మానవ నాడీ వ్యవస్థ అనేది శరీరంలో అత్యంత ప్రత్యేకమైన నెట్‌వర్క్‌గా చెప్పుకోవచ్చు. చూపు, వాసన, మాట్లాడటం దగ్గరి నుంచి నడక వరకు ప్రతిదాన్ని మన నాడీ వ్యవస్థ నిర్వహిస్తుంది. అయితే ఈ రోజుల్లో నాడీ సంబంధిత సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. నరాల వ్యాధులు, నరాల బలహీనత వంటివి మనిషిని కృంగదీసే సమస్యలు. అయితే ఇలాంటి వాటిని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చని చెబుతున్నారు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ బ్రాంచ్ కావేరి హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ సోనియా తాంబే (MD, DM (న్యూరాలజీ), కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎపిలెప్టాలజిస్ట్). ఈ లక్షణాలు ఏవో తెలుసుకుందాం.
* నొప్పి
నరాలు దెబ్బతినడం వల్ల న్యూరోజెనిక్ పెయిన్ (Neurogenic pain) వస్తుంది. డిస్క్ వ్యాధి, స్పాండిలోసిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటివి ఈ నొప్పికి కారణాలుగా చెప్పవచ్చు. కొన్నిసార్లు ఫైబ్రోమైయాల్జియా వల్ల ఎక్కువ కాలం వేధించే నొప్పి (chronic pain) వస్తుంది. ఇది అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి, మానసిక సమస్యలతో పాటు కండరాల నొప్పితో కూడిన రుగ్మత. క్రానిక్ పెయిన్ అనేది ఒక వ్యక్తికి బలహీనపరుస్తుంది. కాబట్టి ఈ సమస్యను ముందస్తుగా గుర్తించడంతో పాటు సమయానికి చికిత్స చేయడం ముఖ్యం.
* తలనొప్పి
తలనొప్పి అనేది సర్వసాధారణమైన నాడీ సంబంధిత సమస్య లక్షణాల్లో ఒకటి. దీంతోపాటు మెడ నరాల్లో నొప్పి కూడా ఉండవచ్చు. సాధారణ (ప్రైమరీ) తలనొప్పి, మైగ్రేన్, టెన్షన్ టైప్ తలనొప్పి, క్లస్టర్ తలనొప్పి లేదా సెకండరీ తలనొప్పి వంటి ఎటియాలజీలో కనుగొనలేని (కారణాలు తెలుసుకోలేని) నాడీ వ్యాధులకు సంకేతాలు. అలాగే అధిక రక్తపోటు, సైనసిటిస్, మెదడులో రక్తం గడ్డకట్టడం, మెదడు ఇన్‌ఫెక్షన్లు, గాయం, మెదడు కణితులు, అనూరిజమ్‌ల వల్ల వచ్చే తలనొప్పిని కూడా నాడీ వ్యాధికి లక్షణంగా చెప్పవచ్చు.
ప్రైమరీ తలనొప్పి అనేది నిరంతరం వస్తుంటే, వైద్యులను సంప్రదించాలి. ఇది తీవ్రంగా రావడంతో పాటు జ్వరం, నీరసం, డబుల్ విజన్, కంటి చూపు తగ్గడం, మూర్ఛలు, తలకు గాయమైన తర్వాత తలనొప్పి.. వంటివి ఉంటే కచ్చితంగా నరాల వ్యాధులు ఉన్నట్లు అనుమానించాలి. అకస్మాత్తుగా ప్రారంభమైన, అత్యంత భయంకరమైన తలనొప్పి.. బ్రస్ట్ బ్రెయిన్ అనూరిజం వల్ల సంభవించవచ్చు, ఇది ప్రాణాపాయం కూడా కావచ్చు. అందుకే తలనొప్పి నిరంతరం వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* తల తిరగడం (Vertigo)
తల తిరగడం లేదా వెర్టిగో అనేది శరీరాన్ని ఇబ్బంది పెట్టే స్పిన్నింగ్ సెన్సేషన్. దీనివల్ల బాధితులు గందరగోళంగా ఉంటూ, బ్యాలెన్స్ కోల్పోతారు. ఇది ఒక వ్యక్తిని చాలా బలహీనంగా మారుస్తుంది. శరీరంలోని బ్యాలెన్స్ సిస్టమ్‌లో సమస్యల వల్ల వెర్టిగో వస్తుంది. దీన్ని పెరిఫెరల్ వెర్టిగో, సెంట్రల్ వెర్టిగోగా వర్గీకరించవచ్చు. పెరిఫెరల్ వెర్టిగో అంటే.. అకస్మాత్తుగా తల తిరగడం. ఇది అప్పుడప్పుడు తక్కువ వ్యవధిలో వస్తుంది.
