హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

విశ్వ వినాయకుడు : ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో పూజలు అందుకుంటున్న గణనాథుడు

విశ్వ వినాయకుడు : ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో పూజలు అందుకుంటున్న గణనాథుడు

వినాయకుడు

వినాయకుడు

విదేశీయులు ఎలిఫెంట్ ఫేస్ గాడ్ అంటూ తమకు తోచిన పదజాలంతో పిలుస్తారు. వినాయకుడు కేవలం స్థానిక దేవుడే కాడు. ఆయన సర్వాంతర్యామి అనే పదానికి అక్షరాలా సరిపోతాడు. వెతికితే ఆయన జాడలు.. ప్రపంచ వ్యాప్తంగా స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తాయి.

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు కుమారస్వామికి అన్న అవుతాడు. అని అందరికీ తెలిసిందే. కానీ అందరికీ తెలియని విషయమేమిటంటే... వినాయకుడు అంతర్జాతీయ దేవుడు. వినాయకుని ఆకారం హిందూ మతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదం. హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరం.

విదేశీయులు ఎలిఫెంట్ ఫేస్ గాడ్ అంటూ తమకు తోచిన పదజాలంతో పిలుస్తారు. వినాయకుడు కేవలం స్థానిక దేవుడే కాడు. ఆయన సర్వాంతర్యామి అనే పదానికి అక్షరాలా సరిపోతాడు. వెతికితే ఆయన జాడలు.. ప్రపంచ వ్యాప్తంగా స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తాయి. లోతులకు వెళ్ళేకొద్దీ వినాయక కథా సంవిధానం... వినాయక వ్రత మహత్యమనే కథలోనిదానికంటే ఎంతో ఎక్కువ సమాచారం గోచరమవుతుంది.

సంస్కృతి గాలి లాంటిది. అదలా ఒకచోట నుంచి ఇంకో చోటకు వ్యాపిస్తూ పోతుంటుంది. దాని వాహకాలు దానికుంటాయ్. వ్యాపార ఆధ్యాత్మికతల ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతుంటాయ్. ఆ క్రమంలో భాగంగా ఆసియా అంతటా వాణిజ్య ధార్మిక సంబంధాలు విస్తరించిన మాట వాస్తవం. వాటితో ఎన్నో హిందూ పూజా సంప్రదాయాలు కూడా వ్యాపిస్తూ వెళ్ళాయి. ఈ వొరవడి 10వ శతాబ్దంలో జరిగింది. ముఖ్యంగా వ్యాపారులు పూజించే,దేవతామూర్తులలో వినాయకుడు ముఖ్యుడు. మలయా ద్వీపకల్పంలోని అనేక భాగాలలో వినాయకుని విగ్రహాలు లభించాయట. ముఖ్యంగా శైవాలయాలలో వినాయకుని పూజ కూడా సర్వసాధారణం.

వినాయకుని మూర్తిచిత్రీకరణలో స్థానిక సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తుంది. ఎవరికి వారు తమకు వీలయినట్టుగా వినాయక సృజన చేశారు. ఈ దేవుడ్ని తమకు తాము సొంతం చేసుకునే క్రమంలో జరిగిన పరిణామమిది. అందులో భాగంగా ఈ సంస్కృతి బర్మా, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాలకు విస్తరించింది. కొన్నివందల ఏళ్ళ క్రితం భారతదేశ సాంస్కృతిక సంపద ఎల్లలు దాటింది. అంకర్ వాట్ దేవాలయ నిర్మాణమే అందుకు నిలువెత్తు ఉదాహరణ. లేకుంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద వైష్ణవాలయం భారతదేశానికి ఆవల వెలసిందంటే ఎంత చిత్రమైన విషయం. అంతెందుకూ బౌద్ధ సమాజమైన థాయిలాండ్‌లో వినాయకుడు విఘ్ననివారకునిగా పూజలందుకొంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లాం ప్రవేశించడానికి ముందుగా హిందూ, బౌద్ధ సంస్కృతుల ప్రభావం బాగా ఉండేది. ఆ కాలానికి చెందిన కొన్ని గణేశ విగ్రహాలు లభించాయన్నది చరిత్ర చెబుతోన్న సత్యం.

