World Tourism Day: నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం.. దీని చరిత్ర, ప్రాముఖ్యత, ఇతర ప్రత్యేకతలు తెలుసుకోండి!

వరల్డ్ టూరిజం డే ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహిస్తుంటారు. టూరిజం వల్ల రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక అంశాలపై పడే ప్రభావాన్ని ఈ సందర్భంగా చర్చిస్తుంటారు.

  • Share this:
ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం (Tourism) ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో (Economy) టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా (Corona) వల్ల కాస్త తిరోగమించినప్పటికీ ఈ రంగం ప్రపంచ దేశాల జీడీపీకి (GDP) ఉత్ప్రేరకంగా పనిచేస్తూనే ఉంది. విశ్వవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి (Employment) కల్పిస్తుంది. దీంతో పాటు ఆయా దేశాల సాంస్కృతిక, చారిత్రక విషయాలను అందరికీ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహిస్తుంటారు. టూరిజం వల్ల రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై పడే ప్రభావాన్ని ఈ రోజున చర్చిస్తారు. పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు పర్యాటకానికి అనువైన వాతావరణం కల్పించే మార్గాలపై సదస్సులు నిర్వహిస్తారు. ఈ రంగం మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అవగాహన కల్పిస్తారు. ఈ నేపథ్యంలో పర్యాటక దినోత్సవం చరిత్ర, విశిష్టత, థీమ్ లాంటి విషయాలను తెలుసుకుందాం.

* చరిత్ర..
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా 1979లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. 1980లో సెప్టెంబరు 27న జరుపుకోవడానికి పచ్చజెండా ఊపింది. ఈ రోజునే ఎంచుకోవడానికి బలమైన కారణం కూడా ఉంది. 1970 సెప్టెంబరు 27న UNWTO(ఐరాస వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) అధికారిక హోదాను అందుకుంది. అందువల్ల సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

* ప్రాముఖ్యత..
ప్రపంచాన్ని ఒక చోట చేర్చే సామర్థ్యం పర్యాటకానికి ఉంది. అంతర్జాతీయ సమాజంలో ఈ రంగం ప్రమేయం అనేక అంశాల్లో సానుకూల వృద్ధి పెంపొందిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఉపాధి కల్పనలో టూరిజం కీలక పాత్ర పోషిస్తుంది. సంస్కృతి, చరిత్ర విషయంలో.. పర్యాటకాన్ని ప్రోత్సహించడం కంటే సంరక్షించడం చాలా ముఖ్యం.

* థీమ్..
ఈ సంవత్సరం "సమగ్ర వృద్ధి కోసం పర్యాటకం"(Tourism for inclusive Growth) అనే థీమ్‌తో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారింది. మహమ్మారి కారణంగా అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం కూడా ఒకటి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ థీమ్‌ను యూఎన్ డబ్ల్యూటీఓ ప్రతిపాదించింది. ప్రపంచ దేశాలను నిదానంగా సాధారణ స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజాన్ని పునఃప్రారంభించేందుకు ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సహకరంగా ఉంటుందని చెప్పింది. అంతేకాకుండా పురోగతి ఫలితాలను ప్రపంచంలోని ప్రతి మూలకు విస్తరించాలని, ఏ కమ్యునిటీ ఈ విషయంలో వెనుకంజలో ఉండకూడదని నిర్ణయించింది.
Published by:John Naveen Kora
First published: