Food Habits: మీ రోజువారీ ఆహారంలో అన్నం తప్పకుండా ఉండాల్సిందే.. ఎందుకంటే..

ప్రతీకాత్మకచిత్రం

రోజువారీ ఆహారంలో అన్నం ఎంతోకొంత ఉండాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రైస్ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వెల్లడిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు.

  • Share this:
ఆహారపు అలవాట్లను ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ కొత్త సమస్యల బారిన పడుతున్నారు ప్రజలు. వివిధ కారణాలతో చాలామంది అన్నం తినడం మానేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే నిపుణుల సలహా తీసుకోకుండా ఇలాంటి అలవాట్లు పాటించడం మంచిదికాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారు అన్నం తినకపోవడం లేదా అన్నం తక్కువ తినడం వంటివి పాటిస్తారు. అయితే మన రోజువారీ ఆహారంలో అన్నం ఎంతోకొంత ఉండాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రైస్ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వెల్లడిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు రుతుజ దివాకర్. తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆమె బియ్యం, అన్నం వినియోగం గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. అవేంటంటే..

* అన్నం ప్రీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మనుషులకు మాత్రమే కాకుండా శరీరంలోని సూక్ష్మజీవుల ఎకో సిస్టమ్‌కు అవసరమైన ఆహారంగా మారుతుంది.

* హ్యాండ్‌ మిల్లింగ్ చేసిన, సింగిల్ పాలిష్ చేసిన బియ్యాన్ని వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో వాడవచ్చు. పదార్థాలను బట్టి వీటిని ఉడికించే స్థాయి మారవచ్చు. అయితే వీటి ద్వారా అందే ప్రయోజనాల్లో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు.

* భారతీయులు అన్నంలో వివిధ రకాల పప్పులు, మాసం, కూరగాయలు, పెరుగు కలిపి తింటారు. ఇలాంటి అలవాటు మన రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. అయితే ఇప్పటికే మధుమేహం సమస్య ఉన్నవారు నిపుణుల సలహాతో డైట్ పాటించడం మంచిది.

* అన్నం సులభంగా జీర్ణమయ్యే ఆహారం. తగిన మొత్తంలో ఇతర కూరలతో కలిపి అన్నం తినడం వల్ల.. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇది మెరుగైన నిద్ర అలవాట్లకు దారితీస్తుంది. ఫలితంగా హార్మోన్ల సమతుల్యత మెరుగ్గా ఉంటుంది.

* అన్నం చర్మ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే ప్రొలాక్టిన్‌కు చర్మ సమస్యలను దూరం చేసే లక్షణం ఉంటుంది.

* థైరాయిడ్ పనితీరులో లోపాల కారణంగా జుట్టు రాలిపోయే సమస్యకు అన్నం చెక్ పెడుతుంది. జుట్టు పెరుగుదలను వేగవంతం చేసే గుణాలు సైతం దీంట్లో ఉంటాయి.

* సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన బియ్యంతో అన్నం వండి తినడం వల్ల ఇతర దుష్ప్రభావాలను అధిగమించవచ్చు.

* రైస్‌లో ప్రతి భాగం ఉపయోగపడుతుంది. బియ్యం ఊకతో తయారయ్యే తవుడు పశువుల దాణాగా వినియోగిస్తారు. అందువల్ల దీంట్లో వృథా అనేది ఉండదు.

* జీవన శైలిని బట్టి రోజులో కనీసం ఒకపూట అయినా రైస్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కండరాల బలోపేతానికి, జీవక్రియలకు అవసరమైన శక్తిని అన్నం మనకు అందిస్తుంది.

* స్థానిక సంస్కృతికి అద్దం పట్టే వంటకాలను బియ్యంతో తయారు చేస్తారు. మొత్తానికి మన వారసత్వ ఆహారపు అలవాటైన అన్నాన్ని క్రమం తప్పకుండా తీసుకునే అలవాటు.. ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రాన్ని సమతుల్యం చేస్తుంది.
Published by:Krishna Adithya
First published: