P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18 సువిశాల సాగర తీరం.. స్మార్ట్ సీటీ.. ఫ్యూచర్ ఐటీ హబ్.. కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఇలా ఏ పేరుతో పిలిచిన గ్రేటర్ విశాఖ ఓ ప్రత్యేకమైన నగరం.. రోజు రోజుకూ తన పరిధిని పెంచుకుంటూ విస్తరిస్తోంది. అత్యాధునిక నగరాలతో పోటీ పడుతోంది. అలాంటి మహా నగరం నడి బొడ్డున ఓ గిరిజన గ్రామం ఉందని మీకు తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు.. ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అసలు నగరంలో అడవి ఎలా ఉంది..? ఆ అడవిలో ఈ గిరిజన తండా ఎందుకుంది..? అసలు అక్కడ నివశించేది ఎవరు..? కాలం ముందుకెళ్తున్నా వారు మాత్రం ఇంకా ఎందుకు అలాగే ఉన్నారు అంటూ ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి.
విశాఖపట్నంలో ఆరోవార్డులో ఈ గిరిజన గ్రామం ఉంది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. పీఎం పాలెంకి దగ్గరగా కంబాల కొండ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందీ చిన్న గిరిజన పల్లె ఇది. 350 మంది జనాభాతో ఉన్న పల్లె పేరు శంభువానిపాలెం. మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ అయిదు తరాలుగా ఉంటున్నారు.
కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉండే ఈ ప్రాంతానికి ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. అలాగే ఈ ప్రాంత వాసులు కూడా ఎక్కువగా బయటకు వెళ్లరు. శంభువానిపాలెం వెళ్లాలన్నా... వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్ పోస్టు తనిఖీలు ఉంటాయి. పిఎం పాలెం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడొక చెక్ పోస్టు గుండా.. శంభువానిపాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ చెక్ పోస్టు ఏర్పాటు చేసింది. గ్రామస్థుల రాకపోకలపై నిత్యం నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్లు తప్ప ఇంకెవరు వెళ్లలేరు.
7,200 హెక్టార్లున్న కంబాల కొండ అభయారణ్యంలో ఉన్న ఈ పల్లెలో గిరిజన జీవన విధానమే ఉంటుంది. నగరంలోకి అడవి వచ్చిందా...? అడవే నగరంగా మారిందా...? అన్నట్టే ఉంటుంది. ఇక్కడి కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్‌లోనే గ్రామస్థుల్లో కొందరు సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్లుగా పనులు చేస్తుంటారు. మిగతా వారు ఊర్లో మేకలు కాసుకుని జీవనం సాగిస్తుంటారు.
వీరంతా ఇక్కడకు ఎలా వచ్చారంటే.. అయిదు తరాల క్రితమే ఇక్కడికి వలస వచ్చారట. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో అనేక గిరిజన తెగలున్నాయి. అందులో కొన్ని తెగలు ఏజెన్సీ నుంచీ మైదాన ప్రాంతంలో ఉండే జమిందార్లకు సేవకులు కూడా వచ్చారు. అలాగే మైదాన ప్రాంతాల్లో ఏజెన్సీ వస్తువుల్ని విక్రయించడానికి వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారట. ప్రస్తుతం మన్నెందొర తెగ గానే ఈ ప్రాంతం పిలుస్తారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏ భవనమూ లేదు. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సిగ్నల్ సమస్య కారణంగా రేషన్ కూడా ఊరి బయట సిగ్నల్ ఉన్న చోటుకి వెళ్లి తీసుకుంటారు. ఈ ఊరు రావడానికి కూడా వీరి బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోయినట్టే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Lifestyle, Tribal huts, Visakhapatnam