వీర్య కణాలలో సమస్యల వల్ల ప్రస్తుతం చాలామంది దంపతులు పిల్లలు (Children) పుట్టక ఇబ్బంది పడుతున్నారు. పురుషులలో 10% నుండి 20% వంధ్యత్వానికి సంబంధించిన కేసులు వారి వీర్య కణాల(sperms) నాణ్యతకు సంబంధించిన సమస్యల నుండి ఉత్పన్నమవుతాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల అతి వినియోగం, మధ్యపానం, ధూమపానం (Smoking) , చెడు ఆహారపు అలవాట్లు మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణాలు. తద్వారా, సంతానోత్పత్తి విషయంలో అనేక సమస్యలు వస్తాయి.
అందువల్ల, మీ శరీరంలో వీర్యకణాల సంఖ్యను, కణాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించాలి. దీనికోసం మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తుండాలి. అనారోగ్య జీవనశైలి మీ సంతానోత్పత్తిని దెబ్బతీస్తుందని గుర్తించుకోండి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మీ రోజువారీ ఆహారంలో జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ డితో పాటు మరికొన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి. మీ స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ పెరగడానికి దోహదపడే మల్టీ విటమిన్లపై ఓలుక్కేయండి.
1. విటమిన్ ఈ
విటమిన్–ఈ కొవ్వులో కరిగే విటమిన్. ఒక అధ్యయనం ప్రకారం పురుషుల వంధ్యత్వ సమస్యను తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందట. పురుషులు సెలీనియంతో పాటు విటమిన్ ఈ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి రెండూ మీ వీర్య కణాల నాణ్యతను పెంచి తద్వారా మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతి రోజూ 15 మి.గ్రా విటమిన్ ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే, ఇది 180 మి.గ్రా మించకూడదని గుర్తించుకోండి. ఎందుకంటే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
2. విటమిన్ సి
విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాక, ఇది ఓ యాంటీఆక్సిడెంట్, స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో విటమిన్ సి, ఎల్-కార్నిటైన్, విటమిన్ ఈ, జింక్ వంటివి చక్కగా పనిచేస్తాయి. అందువల్ల, ప్రతిరోజు 1000 నుంచి -2000 మి.గ్రా విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
3. ఎల్-కార్నిటైన్
ఎల్-కార్నిటైన్ స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ కదలికలను పెంచడానికి సహాయపడుతుంది. మానవ శరీరం లో సాధారణంగానే తగినంత మొత్తంలో కార్నిటైన్ తయారవుతుంది. అయినప్పటికీ, మీ వీర్య కణాల సంఖ్య, నాణ్యతలో లోపాలుంటే శరీరంలో తగినంత స్పెర్మ్ కౌంట్ మెయింటెయిన్ చేయడానికి 2 నెలల పాటు రోజుకు 2 గ్రాముల కార్నిటైన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
4. విటమిన్ డి
విటమిన్ డి కొవ్వు ఎక్కువగా కరిగే విటమిన్. ఇది కడుపులో మంటను తగ్గించడానికి, కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిలను నిర్వహించడానికి, కణాల పెరుగుదలను నియంత్రించడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం శరీరంలో విటమిన్ డి స్థాయులు ఎక్కువగా ఉంటే అవి కాల్షియం స్థాయిలను నియంత్రించేందుకు తోడ్పడతాయట. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందువల్ల, రోజుకు 15 ఎంసిజి విటమిన్ డిని తీసుకోవాలని నిపుణలు సిఫార్సు చేస్తున్నారు.
5. జింక్
జింక్ వీర్య కణాల కదలికలో అండంతో కలిసే సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. శారీరక సామర్థ్యాన్ని పెంచడానికి జింక్ అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో జింక్ తగినంతగా లేనందువల్లే మగవారిలో వంధ్యత్వం సమస్యలు పెరుగుతున్నాయని ఇటీవలి అధ్యయనంలో తేలింది. జింక్ కి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి, స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ పనితీరును పెంచే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల, రోజుకు 40 మి.గ్రా జింక్ సప్లిమెంట్స్ తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే పరిమితికి మించి జింక్ సప్లిమెంట్స్ తీసుకుంటే వాంతులు, విరేచనాలు, తలనొప్పి, రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావడం వంటి హానికరమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది.
6. ఫోలిక్ ఆమ్లం
ఫోలిక్ ఆమ్లం వీర్య కణాల నాణ్యతను పెంచడంలో సహాయపడే నీటిలో కరిగే బి విటమిన్. అయితే, పెద్దలు రోజుకు 400 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ ఫోలిక్ ఆమ్లం తీసుకోకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ప్రినేటల్ విటమిన్లు తీసుకోవచ్చా?
సహజంగా పురుషుల్లో వీర్యం నాణ్యత ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వీర్యం నాణ్యత తగ్గితే.. ఎల్-కార్నిటైన్, విటమిన్ ఈ, ఒమేగా 3 డిహెచ్ఎ/ ఫిష్ ఆయిల్ ఉండే ఆహారం తీసుకోవడం ప్రారంభించాలని నిపుణులు సలహాలిస్తున్నారు. ఎందుకంటే ఈ పదార్ధాలు గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
స్పెర్మ్ లోపానికి కారణాలు
అధిక మద్యపానం, ధూమపానం, ఊబకాయం, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం, ఒత్తిడి, డిప్రెషన్, నిద్ర లేమి వంటివి వీర్య కణాల సంఖ్య, నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణాలు. అందుకే చెడు అలవాట్లు తగ్గించుకోవడం, బరువు తగ్గేందుకు ప్రయత్నించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయడం వల్ల వీర్య కణాల సంఖ్య, నాణ్యత సహజంగానే మామూలుగా మారుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sperm