వినాయక విశ్వరూపం: వినాయకుడికి ఎన్ని రూపాలు

రూపాలు వేరైనా.. గణనాధుడు ఒక్కడే... వినాయకుడు ఒకడే కాదు. ఆయనకు 32 రూపాలున్నాయని చెపుతున్నాయి శాస్త్రాలు. ఆ ముప్ఫైరెండింటిలో పదహారు రూపాలలో ఉండే వినాయకులను ప్రత్యేకంగా పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 12, 2018, 3:56 PM IST
వినాయక విశ్వరూపం: వినాయకుడికి ఎన్ని రూపాలు
వినాయకుడు
news18-telugu
Updated: September 12, 2018, 3:56 PM IST
వినాయకుడికి సాధ్యం కానిది లేదు. వినాయకుడంటే అన్నీ. సమస్తం ఆయన ఆధీనంలోనే వుంటాయి. కోరితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని చెబుతారు. మహావిష్ణువు దశావతార రూపుడయితే, విఘ్నేశ్వరుడు అంతకన్నా ఎక్కువ రూపాలను కలిగిన దేవుడు. ఒక్కో రూపం ఒక్కో మహిమ చూపుతాడట వక్రతుండుడు. కోటి సూర్యులకు సమమైన గణపతికి వీలు లేని కార్యం లేదు. ఈ చరా చర సృష్టిలో.. వినాయకుడికి సాధ్యం కానిది లేదంటారు గణేశశక్తిని ఆరాధించేవారు.

రూపాలు వేరైనా.. గణనాధుడు ఒక్కడే... వినాయకుడు ఒకడే కాదు. ఆయనకు 32 రూపాలున్నాయని చెపుతున్నాయి శాస్త్రాలు. ఆ ముప్ఫైరెండింటిలో పదహారు రూపాలలో ఉండే వినాయకులను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒక్కో రూపంలో ఉండే వినాయకుడిని పూజిస్తే ఒక్కో కోరిక తీరుతుంది. ఒక్కోరకం శుభం కలుగుతుందని చెబుతారు. ముద్గల పురాణంలో వినాయకుడికి సంబంధించిన పదహారు రూపాలను గురించి ప్రత్యేకంగా వివరణ కనిపిస్తుంది. బాలవిఘ్నేశుడు, తరుణ విఘ్నేశుడు, భక్త, వీర, శక్తి, ద్విజ, పింగలం, ఉచ్చష్ట, విఘ్నరాజం, క్షిప్ర, హేరంబం, లక్ష్మీవిఘ్నేశ, మహావిఘ్నం, భువనేశం, నృత్త, ఊర్ధ్వ గణపతి అనే పదహారు రకాల గణపతుల రూపాలను గురించి  వివరిస్తోంది ముద్గల పురాణం.

బాలగణపతిని పూజిస్తే బుద్ధివికాసంతోపాటు.. ప్రతివిషయాన్ని శ్రద్ధతో పరిశీలించే శక్తి అబ్బుతుంది. తరుణ గణపతిని పూజిస్తే చేపట్టిన కార్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోను సాధించి తీరాలనే పట్టుదల కలుగుతుంది. భక్త విఘ్నేశుడిని పూజిస్తే భక్తిభావం పెరుగుతుంది. వీర విఘ్నేశుడ్ని పూజించినవారికి మంచి ధైర్యం వస్తుంది. శక్తి విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఆత్మస్త్థెర్యం కలుగుతుంది. ద్విజ లేక ధ్వజగణపతిని పూజిస్తే సొంతంగా ఆలోచించగల శక్తి పెరుగుతుంది. సిద్ధివినాయకుడిని పూజిస్తే అన్నిటా విజయమే. సిద్ధి, బుద్ధి అనే భార్యలను కలిగివుండి తన తొండంతో నువ్వులద్దిన ఉండ్రాళ్ళను తింటూ దర్శనమిస్తాడీ సిద్ధివినాయకుడు.

ఉచ్చిష్ట గణపతిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ గణపతి దగ్గర కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని అంటారు. ఈయనకు చేసే పూజలో ఏమాత్రం శ్రద్ధలేకపోయినా కోరికలు తీరడమనే మాట అటుంచి ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తారు. విఘ్న వినాయకుడికి పది చేతులు. విఘ్నాలు తొలగేందుకు ఈ గణపతి పూజకు మించింది లేదంటారు. క్షిప్రగణపతిని పూజిస్తే కోరికలు తీరుతాయి. హేరంబ గణపతిని పూజిస్తే ప్రయాణాలలో ప్రమాదాలు కలగవు. లక్ష్మీగణపతి పూజ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.



మహా విఘ్నవినాయకుడిని పూజిస్తే ఏలినాటిశని ఉన్న సమయాల్లో కూడా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. భువనేశ వినాయకుడిని పూజిస్తే శాశ్వత జయం కలుగుతుంది. అందుకే ఈయనను విజయ వినాయకుడు అనికూడా అంటారు. నృత్త వినాయకుడిని పూజిస్తే తృప్తి, మనశ్శాంతి కలుగుతాయి. ఈయన తాండవం చేస్తుంటాడు కనుక తాండవ గణపతి అని కూడా అంటారు. ఊర్ధ్వ గణపతిని పూజిస్తే తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయి. అలాగే ఆకుపచ్చని శరీరఛాయతో మెరిసిపోతున్న లక్ష్మీదేవిని తన ఎడమతొడమీద కూర్చోపెట్టుకొని ఆమె వెనుకగా తన చెయ్యిని పోనిచ్చి ఆమెను పొదివిపట్టుకున్నట్లుగా ఉంటాడు వూర్ధ్వగణపతి. ఈ పదహారురకాల గణపతులను ప్రధానంగా పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ముద్గల పురాణం చెబుతోంది.

వినాయకచవితి రాగానే సర్వత్రా అనేక రూపాలలో గణపతి బొమ్మలు కనిపిస్తుంటాయి. వాటిలో శాస్త్రాలు నిర్దేశించిన రూపాలు ఇలా కనిపిస్తున్నాయి. వీటినే జాగ్రత్తగా శ్రద్ధతో పూజించడం మేలని చెపుతున్నారు. ఇక వినాయకుడి పక్కన లక్ష్మీదేవి ఏమిటి? అనే ప్రశ్న ఈ పదహారు గణపతులలోని కొన్ని గణపతుల రూపాలను పరిశీలిస్తున్నప్పుడు తలెత్తుతుంది. దానికి సమాధానంగా స్కంద పురాణం, గణపతి పురాణం లాంటి పురాణాలు గణపతి శ్రీమహావిష్ణు స్వరూపమని, అందుకే ఆయన పక్కన లక్ష్మీదేవి ఉంటుందని చెప్పడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...