చాలామంది పగలంతా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా రాత్రి పూట ఆకలి వేసి ఏదో ఒక స్నాక్స్ తినడం అలవాటుగా మారిపోతుంది. మరికొందరు రాత్రి ఆలస్యమయ్యే వరకు మెలకువగా ఉంటారు. ఆకలి వేసి మధ్య రాత్రి వరకు ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలాంటివారు ఆ తర్వాత రోజు ఆఫీస్ పనిలో పెద్దగా ఆసక్తి చూపించలేరని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ అనే జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం పనిలోనూ ప్రభావాన్ని చూపిస్తుందని మొదటిసారి నిరూపితమైంది అని దీన్ని నిర్వహించిన అధ్యయనకారులు వెల్లడించారు. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు నిర్వహించిన ఈ అధ్యయనంలో ఎన్నో ముఖ్య విషయాలు తెలిశాయట. దీని గురించి మాట్లాడుతూ నిద్ర, వ్యాయామం, ఆహారం వంటివి అన్నీ మనం చేసే పనిపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు. కానీ ఇలా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయో చాలామంది అధ్యయనం చేశారు కానీ స్వల్ప కాలంలో అంటే ఆ మరుసటి రోజు లేదా ఆ వారంలో ఎలాంటి ప్రభావాలుంటాయన్నది ఇప్పటివరకు నిరూపితం కాలేదు. అందుకే మేం దీనిపై అధ్యయనం చేశాం. అన్నారు సోఫియా చో. ఆమె ఈ అధ్యయనానికి లీడ్ ఆథర్ గా వ్యవహరించారు.
ఈ సర్వేలో భాగంగా అధ్యయనకారులు రెండు ప్రధాన ప్రశ్నలకు సమాధానం రాబట్టాలనుకున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు అది వారిని ఆ తర్వాత రోజు ప్రభావితం చేస్తుందా? ఒకవేళ చేస్తే ఎందుకు? అని రెండు ప్రశ్నలు వారి మనసులో ఉన్నాయి. దీనికి సమాధానాల కోసం వారు అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో అమెరికాకి చెందిన 97 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరందరినీ పది రోజుల పాటు ప్రతి రోజు మూడు సార్లు కొన్ని ప్రశ్నలు అడిగారు. రోజు ఉదయాన్నే అంతకుముందు రోజు చేసిన పనుల గురించి వారు ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో కనుక్కునేవారు. రోజూ సాయంత్రం ఆరోజు వారు ఆఫీస్ లో ఎలాంటి పనులు చేశారు.. ఎన్ని పనులు చేశారు.. వారికి కేటాయించిన పనులన్నింటినీ పూర్తి చేయగలిగారా? లేదా? అన్న విషయాలను పంచుకునేవారు. రాత్రి పడుకోవడానికి ముందు ఆరోజు వారు ఏం తిన్నారు.. ఏం తాగారు అన్న విషయాలను పంచుకునేవారు. దీని ద్వారా వారు ఎలాంటి ఆహారం తీసుకున్నారో తెలుసుకున్నారు అధ్యయనకారులు.
Watch Video హోం క్వారంటైన్ లో పవన్ కళ్యాణ్
ఈ సర్వేలో తేలిన విషయమేంటంటే ఎవరైతే రాత్రి ఆలస్యంగా మిడ్ నైట్ స్నాక్స్ తీసుకోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చేశారో.. వారికి మరుసటి రోజు పనిలో పెద్దగా ఆసక్తి ఉండడం లేదని.. వారు ఇతరులకు సాయం చేయడానికి కానీ ముఖ్యమైన పనులు చేయడానికి కానీ ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. దీన్ని బట్టి మరుసటి రోజు ఆఫీస్ లో యాక్టివ్ గా పనిచేయాలంటే రాత్రి ఆరోగ్యకరమైన ఆహారం వీలైనంత తొందరగా చేసి, తొందరగా నిద్రపోవాలని తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Lifestyle