మనం ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్‌కు వెళ్లగానే, డాక్టర్లు కొన్ని ముఖ్యమైన టెస్ట్‌లు చేస్తారు. వీటిలో రక్తపోటు లేదా బీపీ చెక్ చేయడం ఒకటి. మన శరీర అవయవాలకు గుండె ధమనుల ద్వారా రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఈ రక్త ప్రవాహం ధమనులపై ఏర్పరిచే ప్రెజర్‌ను రక్తపోటు అంటారు. ధమనులు ఆరోగ్యంగా ఉంటే, వాటి ద్వారా రక్తం సులభంగా ప్రవహిస్తుంది. ఇందుకు గుండె ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ ధమనులు చాలా ఇరుకుగా మారి, కుంచించుకు పోయినప్పుడు లేదా గట్టిపడినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీంతో రక్తాన్ని పంపింగ్ చేసేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. దీంతో ధమనులు దెబ్బతింటాయి. ఫలితంగా ఇది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.
రక్తపోటును ఎలా కొలుస్తారు? బీపీని ఎలా వర్గీకరించారు?
బీపీని స్పిగ్మోమానోమీటర్ అనే పరికరంతో, మిల్లీమీటర్ల పాదరసం (mm Hg)లో కొలుస్తారు. దీన్ని సిస్టోలిక్ ప్రెజర్/డయాస్టోలిక్ ప్రెజర్‌గా సూచిస్తారు. వ్యక్తుల సాధారణ రక్తపోటు లేదా ఐడియల్ బీపీ 120/80 mm Hg వరకు ఉంటుంది. సిస్టోలిక్ ప్రెజర్ అనేది.. గుండె సంకోచించినప్పుడు లేదా కొట్టుకున్నప్పుడు ధమనులలో రక్తం కలుగజేసే పీడనం. డయాస్టోలిక్ ప్రెజర్ అంటే.. గుండె రిలాక్స్ అయినప్పుడు బీట్స్ మధ్య ధమనులలో రక్తం కలగజేసే పీడనం. వ్యక్తుల గుండె ఆరోగ్య స్థితిని నిర్ణయించడంలో రెండు సంఖ్యలు ప్రధానమైనవి. బీపీ రీడింగ్‌ను వైద్యులు వివిధ రకాలుగా వర్గీకరించారు. సాధారణ రీడింగ్‌ను మించి నిర్ణీత మొత్తంలో పెరిగే బీపీని వర్గాల వారీగా విభజించారు. వివిధ స్థాయుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
సాధారణ రక్తపోటు (Normal BP)
నార్మల్ బీపీ అంటే.. వ్యక్తుల సిస్టోలిక్ ప్రెజర్ 90 mm Hg కంటే ఎక్కువ, 120 mm Hg కంటే తక్కువగా ఉండాలి. డయాస్టోలిక్ ప్రెజర్ 60 mm Hg కంటే ఎక్కువ, 80 mm Hg కంటే తక్కువ ఉండాలి. పెద్దలకు నార్మల్ బీపీ రీడింగ్ 120/80 mm Hg కంటే తక్కువగా, 90/60 mm Hg కంటే ఎక్కువగా ఉండాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. సిస్టోలిక్, డయాస్టోలిక్ నంబర్లు రెండూ ఈ పరిధులలో ఉంటే.. రక్తపోటు నార్మల్‌గా ఉన్నట్లు భావించాలి. బీపీ నార్మల్‌గా ఉంటే వైద్య సహాయం పొందాల్సిన అవసరం లేదు. అయితే అధిక రక్తపోటు లేదా హై బీపీ రాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, వెయిట్ మేనేజ్‌మెంట్ పాటించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు ఉంటే.. ముందు జాగ్రత్తగా జీవనశైలిపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఎలివేటెడ్ బ్లడ్ ప్రెజర్ (Elevated Blood Pressure)
ఎవరికైనా బీపీ 120/80 mm Hg కంటే ఎక్కువగా ఉంటే.. అప్రమత్తం కావాలి. అంటే బీపీపై శ్రద్ధ వహించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అలవాట్లపై దృష్టి పెట్టాలి. బీపీ ఐడియల్ లిమిట్‌ను మించి కాస్త పెరిగినా.. టెక్నికల్‌గా దాన్ని హై బీపీగా పరిగణించరు. ఎలివేటెడ్ బీపీగా వ్యవహరిస్తారు. మీ సిస్టోలిక్ ప్రెజర్ 120 నుంచి 129 mm Hg మధ్య.. డయాస్టోలిక్ ప్రెజర్ 80 mm Hg కంటే తక్కువగా ఉంటే.. దీన్ని ఎలివేటెడ్ బీపీగా వ్యవహరిస్తారు. అయితే ఇది భవిష్యత్తులో హై బీపీగా మారవచ్చు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ స్థాయిలో రక్తపోటు ఉంటే మందులు వాడాల్సిన అవసరం లేదు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం, వెయిట్ మేనేజ్‌మెంట్ వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది.