చెవులలో టిన్నిటస్ లేదా వినికిడి సమస్యలు కూడా దీనితో పాటు ఉండవచ్చు. వాంతి కూడా కావచ్చు. సెంట్రల్ వెర్టిగో అనేది మెదడులోని సమస్యల వల్ల వస్తుంది. బ్యాలెన్సింగ్‌లో తీవ్రమైన ఇబ్బంది, చూపు మసకబారడం, తిమ్మిరి పట్టడం, తల నరాల నొప్పి వంటివి దీనితో పాటు కనిపిస్తాయి. అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన వెర్టిగో, స్ట్రోక్ వల్ల సంభవించవచ్చు. అందువల్ల ఈ లక్షణాలు గుర్తించిన ప్రారంభంలోనే వైద్య సహాయం తీసుకోవాలి.
* జ్ఞాపకశక్తి తగ్గడం
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది పెద్దవారిలో సాధారణంగా గమనిస్తాం. వృద్ధాప్యంలో ఒక నిర్దిష్ట స్థాయి జ్ఞాపకశక్తి కోల్పోవడం సాధారణమే. అయితే మతిమరుపు, ఆర్థిక విషయాల నిర్వహణలో ఇబ్బందులు, రోజువారీ పనుల్లో ఇబ్బందులు, కుటుంబ సభ్యుల, స్నేహితుల పేర్లను మరచిపోవడం లేదా భాషాపరమైన సమస్యలు వంటి డిమెన్షియా లక్షణాలు గుర్తిస్తే.. ఇది నరాల వ్యాధులకు కారకంగా మారవచ్చు. ఈ సమస్య భవిష్యత్తులో తీవ్రంగా మారవచ్చు. అందుకే బాధితులు న్యూరాలజిస్ట్‌ను కలిసి వైద్య సాయం తీసుకోవాలి. దీనికి పూర్తి స్థాయిలో చికిత్స లేనప్పటికీ, లక్షణాలను గుర్తించి, సమస్యను కంట్రోల్ చేయడానికి సహాయపడే మందులు, చికిత్స మార్గాలు ఉన్నాయి.
* మూర్ఛలు (Seizures)
మూర్ఛ అనేది మెదడు కణాల మధ్య అనియంత్రిత విద్యుత్ కార్యకలాపాల కారణంగా ఏర్పడుతుంది. ఇది మజిల్ టోన్ (కండరాలు గట్టిపడటం, మెలితిప్పినట్లు అవ్వడం లేదా లింప్‌నెస్), స్పృహ కోల్పోవడం, నోటి నుంచి నురగ రావడం.. వంటివి పరిస్థితులకు కారణమవుతుంది. మందులు, తీవ్రమైన జ్వరం వంటి సమస్యల కారణంగా ఇది రావచ్చు. లేదా మూర్చరోగం (Epilepsy) ఉన్నవారికి నిరంతరం ఇలా జరగవచ్చు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. ఫోకల్ సీజర్స్ ఉంటే.. మూర్ఛ శరీరంలోని ఒక భాగంలో ప్రారంభమవుతుంది. మొత్తం శరీరం మూర్చపోతే, దాన్ని జనరలైజ్డ్ సీజన్ అంటారు. వైద్యులు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, MRI బ్రెయిన్, ఇతర క్లినికల్ టెస్టులతో ఈ సమస్యను గుర్తించి, మందులు ఇస్తారు.
* పక్షవాతం లేదా బలహీనత
శరీరంలోని ఏదైనా భాగంలో బలహీనత (Weakness) ఏర్పడితే.. ఆ ప్రభావం శరీరం మొత్తంపై పడుతుంది. ఇది నాడీ సమస్యల వల్ల రావచ్చు. ఈ పక్షవాతంలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ కండరాల బలహీనతను ఫేషియల్ పాల్సీ అని, ఒక అవయవం బలహీనపడడాన్ని మోనోపరేసిస్ అని, శరీరంలో సగం బలహీనతను హెమిపరేసిస్ అని, రెండు కాళ్ల బలహీనతను పారాపరేసిస్ అని అంటారు.
సడన్ వీక్‌నెస్ అనేది స్ట్రోక్ లక్షణం కావచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కణితులు, గాయం, ALS (అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్) వంటి డీజెనరేటివ్ కారణాలు, పోలియోమైలిటిస్ వంటి అంటువ్యాధులు, మైయోసిటిస్ వంటి ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్స్ కూడా ఈ సమస్యలకు కారణాలు కావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brain, Health care, Health Tips