కువ రక్తపోటు అంటే.. బీపీ తక్కువగా ఉండటం. కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్‌గా లో-బీపీకి కారణం కావచ్చు. ఇది గుండె వైఫల్యం, డీ-హైడ్రేషన్ సహా అనేక ఇతర పరిస్థితుల వల్ల కూడా ఎదురుకావచ్చు.

బీపీ టెస్ట్

మీ రక్తపోటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉందా లేదా అనేది బీపీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా లో- బీపీ (హైపోటెన్షన్- Hypotension) అనేది ఒక సమస్య కాదు. అయితే ఇది కొంతమందిలో తలతిరగడం, స్పృహ కోల్పోవడం వంటి అనారోగ్యాలను కలిగిస్తుంది. అధిక రక్తపోటుకు (హైపర్ టెన్షన్- Hypertension) చికిత్స చేయకపోతే.. ఇది గుండెపోటు (హార్ట్ ఎటాక్), స్ట్రోక్స్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాలను పెంచుతుంది. 

మీ రక్తపోటు ఎంత ఉందో తెలుసుకోవడానికి టెస్ట్ చేయడం మాత్రమే మార్గం. ఏదైనా అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ముందు బీపీ చెక్ చేస్తారు. ఒకవేళ అనారోగ్యానికి బీపీ హెచ్చుతగ్గులే కారణమని గుర్తిస్తే.. ఇందుకు తగిన చికిత్స అందిస్తారు. ఒకవేళ మీకు అధిక లేదా తక్కువ రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయినా లేదా త్వరలో ఇవి వచ్చే సూచనలు ఉన్నా.. తరచుగా బీపీ టెస్ట్ చేయించుకోవాలి. వైద్యుల సలహాతో బీపిని సాధారణ స్థాయికి తీసుకువచ్చే మందులు వాడాలి.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Blood pressure, Health tip

ఉత్తమ కథలు