స్టేజ్-1 హైపర్‌టెన్షన్ (Stage 1 Hypertension)
సిస్టోలిక్ ప్రెజర్ 130 నుంచి 139 mm Hg మధ్య.. డయాస్టోలిక్ ప్రెజర్ 80 నుంచి 89 mm Hg మధ్య ఉంటే.. ఈ స్థితిని స్టేజ్-1 హైపర్‌టెన్షన్‌గా వ్యవహరిస్తారు. అయితే రీడింగులను ఒకటి, రెండు సార్లు మాత్రమే కొలిచి దీనిపై అంచనాకు రాకూడదు. కొంత కాల వ్యవధిలో బీపీ నంబర్ల సగటును పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. ఈ స్థితిని అంచనా వేయాలి. 65 ఏళ్లు దాటిన వారిలో స్టేజ్-1 హైపర్‌టెన్షన్ గుర్తించినప్పుడు మాత్రమే వైద్యులు మెడిసిన్ ఇస్తారు. మిగతావారు తరచుగా చెకప్ చేయించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తే సరిపోతుంది.
స్టేజ్ 2 హైపర్‌టెన్షన్ (Stage 2 Hypertension)
స్టేజ్ 2 హైపర్‌టెన్షన్ మరింత తీవ్రమైన పరిస్థితిని సూచిస్తుంది. సిస్టోలిక్ ప్రెజర్ 140 mm Hg లేదా అంతకంటే ఎక్కువ, లేదా డయాస్టోలిక్ ప్రెజర్ 90 mm Hg లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే.. స్టేజ్ 2 హైపర్ టెన్షన్‌గా గుర్తిస్తారు. ఈ దశలో బీపీని అదుపులోకి తీసుకురావడానికి డాక్టర్లు మందులను సిఫారసు చేస్తారు. అయితే ఈ దశలో కేవలం మందులు మాత్రమే చికిత్స కాదు. ఇతర దశల మాదిరిగా జీవనశైలి అలవాట్లు కూడా ముఖ్యమైనవి.
హైపర్‌టెన్సివ్ క్రైసిస్ (Hypertensive Crisis)
బీపీ 180/120 mm Hg కంటే ఎక్కువగా ఉంటే.. అది తీవ్రమైన ఆరోగ్య సమస్యగా భావించాలి. ఈ కొలతలను అమెరికన్ హార్ట్ అసోషియేషన్ ‘హైపర్‌టెన్సివ్ క్రైసిస్’గా సూచిస్తుంది. ఈ దశలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా, రక్తపోటుకు తక్షణ చికిత్స అవసరం. ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు, తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం, మూత్రంలో రక్తం రావడం, పక్షవాతం లేదా స్ట్రోక్ లక్షణాలు.. వంటివి హైపర్‌టెన్సివ్ క్రైసిస్ లక్షణాలు.
తక్కువ రక్తపోటు (Low Blood Pressure)
రక్తపోటు ఐడియల్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే.. దాన్ని లో-బీపీ లేదా హైపోటెన్షన్ (Hypotension) అంటారు. పెద్దలలో బీపీ 90/60 mm Hg లేదా అంతకంటే తక్కువగా నమోదైతే.. ఈ స్థితిని హైపోటెన్షన్‌గా పరిగణిస్తారు. బీపీ తక్కువగా ఉంటే.. మీ శరీరానికి, గుండెకు ఆక్సిజన్ ఉన్న రక్తం (Oxygenated Blood) సరఫరా కావట్లేదని అర్థం. హైపోటెన్షన్ లక్షణాల్లో తలనొప్పి లేదా మైకము ప్రధానమైనవి. దీనికి చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు బీపీ తగ్గడానికి కారణాలను గుర్తించి, దాన్ని సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు మందులు సిఫారసు చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blood pressure, Health Tips