• HOME
 • »
 • NEWS
 • »
 • LIFE-STYLE
 • »
 • THE TRIBE FROM CHHATTISGARH HAVE TATTOOS OF LORD RAM ON THEIR ENTIRE BODY BA KMM

Photos: రామ రామ రామ రామ.. ‘దేహమేరా రామాలయం’.. ఈ తెగ వారికి ఒళ్లంతా రాముడి పచ్చబొట్లే..

Photos: రామ రామ రామ రామ.. ‘దేహమేరా రామాలయం’.. ఈ తెగ వారికి ఒళ్లంతా రాముడి పచ్చబొట్లే..

రామ నామం దేహంపై టాటూగా వేసుకున్న తెగ

నిత్య జీవితంలో ఈ తెగ వారు ఆచరించే ప్రతి పని అత్యంత ఆసక్తికరంగానే ఉంటుంది. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా శ్రీరాముడు వీరిని ఆవహించినట్లుగానే ప్రవర్తించడం పరిపాటి. నిత్యం రామ నామ జపం వీరి ప్రథమ విధి.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)

  టాటూస్‌.. నేటి యూత్‌కు పిచ్చ క్రేజీ.. తమ ప్రేమికులు.. స్నేహితులు.. ఇంకా తాము అభిమానించే సినీహీరోల పేర్లు.. రకరకాల ఆకృతుల్లో ఒళ్లంతా వేయించుకుంటుంటారు. మరికొందరు ప్రకృతి ప్రేమికులు పక్షులు.. రకరకాల పూల ఆకృతుల్లోనూ.. ఇంకా చెప్పాలంటే క్రికెట్‌ స్టార్లు.. టెన్నిస్‌.. సాకర్‌.. బాస్కెట్‌బాల్‌ హీరోలు.. జిమ్నాస్టిక్స్‌ దిగ్గజాలు.. రిజ్లింగ్‌ స్టార్లు సైతం ఒళ్లంతా పచ్చబొట్లు. . అదే టాటూస్‌ వేయించుకునే సంస్కృతి చూస్తునే ఉన్నాం.. ఇదేదో ఈనాటి ఆధునిక స్టైల్‌ ఎంతమాత్రం కాదని.. వందల ఏళ్ల నుంచి గిరిజన తెగల్లో ఓ విశ్వాసంగా వస్తోందని రుజువైంది. ఎందుకంటే తనువంతా.. ఒక్కమాటలో చెప్పాలంటే కనురెప్పల పైన సైతం పచ్చబొట్లు వేయించుకోవడం అంటే వారికి ఆ పని పట్ల ఉన్న గౌరవం.. భక్తి.. శ్రద్ధలను అర్థం చేసుకోవచ్చు. ఇదేదో అమెరికానో.. యూరోప్‌లోనో ఎంతమాత్రం కాదు.. అభివృద్ధికి ఆమడ దూరంలో పడి ఉన్న చత్తీస్‌ఘడ్‌ అటవీప్రాంతంలో మారుమూల గిరిజన తెగల్లో కనిపించిన ఆచారం. నిజం చెప్పాలంటే ప్రస్తుత ఆధునిక ప్రపంచం ఫ్యాషన్‌గా పిలుచుకునే ఈ టాటూ సంస్కృతి కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ గిరిజన తెగల్లో పరంపరగా వస్తూనే ఉంది. అసలేంటి ఈ ఆచారం..

  చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని రామనామి తెగలోని గిరిజనం అంతా ఇలా పచ్చబొట్టు వేయించుకోవడం వారి ఆచారం... పేరుకే చత్తీస్‌ఘడ్‌లో ఉండేది.. వీరి మనసంతా దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే భద్రాచలంలోనే అంటే అతిశయోక్తి కాదు. రాయగఢ్‌ జిల్లా సారంగఢ్‌ తాలూకాలోని నందేలి అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ తెగలో.. పుట్టిన ప్రతి శిశువుకు పచ్చబొట్టు పడాల్సిందే. అది ఆడ అయినా మగ అయినా.. రామనామ జపం చేయాల్సిందే.. రామ రామ అంటూ హిందీలో ఒళ్లంతా పచ్చబొట్టు పొడిపించుకోవాల్సిందే. ఇదేదో ఎవరి బలవంతం మీదో వేయించుకునేది కూడా కాదు. వారంతా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే భగవత్‌ విధి ఇది.