మహాయాన బౌద్ధంలో వినాయకుని స్వరూపం కొన్నిసార్లు బౌద్ధ దేవతగాను, మరొకొన్నిసార్లు హిందూ రాక్షసునిగాను కూడా చూపబడిందట. గుప్తులకాలం చివరిభాగంలోని బౌద్ధ శిల్పాలలో వినాయక శిల్పాలున్నాయి. బౌద్ధంలో వినాయకుడు అధికంగా నృత్యముద్రలో చూపబడ్డాడు. ఉత్తర భారత దేశం, నేపాల్, టిబెట్‌లలో ఈ రకమైన చిత్రాలు లభించాయి. నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. ఈ రూపంలో వినాయకునికి ఐదు తలలుంటాయి. ఈ వినాయక వాహనం సింహం. టిబెట్టులో వినాయకుని చిత్రీకరణ ట్సాగ్స్ బ్డాగ్ అని పిలిచేవారు. ఒకోమారు దేవునిగాను, ఒకోమారు మహాకాలుని పాదాల క్రింది నలుగుతున్నట్టు చూపారు. మరికొన్ని చోట్ల విఘ్ననివారకునిగా చూపారు. కొన్ని వైవిధ్యాలతో వినాయకుడు చైనా, జపాన్ సంప్రదాయాల్లోనూ దర్శనమిస్తాడు. ఉత్తర చైనాలో 531వ సంవత్సరానికి చెందిన ఓ విగ్రహం లభించింది. జపాన్‌లో 806 వసంవత్సర కాలంలో వినాయకపూజ గురించి ప్రస్తావించినట్లు ఆధారం లభించింది. జైన గ్రంధాలలో గణేశపూజ ప్రస్తావించలేదు. కానీ, చాలామంది జైనులు వినాయకుడ్ని పూజిస్తారు. ఈ సంప్రదాయంలో కుబేరుడి కొన్ని లక్షణాలు వినాయకునికి ఆపాదించినట్లు అనిపిస్తుంది. వ్యాపార వృత్తులలో జైనులు అధికంగా పాల్గొనడం ఇక్కడ గమనించాలి. 9వ శతాబ్దానికి చెందిన జైన గణేశ విగ్రహం ఒకటి లభించింది. రాజస్థాన్, గుజరాత్‌లలో జైనమందిరాలలో అనేక వినాయక విగ్రహాలున్నాయి.

చిత్రమైన విషయం ఏంటంటే.. వినాయకుడు ఎవరూ తయారు చేయకుండానే ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడా కనిపిస్తూనే వుంటాడనడానికి అనేక ఆధారాలున్నాయి. రాళ్ళు ఆకులు చెట్లు కూరగాయలు వంటి అనేక వస్తువుల్లో వినాయక ఆకృతి దర్శనిమిచ్చేదట. దీన్ని బట్టీ వినాయకుడు యూనివర్శల్ గాడ్ అనే మాటకు అక్షరాల సరిపోతాడని చెబుతారు. ఏనుగు తల కలిగివుండటం వల్ల ఈ రూపు ఎక్కడ కనిపించినా వినాయకుడే అనే మాటను ఒక్కసారి పరిశీలించాలంటున్నారు కొందరు. యూనివర్సల్ గాడ్‌గా అవతరించేందుకూ... ప్రపంచవ్యాప్త భక్తుల హృదయాలను ఆక్రమించేందుకూ వినాయకుడికి ఏనుగు తల ఏర్పాటు చేశారా మనవాళ్ళు..? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇలాంటి ఎన్నో అంతర్జాతీయాంశాల్లో గణపతి ప్రస్థావన ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి మరిన్ని విషయాలపై ఓ అవలోకన.

వినాయకుడు గజముఖం కలిగి వుండటానికి కారణం... ఏనుగు ముఖ ఆకృతి కలిగిన శివపార్వతులే కారణం అంటారు శాస్త్రకారులు. గజముఖం ధరించి పార్వతీ పరమేశ్వరులు సంగమిచ్చినప్పుడు ఇలాంటి తనయుడు కలిగాడని అంటారు. కనుక వినాయకుడి విషయంలో ఒక నిర్ణయానికి రావాలంటే ఒక్క చోట చేరి ఆలోచిస్తే సరిపోదన్నది కొందరి వాదన. హెరియస్‌ అనే గ్రీకురాజు గణేశభక్తుడట. గణపతి బొమ్మతో నాణాలు విడుదల చేశాడట. అమెరికా ఖండంలోని పెరూ, మెక్సికో ఆదివాసుల్లో గణపతి పూజ ఉంది. ఈజిప్షియన్ల 'గునీస్‌', మన గణేశుని పోలిన విఘ్ననాశన దేవతగా చెబుతారు. గణపతి ఇంటర్నేషనల్ గాడ్ గా చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఎక్కడుంటాయని అంటారు పరిశీలకులు. అసలు పురాణ దేవతలకూ ఖగోళ సంబంధ విషయాలకూ ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం వుందని చెబుతారు ఇంకొందరు.

