HealthyLife : ఈ మూడు చిట్కాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి..

ప్రతీకాత్మక చిత్రం

Health Tips : శారీరక శ్రమ లేని పనులు చేసేవారు.. జంక్ ఫుడ్,అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకుంటే త్వరగా లావెక్కిపోతారు. కాబట్టి రోజువారీ డైట్‌లో కొద్దిగా మార్పులు చేసుకోవాలి.

 • Share this:
  కెరీర్‌లో పడి బిజీ జీవితాల్లో కొట్టుకుపోతూ.. ఏం తింటున్నామో, ఎలాంటి జీవన విధానం ఫాలో అవుతున్నామో పట్టించుకునే తీరిక కూడా చాలామందికి లేకుండా పోయింది. ఫలితంగా చిన్న వయసులోనే అనేక జబ్బులు ముసురుకుంటున్నాయి. 25 ఏళ్లకే సుగర్,బీపీ సమస్యలు వచ్చేస్తున్నాయి. మరి వీటికి పరిష్కార మార్గమేంటి..? మన రోజువారీ లైఫ్ స్టైల్‌లో కొద్దిగా మార్పులు చేసుకోవడమే దీనికి అసలైన పరిష్కారం. అందులో ముఖ్యమైనవి.. ఉదయం పూట నడక, ఆహారం విషయంలో జాగ్రత్తలు,సరైన నిద్ర.. ఈ మూడింటిని పాటించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి.

  ఆఫీస్ ఉన్న రోజు గబగబా నిద్రలేవడం.. హడావుడిగా రెడీ అయి వెళ్లిపోవడం.. సాయంత్రానికి ఎప్పుడో అలసిపోయి ఇల్లు చేరడం..ఈరోజుల్లో చాలామందిది ఇదే దినచర్య. పైగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు చాలానే అందుబాటులోకి రావడంతో.. ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ చేసి ఆ పూటకు అలా కానిచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి లైఫ్ స్టైల్‌తో మానసిక,శారీరక ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ స్టైల్‌లో కొద్దిపాటి మార్పులు అవసరం. పొద్దంతా ఆఫీస్‌లో కూర్చునే పని చేయడం.. దానికి తోడు అధిక కేలరీలు ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరం లావెక్కుతుంది. మానసిక ఒత్తిళ్లు మరిన్ని సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి రోజువారీ జీవితంలో నడకకు ప్రాధాన్యతనివ్వాలి. తద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడం కోసం..మానసికంగాను ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి ప్రతీరోజూ ఉదయం లేదా సాయంత్రం గ్రౌండ్‌కు వెళ్లి కాసేపు పరిగెత్తడమో,నడవడమో చేయాలి.

  ఇకపోతే ఆహారం గురించి చెప్పుకోవాలి. ఈరోజుల్లో రకరకాల వెరైటీల పేరుతో జంక్ ఫుడ్,మసాలా ఫుడ్ తినడం ఎక్కువైపోయింది.శారీరక శ్రమ లేని పనులు చేసేవారు.. ఇలాంటి ఆహారం తీసుకుంటే త్వరగా లావెక్కిపోతారు. కాబట్టి రోజువారీ డైట్‌లో కొద్దిగా మార్పులు చేసుకోవాలి.జంక్ ఫుడ్,మసాలా ఫుడ్ వీలైనంత వరకు దూరం పెట్టాలి. అధిక కొవ్వు,చక్కెర పదార్థాలను మితంగా తీసుకుంటేనే మంచిది. అలాగే పచ్చళ్లు,ఆయిల్ వంటకాలు,డీప్ ఫ్రై వంటకాలను తగ్గించాలి. చక్కగా కూరగాయలను ఉడికించి చేసిన ఆహార పదార్థాలతో భోజనం చేయాలి.


  ఇక పని ఒత్తిళ్లతో.. వ్యక్తిగత జీవితంలోని ఒత్తిళ్లతో నిద్రకు దూరమవుతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. కాబట్టి ఆఫీస్‌లో ఎంత ఒత్తిడి ఉన్నా సరే.. ఇంటికి
  రాగానే వాటి గురించి ఆలోచించడం మానేయాలి. ఇంట్లో వాళ్లతో సరదాగా గడపడం ద్వారా ఆ విషయాలను మరిచిపోవాలి. సాయంత్రం పూట శుభ్రంగా స్నానం చేసి.. భోజనం తర్వాత కాసేపు ఏదైనా పుస్తకం చదువుకుని.. అలా పక్క మీద వాలిపోతే మంచి నిద్రలోకి జారిపోతారు. నిద్రలేమితో చిన్నతనంలోనే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. నిద్రకు ప్రాధాన్యనివ్వడం
  చాలా అవసరం.

  Published by:Srinivas Mittapalli
  First published: