హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

వినాయక విశ్వరూపం :గణపతి రూపం వెనక రహస్యం

వినాయక విశ్వరూపం :గణపతి రూపం వెనక రహస్యం

వినాయకుడు

వినాయకుడు

ఇదీ మనకందరికీ తెలిసిన కథనం. ఇంతేనా ఇంతకన్నా ఏమీ లేదా. మరి వినాయకుడు స్వయంభువంటారే. మరి దాని మాటేవిటి? ప్రకృతి అంతటా పరుచుకుని పోయి వుంటాడే దాని భావమేమిటి? తనలో ఈ అనంత విశ్వాన్ని నింపుకున్నట్టు కనిపిస్తాడే అందులోని అర్ధమేమిటి?

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ.. విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడూ.. చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ.. నాలుగు చేతులవాడూ.. అనుగ్రహదృష్టి కలిగిన ముఖం కలవాడైన వినాయకునికి దేశ విదేశాల్లో వివిధ రకాల పద్ధతుల్లో ఆరాధిస్తారు. వినాయక చవితి రోజున దేశదేశాల్లో... ముఖ్యంగా మన భారతదేశంలో ఎందుకంత హంగూ ఆర్భాటాలతో కూడిన ఉత్సవాలు జరుపుతారు..? ఎక్కడిదా విశిష్టిత..?  ఆయన గురించి మనకు తెలిసినదెంత.. తెలియాల్సింది ఇంకెంత..? తెలుసిన కొద్దీ ఔరా! ఇన్నేసి వింతైన విషయాలున్నాయా..? అంతుచిక్కని రహస్యాలున్నాయా? అనిపించే ఆ కథా సంవిధానంపై ఈ సందర్భంగా ఓ ప్రత్యేక కథనం..

విఘ్నాలకు అధిపతిగా... గణాలకు అధినేతగా... ప్రధమ పూజలందుకుంటాడాయన. సిరులకు సంపదలకూ... విజయాలకూ అభివృద్ధికీ... ప్రధానం ఆయనే. ఎందరు దేవుళ్ళను మొక్కుతున్నా... ఆయన ధ్యానం చేయకుండా ఏ దేవుడ్ని కొలిచినా ప్రయోజనం వుండదు. దైవశక్తుల్లో ఆయనో ట్రాన్స్‌ఫార్మర్. ఆయనే దైవనాయకుడైన వినాయకుడు. ఇంతకీ ఆయన పార్వతీదేవి చేతిలో తయారయిన పిండిబొమ్మకు ప్రాణం పోయగా జన్మించిన వాడా..? లేక స్వయంభువా..? లేక గజముఖములు కలిగిన పార్వతీ పరమేశ్వర సంగమంలోంచి ఉద్భవించిన దేవుడా..? ఏమా జన్మరహస్యం.. ఏది నిజం..? అసలు గణపతి ఎందెందు వెతికినా అందెందే కలడు. చెట్టూ- పుట్టా- ఆకూ- కాయ- రాయీ- రప్పా... ఎక్కడ వెతికితే అక్కడ గజానన రూపం సాక్షాత్కరిస్తుంది. ఆయన ఒక ప్రాంతానికి పరిమితమైన దైవం కాదు. ప్రపంచమంతటా కొలవబడిన దేవ దేవుడంటారు. ఇదెంత వరకూ నిజం...