పురాణాల్లోని దేవతలకు సంబంధించిన గాథలకు, ఖగోళ దృశ్యాలకు సంబంధం కల్పించడం అనాదిగా వస్తోంది. కార్పెంటియార్‌ అనే వైజ్ఞానికుడు నక్షత్ర మండలాన్ని వీధులుగా విభజించి 'వినాయక వీధి' అని పేర్కొన్నాడు. ఇది వర్షకాలంలో మబ్బులు విడినప్పుడు స్పష్టంగా కనిపిస్తుందట. ఈ వీధిలోని నక్షత్రాలు ఏనుగు ఆకారంలో కనబడతాయి. దానికింద ఉన్న మరికొన్ని నక్షత్రాలు ఎలుక ఆకారంలో కనిపిస్తాయి. విఘ్నేశ్వర నక్షత్రాలు సూర్యోదయానికి పూర్వం తూర్పున భాద్రపద శుద్ధ చవితినాడు ఉదయిస్తాయి. ఆ రోజు వినాయకచవితి. ఆ మరునాడు సప్తర్షి మండలంలోని పడమటి భాగం సూర్యోదయానికి ముందు ఉదయిస్తుంది. అందుకే చవితి మరునాటి తిధిని రుషి పంచమి అంటారు.

మనం చూడాలే కానీ, భారతదేశంలోనే ఎన్నో రకాల విఘ్న రాజులు దర్శనమిస్తారు. స్త్రీ రూపంలో నర్తించే గణేశుడు, మూషిక వాహనదారుడైన వినాయకుడు, సిద్ధి, బుద్ది సమేతుడైన గణనాధుడు.. స్త్రీ రూపంలో నర్తిస్తున్నాడంటే నమ్ముతారా? కూర్చుని అభయాన్నిచ్చే వినాయక రూపాలనే మనం ఇంత వరకు చూసి ఉంటాం. అయితే కన్యాకుమారిలోని ఓ ఆలయంలో గణనాధుడు స్త్రీ రూపంలో నాట్యమాడుతూ దర్శనమిస్తాడు. భారత సాంస్కృతిక శిల్పకళా నైపుణ్యానికి ఈ శిల్పాలు నిలువెత్తు నిదర్శనాలు. కన్యాకుమారి జిల్లాలోని సుసీంద్రమ్ ధానుమాలయన్ ఆలయంలోని ఓ స్థంభంపై వినాయకుడు నాట్యమాడుతూ కనిపిస్తాడు. ఓ కాలుపైకి పెట్టుకుని, మరో కాలు కింద ఉంచి వయ్యారంగా నిల్చుని, అభయమిస్తుంటాడు. స్త్రీ నాట్యభంగిమలో కనిపించే ఈ రూపాన్ని గణేశిని, గజానని అని పిలుస్తుంటారు కూడా. అలాగే మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుని ఆలయ ప్రధాన ద్వారంపై గణేశిని రూపము చెక్కి ఉంటుంది. ఈ రూపంలో ఉన్న వినాయకుని కాళ్లు పులి కాళ్లను పోలి ఉంటాయి. అందుకని ఈ రూపంలో ఉన్న గజాననుడు వియాగ్రపాద గణేశిని అని పిలువబడుతుంటాడు.

గణేశారాధన మనదేశంలోనే కాక విదేశాల్లో సైతం ఉందని చెప్పడానికి నిదర్శనంగా పలుదేశాల్లో వినాయక విగ్రహాలు బయటపడ్డాయి. 13వ శతాబ్దినాటిదిగా చెప్పబడుతున్న కిరీటాలంకృత గణేశవిగ్రహం జావా ద్వీపంలో లభ్యమైంది. సయామ్ ద్వీపంలో కూర్మవాహనుడైన గణేశుడు, ఒక చేతిలో చింతామణితో దొరికాడు. హనోయ్ పట్టణంలో ఈయన చిత్తరువులు లభ్యం అయినాయి. జపాన్ లో సుమో మల్లయోధుల కుస్తీపట్ల భంగిమలో ఉన్న రెండు జంటగణేశ్ విగ్రహాలు లభ్యం అయ్యాయి. 14 వశతాబ్దికి చెందిన విద్యాగణపతి విగ్రహం కంబోడియాలో ఉంది. చైనా-జపాన్‌లలో ఒక చేతిలో గొడ్డలి, మరో చేత కారట్ దుంప వున్న గర్భధాతు గణేశ్ విగ్రహాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శక్తి-హేరంబ గణపతి విగ్రహం టిబెట్‌లో ఉంది. ఈ ఆధారాలు చాలు గణపతి, వి-శ్వ-నాయకుడు అని చెప్పడానికి. ఈ చతుర్ధి శుభసమయాన విశ్వమానవాళికి సుఖశాంతులు ఆయురారోగ్యఐశ్వర్యాలను ఆ విశ్వనాయుకుడు ప్రసాదించాలని కోరుతూ... ప్రతిఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

First published:

Tags: Vinayaka Chavithi

ఉత్తమ కథలు