news18-telugu
Updated: November 2, 2020, 1:38 PM IST
Back Fat Exercises: వీపుపై కొవ్వు పేరుకుపోతోందా... ఈ ఎక్సర్సైజ్లు చెయ్యండి
Back Fat Exercises: మంచి శరీరాకృతిని పొందాలంటే శరీరంలోని అన్ని భాగాలకూ వ్యాయామం అందాలి. కొన్ని ప్రాంతాల్లో కొవ్వును కరిగించడం చాలా సులభం. మన కంటికి కనిపించే ప్రాంతాల్లో కొవ్వును మాత్రమే మనం కరిగించుకుంటూ ఉంటాం. అందువల్ల చాలా మందికి వెనుక వైపు వీపు భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. అక్కడున్న కండరాలకు వ్యాయామం అందడం కష్టం. మహిళల్లో వీపు భాగంలో పేరుకునే కొవ్వు, సాగిన చర్మం ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. బ్రా ధరించే కింది భాగంలో, చేతుల కింద పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
సాధారణంగా శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయే సమస్య జన్యుపరంగా వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, సమతులాహారం తీసుకోవడం, సరైన ఎక్సర్సైజ్ వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా కొవ్వును కరిగించడంతో పాటు మంచి శరీరాకృతిని పొందవచ్చు. వీపు భాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి మహిళలకు అందుబాటులో ఉన్న మూడు వ్యాయామాల గురించి తెలుసుకుందాం.
1. Side Leg Lift:
సైడ్ లెగ్ లిఫ్ట్ వ్యాయామం నడుము, తొడ, కటివలయ ప్రాంతాల్లో ఉండే కండరాలను, వెన్నెముక ప్రాంతం చుట్టూ ఉండే కండరాలను గట్టిపడేలా చేస్తుంది. ముందు మ్యాట్‌పై ఒక పక్కకు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు కుడి చేయిని తల కింద లేదా, శరీరాన్ని పైకి ఎత్తడానికి సపోర్ట్‌గా పెట్టాలి. ఎడమ కాలును కుడి కాలుపై పెట్టాలి. తర్వాత ఊపిరి వదులుతూ పాదాలు, కుడిచేయి సపోర్ట్‌తో... కాళ్లు, నడుము భాగాన్ని 3, 4 అంగుళాలు పైకి ఎత్తాలి. తర్వాత ఊపిరి తీసుకుంటూ కాళ్లను మ్యాట్ వైపుకి కిందికి దించాలి. కానీ కాళ్లను పూర్తిగా కిందకు దించకుండా, కొద్దిగా పైకి ఉండేలా చూసుకోవాలి. ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు మళ్లీ ఇలాగే కుడి కాలు, నడుము భాగాన్ని పైకి ఎత్తాలి. దీన్ని రెండువైపులా, కనీసం 6 నుంచి 8 సార్లు చెయ్యాలి.
2. Cat Cow Stretch:
క్యాట్ కౌ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ వీపు భాగానికి మంచి షేప్ రావడానికి సహాయపడుతుంది. చిన్న పిల్లలు మోకాళ్లపై పాకినప్పుడు కనిపించినట్టుగా చేతులు, మోకాళ్లపై కూర్చోవాలి. తర్వాత గాలి పీల్చుకుంటూ పొట్ట భాగాన్ని కిందకు, గడ్డం, టెయిల్ బోన్ భాగాలను వీలైనంత పైకి తీసుకెళ్లాలి. వెన్నెముక సరైన స్థితిలో ఉంటూ U ఆకారం వచ్చేలా సరిచూసుకోవాలి. తరువాత ఊపిరి వదిలేస్తూ పొట్టను లోపలికి, వెన్నెముకను వెనక్కు, గెడ్డాన్ని ఛాతీ వైపుకు దించుతూ ఆర్చ్ ఆకారంలోకి తీసుకురావాలి. దీన్ని 4 నుంచి 5 సార్లు చేయాలి.
3. Back Extension: బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ ద్వారా వెనుక వైపు లోయర్ బ్యాక్, మిడ్ బ్యాక్, అప్పర్ బ్యాక్‌లకు వ్యాయామం అందుతుంది. ముందు చాపపై బోర్లా పడుకోవాలి. చేతులను కింది వైపుకి తీసుకెళ్లి, అరచేతులను తొడలపై పెట్టాలి. రెండు కాళ్ల బొటనవేళ్లు ఆనుకొని ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ పొట్టపై భారం ఉంచుతూ చాతి, ముఖాన్ని వీలైనంత పైకి తీసుకెళ్లాలి. తరువాత గాలి వదిలేస్తూ ముఖం, ఛాతీ భాగాన్ని చాప మీదకు దించాలి. దీన్ని 6 నుంచి 8 సార్లు చెయ్యాలి. ఈ మూడు వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల వీపు భాగంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. మంచి శరీరాకృతి వస్తుంది.
Published by:
Krishna Kumar N
First published:
November 2, 2020, 1:38 PM IST