‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కంచన, వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి’ అన్నట్టు వేంకటాద్రిని మించిన క్షేత్రం ఈ బ్రహ్మాండంలో లేదు.. అలాగే వేంకటేశ్వర స్వామిని మంచిన దేవుడు భూత, భవిష్యత్తు కాలాల్లో లేడనేది భవిష్య పురాణం చెబుతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అలిగి వెల్లిపోయిన శ్రీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహా విష్ణువు..వేంకటేశ్వర స్వామిగా వెలిసిన ఇల వైకుంఠం తిరుమల. వేం అంటే పాపాలు.. కట అంటే నశింపచేసేది.. మనుషుల పాపాలను నశించచేసే ‘వేంకటేశ్వర స్వామి’గా కోట్లాది భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తున్నాడు. అలాంటి వేంకటేశ్వర స్వామి తెలుగు నేలపై కొలువై ఉండటం తెలుగువాళ్లు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి అంటే తెలుగు వారికి ఎంతో ప్రీతి. ఎక్కడున్న ఎంతో భక్తితో స్వామిని కొలుస్తారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో చక్రధర్ పూర్‌లో ఎంతో మంది తెలుగువాళ్లు ఉద్యోగ రీత్యా స్థిర పడ్డారు. వారంత స్వాతంత్య్రానికి పూర్వమే 1928లో ఒక అసోసియేషన్‌గా ఏర్పడి అన్ని పండగలను ఎంతో ఘనంగా చేసుకుంటారు.
జార్ఖండ్‌కు చెందిన ఈ తెలుగు అసోసియేషన్ వాళ్లు..1983లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలిన ఒక ఆలయాన్ని నిర్మించారు. ప్రతియేట వైశాక మాసంలో వచ్చే శ్రవణం నక్షత్రం రోజున వీరు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో కన్నుల పండువగా నిర్వహిస్తుంటారు. అంతేకాదు ఇక్కడి పూజలను సైతం తిరుమల ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్వహిస్తారు. బిహార్ నుంచి ఝార్ఖండ్ విడిపోక ముందే ఈ వేంకటేశ్వరాలయం ఒక రిజిస్టర్ బాడీ.
ఈ యేడాది కూడా మే 24వ తేది నుంచి 30 వ తేది వరకు స్వామి వారి 36వ బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ మహా క్రతువు నిర్వహించడానికి తిరుమల పండితులను తీసుకొచ్చి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు అసోసియేషన్ కుటుంబాలతో పాటు చుట్టు పక్కల ఊర్లలోని భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామి దర్శనం చేసుకుంటారు.తిరుమల తిరుపతిలో జరిగినట్టే ఆగమ శాస్త్రానుసారమే అంకురార్పణతో స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించి.. చక్రస్నానంతో ముగించడం ఆనవాయితిగా వస్తోంది. ప్రస్తుతం ఈ తెలుగు అసోసియేషన్‌కు KKT రావు ప్రెసిడెంట్‌గా.. సెక్రటరీగా VVR మూర్తి ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jharkhand, Jharkhand Lok Sabha Elections 2019, Lord Sri venkateshwara Swamy, Srivari brahmotsavam, Ttd