మన దేశంలో వీధి వీధినా... వాడ వాడనా... ఆయనకున్న దేవాలయాలు మరే దేవుడికీ ఉండవు. వినాయకుడు... గణపతి... గణనాధుడు... విఘ్నేశ్వరుడు... అనేక పేర్లు. ఆయన రూపం చూడగానే పిల్లల్లో ఎక్కడ లేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది. గణపతి బప్పామోరియా! అని సందడి చేస్తూ ఊరేగిస్తారు. పెద్దవాళ్ళు వినాయక చవితి వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద పందిళ్లు వేసి... నవరాత్రులు జరిపి... ఆ విజయ నాయకుడికి ఉత్సవాలు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ముఖాకృతిలో ఎంతో ప్రాముఖ్యం పొందిన దేవుడెవరైనా వున్నారంటే అది వినాయకుడే. వినాయకుడ్ని కొలుచుకోవడం అంటే మనల్ని మనం కొలుచుకోవడం... మన జీవన శైలిని గౌరవించుకోవడం. ఆయన రూపు రేఖలు ప్రజల జీవన విధానానికి అత్యంత దగ్గరగా ఉంటుంది.  వినాయకుడ్ని మొక్కడం అంటే అనేకానేక సంస్కృతి- సంప్రదాయాలను ఒక్కసారిగా పూజించడం అవుతుందన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ప్రతి యేటా భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీ. ఎక్కడ చూసినా ఆయన రూపమే కనిపిస్తుంది. మనకు తెలిసినంతవరకూ... వినాయకుడి జన్మరహస్యం ఇదే. గజాసుర సంహారానంతరం... శివుడు కైలాసం వస్తున్నాడని తెలుస్తుంది పార్వతీదేవికి. ఆ సంతోషంలో పార్వతీ... తాను నలుగుతో స్నానం చేయబోతూ... నలుగుపిండి బొమ్మను ఒకదాన్ని చేసి... దానికి ప్రాణం పోయగా బొమ్మ బాలుడిగా మారుతుంది. ఆ బాలుడ్ని కాపలా వుంచి, తన అనుమతి లేకుండా ఎవ్వరినీ లోనికి రానివ్వద్దంటుంది.. పార్వతీమాత. కాసేపటికి అక్కడకు  వస్తాడు పరమేశ్వరుడు. లోపలకు వెళ్ళాలి.. అడ్డు తొలగమంటాడు శివుడు. తల్లి ఆజ్ఞ బద్దుఢై ఆ బాలుడు శివుడ్ని లోపలికి ప్రవేశించ నివ్వడు. తరువాత పరమేశ్వరుడు ఆ బాలుడ్ని తన త్రిశూలంతో వధించడం... అక్కడకు పార్వతీదేవి వచ్చి శోకించడం చూసి విచారిస్తాడు పరమేశ్వరుడు. ఆ సరికే గజాసురుడు కోరిన కోరిక మనసులో వుండటంతో... పరమేశ్వరుడు తన దూతలతో గజముఖాన్ని తెమ్మంటాడు. అలా ఆ బాలకుడు గజాననుడైనాడు.

ఇదీ మనకందరికీ తెలిసిన కథనం. ఇంతేనా ఇంతకన్నా ఏమీ లేదా. మరి వినాయకుడు స్వయంభువంటారే. మరి దాని మాటేవిటి? ప్రకృతి అంతటా పరుచుకుని పోయి వుంటాడే దాని భావమేమిటి? తనలో ఈ అనంత విశ్వాన్ని నింపుకున్నట్టు కనిపిస్తాడే అందులోని అర్ధమేమిటి? అందుకే విశ్వవినాయకుడంటారా... దీని సంగతేమిటి? అంటే హైందవం విశ్వజనీనమైన మతమా..? లేక వినాయకుడు మాత్రమేనా..! వినాయకుడికి ఆ రూపు రేఖలు ఎక్కడ నుంచి.. ఎలా మారుతూ వచ్చాయి?   మనం కొలిచే వినాయకుడు మనవాడేనా.. లేక అందరి వాడా..? ఏమిటీ ప్రశ్నా ఉధృతి. వాటన్నిటినీ ఛేదించుకుంటూ వెళితే, ఎన్నో చిత్ర విచిత్రమై విషయాలు వెలుగు చూస్తాయి.

దేవుళ్లంతా చక్కని ముఖాలతో.. అందంగా, మంచి మంచి వాహనాలెక్కి ఊరేగుతారు.. మరి వినాయకుడేమిటి? ఏనుగు ముఖం.. ఎలుక వాహనం.. ఎక్కడైనా పొంతన ఉందా? ఏనుగు ఎలుక మీద ఎక్కి కూర్చొని వెళ్లటం విచిత్రం కాదా? ఏ విధంగా చూసినా ఈ పొంతనకు పరమార్ధం అంతుచిక్కదంటారు సైంటిస్టులు. ఈ ఆకారానికి, ఆ వాహనం సంభవమేనా? ఇదేమి వింత... అని ఆలోచిస్తే మతిపోతుంది. ఒక్కో దేవుడి గురించి ఆలోచిస్తే... ఆ దేవతల రూప రహస్యాలు- శాస్త్ర సాంకేతికతకు ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థమవుతుంది.. వినాయకుడు కూడా అంతేనంటారు ఇందులో నిజానిజాలేపాటి?

తొలిదైవమైన ఆదిగణపతి గురించి చెప్పుకుంటే.. ఆయన ఎంతటి హేతుబద్ధమైన దైవమో తెలుస్తుంది. బొజ్జగణపయ్య.. బొజ్జ  దేనికి గుర్తు. ఆ తొండం, తల ఏ భావానికి ప్రతీకలు? ఆయన చేతిలోని ఆయుధాలకు అర్ధమేమిటీ.. పరమార్ధమేమిటీ? ఆయన దేహమే ఓ సామాజికి దేవాలయం అంటారు దాని అంతరార్ధమేమిటి? ఆయన ఇష్టపడే ప్రతిదీ ప్రాకృతమైనదే? వినాయకుడి ప్రస్తావన తీసుకురావడం అంటేనే ఈ అండపిండ బ్రంహ్మాండానికి సంబంధించిన అన్ని విషయాలనూ ఒక్కసారిగా మాట్లాడుకున్నట్టే అంటారు. అదెంత వరకూ వాస్తవం?

వినాయక చవితిని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. అంటే వ్యవసాయ తొలి సీజన్‌ ఖరీఫ్‌ మంచి ఊపు అందుకునే సమయం కూడా ఇదే. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. మనం చేసే ప్రతీ పనీ. జరిపే ప్రతి పండగ అన్నీ... వ్యవసాయానికి అనుసంధానించి వుంటాయి. వినాయక చవితి కూడా అంతే. సాధారణంగా నాట్లు వేయటంలో రైతన్నలు తీరిక లేకుండా గడిపే సమయమిది. అందుకే ఆయనకు తొలి పూజలు చేసి పవిత్రమైన వ్యవసాయ పనులను మొదలుపెడతారు కర్షక జీవులు. ఆయన శరీరం ఏనుగు శరీరం.. అంటే భారీ పదార్థం. భౌతిక శాస్త్రపరిభాషలో చెప్పాలంటే మెటీరియల్‌. అసలు పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది.

మట్టి నుంచే పంట పండుతుంది. అంటే ఆయన స్థూలంగా భూమికి ప్రతీక. ఆయన ఏనుగు ముఖం బుద్ధికి సింబల్‌. ఆయనకు ఉండే ఏక దంతం.. రైతు పొలంలో పట్టే నాగలికి గుర్తు. ఇక పెద్ద పెద్ద చెవులు తూర్పార బట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు. ఎలుకల్ని వాహనంగా చేసుకోవటం అంటే పంటల్ని పాడు చేసే ఎలుకలను అణచివేయటానికి గుర్తు. బొజ్జగణపయ్య పొట్టను పాములతో బిగించి కట్టుకోవటం కూడా అందుకే ప్రతీక. వినాయకుడి వ్రతాన్ని చేసేప్పుడు 21 రకాల పత్రాలను వినియోగిస్తారు. జాజి, మారేడు, మాచీపత్రి, విష్ణుక్రాంత మొదలైన ఆకులన్నీ సాధారణంగా పంటపొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే. అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడయ్యాడని చెబుతారు. వినాయకుడిని పూజించటం అంటే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే.. అవుతుందని ఎంతో భక్తితో భావిస్తారు. ఇదీ సంగతి. ఇన్నేసి విషయాలు వినాయక రూపంలో ఇమిడి వున్నాయని అంటారు వినాయక భక్తులు.

First published:

Tags: Vinayaka Chavithi

ఉత్తమ కథలు