  తాము వాడే వస్త్రంపై రామ నామం


  ఒక వరుస క్రమంలో.. ఒక పద్దతిగా.. మరో మాటలో చెప్పాలంటే రామ నామమే వారి దేహానికి వస్త్రంగా ఉన్నట్టు.. అదే ఆభరణంగా కనిపిస్తూ ఉంటుంది. పాదం నుంచి తల దాకా.. ఎక్కడా వదలకుండా చివరకు పెదాలు.. ముక్కు.. కను రెప్పలను సైతం వదలకుండా ఈ తెగలో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. తాము తరాలుగా కొలిచే దేవుడు రాముని పట్ల వీరు చూపే భక్తి ఇది.

  ఈ తెగ వారు వాడే టోపీ మీద కూడా రామ నామం


  నిత్య జీవితంలో ఈ తెగ వారు ఆచరించే ప్రతి పని అత్యంత ఆసక్తికరంగానే ఉంటుంది. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా శ్రీరాముడు వీరిని ఆవహించినట్లుగానే ప్రవర్తించడం పరిపాటి. నిత్యం రామ నామ జపం వీరి ప్రథమ విధి. ఇక మాంసాహారం, మద్యపానం, ధూమపానం లేకుండా నియమనిష్టలతో జీవనం సాగించడం వీరి ప్రత్యేకత. తమ కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా రామ నామంతోనే మొదలు. తరతరాలుగా ఇదే వీరు పాటిస్తున్న ధర్మం.

  తాము వాడే వస్త్రం, తల పాగాపై రామ నామం


  సామాజిక తిరస్కారంతోనే మొదలు.. రెండొందల ఏళ్ల క్రితం తమ తెగలో మొదలైనట్టు చెప్పుకునే ఈ ఆచారం అసలు ప్రారంభమే తిరస్కారంతోనట. ఈ తెగకు మూల పురుషునిగా వీరు కొలిచే పరశురాం అనే వ్యక్తి తొలిసారిగా తన నుదిటిపై శ్రీరామ నామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకున్నట్టు చెబుతుంటారు. అప్పట్లు ఈ తెగలోని వారిని దేవాలయాల్లోకి అనుమతించకపోవడం వల్లే.. తమ నుంచి దేవుణ్ని దూరం చేయడం ఎవరి వల్లా కాదన్న తమ నమ్మకాన్ని చాటుకోడానికే ఇలా ఒళ్లంతా పచ్చబొట్టు పొడిపించుకోవడం మొదలైనట్టు చెబుతారు. అలా మొదలైన ఆచారం 'శ్రీరామనామి సమాజ్‌' ఆవిర్భావానికి నాంది అయినట్టు వీరు నమ్ముతారు.

  దేహంపై రాముడి టాటూ


  ఒంటి పైనే కాకుండా వీరు వాడే ప్రతి వస్తువు.. సామగ్రి.. చివరకు ఉండే ఇంటిలోనూ రామనామమే.. ధరించే శిరస్త్రానంపైనా రామనామమే.. ధరించే వస్త్రాలు.. పర్వదినాల్లో తలపై పెట్టుకునే ప్రత్యేక నెమలిఈకలతో చేసిన శిరస్త్రానంపైనా రామనామమే.. ఇలా తనువంతా రామనామంతో నడిచే వీరి జీవనం అలి సామాన్యం. వీరు ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే భజన, మేళా కార్యక్రమానికి ఆహ్వానం లభించడం ఆ ప్రాంతంలోని వీఐపీలు, రాజకీయ నేతలు సైతం అదృష్టంగా భావిస్తారట.. అస్సలు మిస్‌ కారట.. పైపెచ్చు అదే మేళాలోనే ఈ తెగలోని యువతీయువకులకు పెళ్లిళ్లు కూడా జరిపిస్తారట మరి. వీరి ప్రతి పని ప్రత్యేకమేనంటే నమ్మాల్సిందే. అదే రామనామి తెగ.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు