బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది మైనం, కొవ్వు లాంటి పదార్ధం. మానవ శరీరంలోని కాలేయం దీన్ని తయారు చేస్తుంది. శరీర ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ అవసరం. హార్మోన్ల తయారీ, కొవ్వు పదార్ధాలను జీర్ణం చేసే ప్రక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మనకు అవసరమైన కొలెస్ట్రాల్‌ను శరీరమే తయారు చేస్తుంది. అయితే డైటరీ కొలెస్ట్రాల్ మాంసం, పౌల్ట్రీ ప్రొడక్ట్స్, గుడ్లు, సీఫుడ్, పాల ఉత్పత్తులు వంటి యానిమల్ ఫుడ్స్ నుంచి శరీరానికి అందుతుంది.
LDL కొలెస్ట్రాల్ అంటే ఏంటి?
కొలెస్ట్రాల్‌ను రెండు రకాల ప్రోటీన్లు రక్తం ద్వారా రవాణా చేస్తాయి. వీటిని లిపో ప్రోటీన్లు అంటారు. కొవ్వు, ప్రోటీన్ల కలయికతో ఏర్పడే ఈ సమ్మేళనాలను హై- డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL), లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) వంటి రెండు రకాలుగా విభజించవచ్చు. HDLను మంచి కొలెస్ట్రాల్‌గా (Good cholesterol) సూచిస్తారు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. LDLను చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) అంటారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
LDL కొలెస్ట్రాల్ వర్సెస్ HDL కొలెస్ట్రాల్
మన ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే LDL కొలెస్ట్రాల్ మాత్రం శరీరానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాల ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో LDL కొలెస్ట్రాల్ సరఫరా అవుతుంటే, అది కాలక్రమేణా రక్తనాళాల లోపలి గోడలకు అతుక్కుపోతుంది. ఇతర పదార్థాలతో కలిసి ఇలా గట్టిపడే సమ్మేళనాన్ని "ప్లాక్" లేదా ఫలకం అంటారు. రక్త నాళాల్లో ఫలకం ఏర్పడటం వల్ల ఆ నాళాలు పూడుకుపోతాయి. రక్తనాళాలు ఎంత ఇరుకుగా ఉంటే.. రక్తం గుండె, ఇతర అవయవాలకు చేరుకోవడం అంత కష్టంగా మారుతుంది. రక్త ప్రసరణకు ఇలా ఆటంకాలు ఏర్పడినప్పుడు, అది ఛాతీ నొప్పి (ఆంజినా), గుండెపోటుకు కారణమవుతుంది. మరోవైపు, HDL కొలెస్ట్రాల్ మాత్రం శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కాలేయానికి తిరిగి పంపుతుంది. దీంతో అది శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమైన వ్యక్తిలో LDL కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉండాలి?
గుండె వ్యాధులకు కారణమయ్యే LDL కొలెస్ట్రాల్ కొంత స్థాయిని మించితే ప్రమాదకరంగా మారుతుంది. వైద్య పరిశోధనల ప్రకారం, ఒక వ్యక్తి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎంత దాటితే ప్రమాదకరం అనేది తెలుసుకుందాం.
LDL కొలెస్ట్రాల్ స్థాయి | కేటగిరీ |
100mg/dL కంటే తక్కువ | సిఫార్సు చేసిన స్థాయి |
100-129mg/dL | సిఫార్సు చేసిన దాని కంటే కాస్త ఎక్కువ |
130-159 mg/dL | బోర్డర్‌లైన్ కంటే ఎక్కువ |
160-189 mg/dL | ఎక్కువ |
190 mg/dL, అంతకు మించి | చాలా ఎక్కువ |
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు, ప్రమాదాలు
ఒక వ్యక్తి శరీరంలో LDL (చెడు) కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, దాన్ని గుర్తించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ సమస్యతో సంబంధం ఉన్న లక్షణాలు ఏవీ బయటపడవు. అందుకే తరచుగా రక్త పరీక్ష చేయించుకోవాలి. LDL స్థాయి చాలా ఎక్కువగా ఉంటే, చర్మంపై చిన్న గడ్డలు (xanthomas), కంటి కార్నియా చుట్టూ బూడిద-తెలుపు రంగు వలయాలు (కార్నియల్ ఆర్కస్) కనిపించవచ్చు.
చెడు కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయకపోతే గుండెపోటుతో పాటు ఇతర తీవ్రమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. అవేంటంటే..
శరీరం అంతటా ఫలకాలు ఏర్పడే అథెరోస్క్లెరోసిస్ (Atherosclerosis)
LDL కొలెస్ట్రాల్‌ను ఎలా నిర్ధారించాలి?
చెడు కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్ష ఒక్కటే మార్గం. కొన్నిసార్లు అధిక కొలెస్ట్రాల్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే డాక్టర్లు బాధితుల ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు ఏవైనా ఇతర లక్షణాలు, అసౌకర్యాలు ఉండే లిపిడ్ ప్యానెల్ టెస్ట్ చేయిస్తారు. ఇందులో LDL, HDL, సమస్యల ప్రమాదాన్ని పెంచే ఇతర రకాల నాన్-HDL కొలెస్ట్రాల్ లెవల్‌ను గుర్తించవచ్చు. నాన్-హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ నిర్ణీత స్థాయిని మించితే, బాధితులకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు నిర్ధారిస్తారు. HDL కొలెస్ట్రాల్ తక్కువగా ఉందో లేదో తెలుసుకోవడానికి ల్యాబ్ టెస్ట్‌లు కూడా చేస్తారు. ఈ టెస్టులు, బాధితుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు సూచిస్తారు.
ఈ టెస్టులను ఎవరు చేయించుకోవాలి?
ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ లెవల్‌ను 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ప్రమాదం తక్కువగా ఉంటే, ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకు పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్ల తర్వాత మరింత తరచుగా టెస్టులు అవసరం అవుతాయి.
LDL కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?
మీకు అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, దాన్ని తగ్గించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. LDL స్థాయిని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.
స్టాటిన్స్ (Statins)
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి సూచించే సాధారణ మందులు స్టాటిన్స్. ఇవి అధిక LDL ఉన్న వ్యక్తులలో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
ఎజెటిమైబ్ (Ezetimibe)
స్టాటిన్స్ ప్రభావవంతంగా పని చేయనప్పుడు ఈ మందులను సూచిస్తారు.
బైల్ యాసిడ్ సీక్వెస్ట్రెంట్స్ (Bile acid sequestrants)
ఒక వ్యక్తి స్టాటిన్స్ తీసుకోలేకపోతే లేదా వారి కొలెస్ట్రాల్ స్థాయిలను స్టాటిన్స్, ఇతర మందులు తగ్గించలేనప్పుడు వీటిని సూచిస్తారు.
PCSK9 నిరోధకాలు( PCSK9 inhibitors)
PCSK9 ఇన్హిబిటర్లను ప్రతి రెండు వారాలకు చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తారు. కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రమాదకరంగా మారినప్పుడు ఈ మెడిసిన్ సిఫార్సు చేస్తారు.
లోమిటాపిడ్, మిపోమెర్సెన్ (Lomitapide and Mipomersen)
కుటుంబ సభ్యులకు వంశపారం పర్యంగా అధిక కొలెస్ట్రాల్ వచ్చే సమస్య ఉంటే, ఈ మందులను సూచిస్తారు.
అయితే ప్రతి మెడిసిన్‌తో దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి నిర్దిష్ట మందులను ఎందుకు సూచిస్తున్నారు, వాటి దుష్ప్రభావాలు ఏవి అనే దాని గురించి వైద్యునితో మాట్లాడటం మంచిది.
ఈ మందులతో సంబంధం లేకుండా జీవనశైలి మార్పులను కూడా వైద్యులు సిఫారసు చేయవచ్చు. శారీరక శ్రమ, గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్ వినియోగం తగ్గించడం, పొగ తాగడం మానేయడం వంటి జీవన శైలి మార్పులతో మంచి ఫలితం కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cholesterol, Health Tips